Jasprit Bumrah : మాంచెస్టర్ టెస్ట్ సందర్భంగా టీమిండియా (Team India) ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ( Jasprit Bumrah) తన ఫామ్ కొనసాగించడంలో కాస్త ఇబ్బంది పడ్డట్టు కనిపించింది. దీంతో బుమ్రా పై సోషల్ మీడియాలో రకరకాలుగా వార్తలు వినిపిస్తున్నాయి. మూడో టెస్ట్ మ్యాచ్ వరకు టీమిండియా ఫాస్ట్ బౌలర్ మంచి ఫామ్ లో కొనసాగాడు. ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో అగ్రస్థానంలో కొనసాగాడు. భారత జట్టులోనే కాదు.. ప్రపంచంలోనే టాప్ బౌలర్లలో బుమ్రా ఒకడు. మరో నాలుగు నుంచి ఐదేళ్ల పాటు టీమిండియా కి తన బౌలింగ్ సేవలు అందించే అవకాశం ఉంది. బుమ్రా పని భారాన్ని దృష్టిలో పెట్టుకొని తక్కువ మ్యాచ్ లు ఆడేలా.. ప్రధాన మ్యాచ్ లకు రంగంలోకి దించాలని బీసీసీఐ ప్లాన్ చేసింది. ఈ సమయంలోనే బుమ్రా టెస్ట్ క్రికెట్ కి రిటైర్మెంట్ ప్రకటిస్తాడని టీమిండియా మాజీ బ్యాటర్ మహ్మద్ కైఫ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
Also Read : Tim David : ఆర్సీబీ ఆటగాడి విధ్వంసం.. మూడు ఓవర్లలో ఆస్ట్రేలియా 71 రన్స్
బుమ్రా కెరీర్ ముగుస్తుందా..?
జస్ప్రీత్ బుమ్రా తన టెస్ట్ కెరీర్ ను త్వరలోనే ముగించే అవకాశం ఉందని కైఫ్ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. దీనికి కారణం కూడా చెప్పుకొచ్చాడు కైఫ్. ఇంగ్లాండ్ తో జరుగుతున్న మాంచెస్టర్ టెస్ట్ లో ఈ నెంబర్ వన్ టెస్ట్ బౌలర్ ఇబ్బందికరంగా కనిపించాడని.. అతని వేగం కూడా తగ్గిందని చెప్పాడు కైఫ్. ” జస్ప్రీత్ బుమ్రా టెస్ట్ ఫార్మాట్ ఆడతాడని నేను భావించడం లేదు. అతను రిటైర్మెంట్ తీసుకుంటాడని నాకు అనిపిస్తుంది. ప్రస్తుతం బుమ్రా తన ఫిట్ నెస్ తో ఇబ్బంది పడుతున్నాడు. మాంచెస్టర్ టెస్టు లో అతని వేగం చాలా తగ్గింది” అని కైఫ్ ఎక్స్ లో షేర్ చేసిన వీడియోలో పేర్కొన్నాడు.
పవర్ తగ్గిన బుమ్రా బౌలింగ్..
” బుమ్రా నిస్వార్థపరుడు. దేశం కోసం 100 శాతం ఇవ్వలేకపోతున్నానని.. మ్యాచ్ గెలవలేకపోతున్నానని, వికెట్లు తీయలేకపోతున్నానని, వికెట్లు తీయలేకపోతున్నానని అతను భావిస్తే.. అతను గుడ్ బై చెబుతాడు. ఇది నా మనస్సులోని మాట. అతను బంతిని 130-135 వేగంతో విసురుతున్నాడు. అతను ఫిట్ నెస్ లో ఇబ్బందులున్నాయి. శరీరం అతనికి బౌలింగ్ వేయడానికి సహకరించడం లేుద. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, అశ్విన్ లేకుండా అలవాటు పడిన అభిమానులు.. బుమ్రా లేకుండా టెస్ట్ మ్యాచ్ లు చూడటానికి అలవాటు చేసుకోవాల్సి ఉంటుందని నేను భావిస్తున్నాను” అని కైఫ్ అన్నాడు. ప్రస్తుతం మాంచెస్టర్ వేదికగా జరుగుతున్న టెస్ట్ లో బుమ్రా 33 ఓవర్లు వేసి రెండు వికెట్లు తీశాడు. అలాగే 112 రన్స్ సమర్పించుకున్నాడు. రవీంద్ర జడేజా 37.1 ఓవర్లు వేసి నాలుగు వికెట్లు తీసుకున్నాడు. వాషింగ్టన్ సుందర్ 28 ఓవర్లు వేసి 2 వికెట్లు పడగొట్టాడు. సిరాజ్ 30 ఓవర్లు వేసి 1 వికెట్, కంబోజ్ 18 ఓవర్లు వేసి 1 వికెట్ తీశారు. శార్దూల్ ఠాకూర్ 11 ఓవర్లు వేసి ఒక్క వికెట్ కూడా తీయలేదు. బుమ్రా జెమీ స్మిత్, లియామ్ డౌసన్ ల వికెట్లు తీశాడు. మహ్మద్ కైఫ్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.