Pastor Praveen Case: పాస్టర్ ప్రవీణ్ కుమార్ పగడాల మృతిపై ఏలూరు ఐజీ అశోక్ కుమార్ ప్రెస్ మీట్ నిర్వహించారు. సీసీ ఫుటేజీలో రాత్రి 11:42 నిమిషాల వద్ద ప్రమాదం జరిగనట్టు క్లారిటీగా కనిపించడం లేదని అన్నారు. సీసీ కెమెరా ఫుటేజ్, పాస్టర్‌కు సంబంధించిన మొబైల్ డేటా సేకరిస్తున్నామని ఆయన వివరించారు. రోడ్డుప్రమాదం జరిగిందా..? లేదా..? అనే అంశంపై రవాణా శాఖ అధికారులు దర్యాప్తు చేస్తున్నారని చెప్పారు. ఆ సమయంలో ఒక్కసారిగా దుమ్ము పైకి లేచిందని అన్నారు. సీసీ కెమెరాలో అసలు ఏం జరిగిందో స్పష్టంగా కనిపించడం లేదని ఐజీ అశోక్ కుమార్ తెలిపారు.
డాక్టర్లు, ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదక వచ్చిన తర్వాత మరిన్ని ఆధారాలు లభించే అవకాశం ఉందని.. అప్పుడే ఓ నిర్దారణకు రాగలమని పోలీసులు చెప్పారు. పాస్టర్ ప్రవీణ్ కుమార్ పగడాల తన కూతురు పేరు మీద స్థలం కొనుగోలు చేశాడని.. ఆ విషయంలోనే ఆయన రాజమండ్రికి వచ్చారని పోలీసులు వెల్లడించారు. స్థలం రిజిస్ట్రేషన్ కోసమే ఆయన రాజమండ్రికి వచ్చినట్టు తన భార్యకు కూడా తెలుసని చెప్పారు.
ఈ నెల 24వ తేదీన పాస్టర్ ప్రవీణ్ కుమార్ పగడాల ఉదయం 11 గంటలకు హైదరాబాద్ నుంచి బయలు దేరారని పోలీసులు తెలిపారు. రాజమండ్రికి వచ్చే క్రమంలో మధ్యాహ్నం 1 గంటలకు చౌటుప్పల్ టోల్ గేటుకు చేరుకున్నారని.. ఆ తర్వాత విజయవాడలో 3, 4 గంటలు ఉన్నారని పోలీసులు పేర్కొన్నారు. ఎవర్నీ కలిశారు..? ఎందుకు కలిశారు..? అనే దానిపై విచారణ చేస్తున్నామని పోలీసులు చెప్పారు. ఆయన ఎక్కడకు వెళ్లినా ఎవరికీ చెప్పరని ఆయన సన్నిహితులు చెప్పినట్టు పోలీసులు వెల్లడించారు.
అన్ని రిపోర్టులు వచ్చిన తర్వాతనే.. కేసుపై ఓ నిర్దారణకు రాగలమని పేర్కొన్నారు. ప్రవీణ్ వెనుక వెళ్లిన నాలుగు కార్లకు ఈ సంఘటనతో సంబంధం లేదని తేలిందని పోలీసులు వెల్లడించారు. అయితే సోషల్ మీడియాలో ఎవరైనా తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ఎమ్మార్వో సమక్షంలో పాస్టర్ పగడాల ప్రవీణ్ మృతిపై విచారణ చేశామన్నారు. సీఎం చంద్రబాబు, ఏపీ డీజీపీలు రెగ్యూలర్‌గా ఈ కేసుపై చర్చిస్తున్నారని చెప్పారు. పాస్టర్ ప్రవీణ్ పలు టోల్ ప్లాజాల వద్దకు చేరుకున్న సీసీ ఫుటేజీ వీడియోలను ఎస్పీ నరసింహ కిషోర్ విడుదల చేశారు.
ALSO READ: Jobs: టెన్త్ క్లాస్‌తో భారీగా పోలీస్ ఉద్యోగాలు.. ఆలస్యం వద్దు.. ఇంకా ఐదు రోజులే గడువు మిత్రమా..!