Jayawardene: ఇండియన్ ప్రీమియర్ లీగ్ {ఐపీఎల్} 2025లో భాగంగా {మార్చి 29} నేడు అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్ – ముంబై ఇండియన్స్ జట్లు తలపడనున్నాయి. ఈ రెండు జట్ల మధ్య ఆసక్తికర పోరు రాత్రి 7:30 గంటలకు ప్రారంభం అవుతుంది. ఈ సీజన్ లో గుజరాత్ టైటాన్స్ తన తొలి మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ పై 11 పరుగుల తేడాతో ఓడిపోయింది.
మరోవైపు ఐపీఎల్ లో ఐదు సార్లు ఛాంపియన్ అయిన ముంబై ఇండియన్స్ కూడా తొలి మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో 4 వికెట్ల తేడాతో ఓటమిని చవిచూచింది. ఇప్పుడు గుజరాత్ – ముంబై జట్ల లక్ష్యం ఈ సీజన్ లో తొలి విజయం సాధించడమే. ఈ మ్యాచ్ లో ఇరుజట్లు అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధంగా ఉన్నాయి. అయితే ముంబై జట్టు ప్లేయింగ్ 11 పై ఇప్పుడు ఆసక్తికర చర్చ జరుగుతోంది. ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ లోకి కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఎంట్రీ ఖాయం అయ్యింది.
గత సీజన్ లో నిషేధం కారణంగా హార్దిక్ పాండ్యా చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన తొలి మ్యాచ్ కి దూరం అయ్యాడు. ఇప్పుడు రెండవ మ్యాచ్ కి హార్దిక్ పాండ్యా తిరిగి రావడం జట్టు బ్యాటింగ్ కి మరింత బలం చేకూరింది. అయితే జట్టు నిండా స్టార్లు ఉన్నప్పటికీ ఒక్కరు కూడా సామర్థ్యం మేరకు రాణించలేకపోతున్నారు. తొలి మ్యాచ్ లో రోహిత్ శర్మ డకౌట్, రికెల్టన్, విల్ జాక్స్ తక్కువ స్కోరుకే పరిమితం కావడం, సూర్య కుమార్ యాదవ్, తిలక్ వర్మ కాస్త పరవాలేదనిపించినా.. మరోవైపు బౌలర్లు చేతులెత్తేయడంతో తొలి మ్యాచ్ లో ఓటమిని చవిచూసింది ముంబై ఇండియన్స్.
ఇక గుజరాత్ టైటాన్స్ తో జరిగే మ్యాచ్ కి ముందు ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్ మహేలా జయవర్ధనే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జస్ ప్రీత్ బూమ్రా ఫిట్నెస్ గురించి అప్డేట్ ఇచ్చారు. బుమ్రా మినహా జట్టులోని ఇతర ఆటగాళ్లంతా ఈరోజు అహ్మదాబాద్ వేదికగా జరిగే మ్యాచ్ కి సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. బుమ్రా జట్టుకు దూరమైనప్పటికీ చాలా అనుభవిజ్ఞులైన బౌలర్లు జట్టులో ఉన్నారని.. ఇతర జట్లు విసిరే సవాళ్లను తాము ఎదుర్కొంటామని చెప్పుకొచ్చారు.
ఇక బుమ్రా బాగా కోలుకున్నారని జయవర్ధనే తెలిపారు. కానీ అతడి ఎంట్రీ ఎప్పుడు అన్నది చెప్పలేమని పేర్కొన్నారు. బుమ్రాని ఏ మ్యాచ్ లో తీసుకురావాలన్నది తాము టార్గెట్ గా పెట్టుకోలేదని.. తన రోజువారి వర్కౌట్స్ ని క్రమం తప్పకుండా ఏ సమస్య లేకుండా పూర్తి చేస్తున్నాడని తెలిపారు. బుమ్రా ఎప్పటినుండి ఆడొచ్చు అనేదానిపై ఎన్సీఏ ఇప్పటివరకు క్లారిటీ ఇవ్వలేదని పేర్కొన్నాడు జయవర్ధనే. అయితే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సిరీస్ లో బుమ్రా చివరి టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో బౌలింగ్ చేస్తూండగా వెన్ను నొప్పితో ఇబ్బంది పడిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో వెన్నునొప్పి కారణంగా మ్యాచ్ మధ్యలోనే జట్టు డాక్టర్ తో కలిసి స్కానింగ్ కి వెళ్ళాడు. అక్కడ అతడికి గాయం తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు తేలడంతో.. రెండవ ఇన్నింగ్స్ లో మళ్ళీ బౌలింగ్ చేయలేదు. అప్పటినుండి డాక్టర్లు బెడ్ రెస్ట్ తీసుకోవాల్సిందిగా సూచించడంతో ఇంగ్లాండ్ తో జరిగిన టి-20, వన్డే సిరీస్ లకి, ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కి కూడా దూరమయ్యాడు బుమ్రా. ఇక ప్రస్తుతం బుమ్రా కోల్కొని ప్రాక్టీస్ చేస్తున్న నేపథ్యంలో.. అతడు వీలైనంత త్వరగా ముంబై జట్టులో చేరి ఆ జట్టుకు విజయాలను అందించాలని కోరుకుంటున్నారు అభిమానులు.