Ambati Rayudu – BJP: రాజకీయాల పట్ల ఎంతో ఆసక్తిగా ఉన్న మాజీ క్రికెటర్ అంబటి తిరుపతి రాయుడు ఆంధ్రప్రదేశ్ లో గత ఏడాది జరిగిన సాధారణ ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్న విషయం తెలిసిందే. దీంతో అంబటి రాయుడు గుంటూరు నుంచి వైసీపీ తరఫున ఎంపీగా పోటీ చేస్తారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఆ తరువాత ఏం జరిగిందో తెలియదు కానీ.. వైసీపీ కండువా కప్పుకున్న వారం రోజులకే అంబటి రాయుడు తిరిగి మళ్లీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని కలిశారు.
Also Read: Ind vs Eng, 3rd T20I: నేడు రాజ్‌కోట్ లో మ్యాచ్.. షమీ వచ్చేస్తున్నాడు ?
ఆ తరువాత వైసిపికి గుడ్ బై చెప్పేశారు. ఎందుకంటే మళ్లీ బ్యాట్ పట్టనున్నట్లు ప్రకటించారు. వృత్తిపరమైన క్రీడను ఆడుతున్నందున.. రాజకీయాలకు దూరంగా ఉండాల్సిన అవసరం ఉందంటూ ట్వీట్ చేశాడు అంబటి రాయుడు. ప్రొఫెషన్ క్రికెట్ లీగ్ లో ఆడాలంటే ఏ రాజకీయ పార్టీతో అనుబంధం ఉండకూడదని.. ఈ కారణంగానే వైసీపీకి రాజీనామా చేసినట్లు తెలిపాడు. అయితే తాజా సమాచారం ప్రకారం అంబటి రాయుడు ఇప్పుడు బిజెపి వైపు మొగ్గు చూపిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇటీవల విశాఖపట్నంలో అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) 43వ రాష్ట్రస్థాయి మహాసభలు జరిగాయి. ఈ సభలో అతిథిగా పాల్గొన్న అంబటి రాయుడు బిజెపికి అనుకూలంగా వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది. భారతీయ జనతా పార్టీ (బిజెపి) దేశం కోసం పనిచేసే ఒకే ఒక్క పార్టీ అని అన్నారు అంబటి రాయుడు. కొన్ని పార్టీలు కుటుంబాల చుట్టూ తిరుగుతాయని, మరికొన్ని పార్టీలు కార్పొరేట్ సంస్థల చుట్టూ తిరుగుతాయని, కానీ దేశం కోసం పనిచేసే పార్టీ మాత్రం బిజెపి మాత్రమేనని అన్నారు.
తన సంవత్సర రాజకీయ అనుభవంలో ఇవన్నీ చూసానని తెలిపారు అంబటి రాయుడు. ఈ నేపథ్యంలో ఆయన మొదట వైసీపీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి వెళ్లారని, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటే బీజేపీ వైపు ఆసక్తిగా ఉన్నారా..? అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజెన్లు. ఇక ఏబీవీపీ 43వ రాష్ట్రస్థాయి మహాసభలలో యువత, విద్యార్థుల గురించి, దేశభక్తి గురించి అంబటి రాయుడు మాట్లాడుతూ.. తనకు రాజకీయాలలో కీలకమైన పాత్ర పోషించాలని ఉందన్నారు.
Also Read: Nitish Kumar Reddy Injury: SRH కి షాక్.. ఐపీఎల్ 2025 నుండి నితీష్ కుమార్ రెడ్డి ఔట్?
దీంతో అంబటి రాయుడు సరైన రాజకీయ వేదిక కోసం అన్వేషిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆయన బిజెపి వైపు చూస్తున్నారా..? అనే చర్చలు కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో వినిపిస్తున్నాయి. ప్రస్తుతం బిజెపి కూడా ఆంధ్రప్రదేశ్ లో తన బలాన్ని పెంచుకునేందుకు ప్రయత్నిస్తుంది. ఈ నేపథ్యంలో అంబటి రాయుడు వంటి క్రికెటర్ బీజేపీలో చేరితే పార్టీలో కొత్త ఉత్సాహాన్ని తీసుకురావచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. అంబటి రాయుడు వంటి క్రికెటర్ బిజెపిలోకి వస్తే సామాజిక సమీకరణాలు కూడా కలిసి వస్తాయని బిజెపి పెద్దలు లెక్కలు వేసుకుంటున్నట్లు సమాచారం.