Pakistan – Champions Trophy 2025: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా ఫిబ్రవరి 23న ఇండియా – పాకిస్తాన్ మధ్య అతిపెద్ద మ్యాచ్ జరగబోతోంది. ఇప్పటికే తన తొలి మ్యాచ్ లో న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయిన తర్వాత ఆతిధ్య పాకిస్తాన్ టోర్నమెంట్ నుండి నిష్క్రమించే ముప్పులో ఉంది. ఈ టోర్నమెంట్ లో కొనసాగాలంటే పాకిస్తాన్ జట్టు ఎట్టి పరిస్థితులలో భారత్ ని ఓడించాల్సి ఉంటుంది. ఫిబ్రవరి 23న ఆదివారం దుబాయ్ లోని ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో పాకిస్తాన్ – భారత్ మద్య జరిగే ఈ హై వోల్టేజ్ మ్యాచ్ కి విపరీతమైన క్రేజ్ ఉంది.
భారత్ – పాకిస్తాన్ మధ్య మ్యాచ్ అంటే అన్ని దేశాల క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తారు. ఎందుకంటే ఈ రెండు జట్లు అంతర్జాతీయ మ్యాచ్ లలో ఒక టీమ్ తో మరొక టీమ్ ఆడిన మ్యాచ్ల సంఖ్య తక్కువ. చివరిసారిగా భారత్ – పాకిస్తాన్ జూన్ 2024 లో జరిగిన టి-20 ప్రపంచకప్ లో తలపడ్డాయి. ఆ మ్యాచ్ లో భారత్ ఆరు పరుగుల తేడాతో పాకిస్తాన్ జట్టును ఓడించింది. ఇక ఈ ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో {Pakistan – Champions Trophy 2025} పాకిస్తాన్ తన తొలి మ్యాచ్ ని ఓడిపోగా.. ఈ టోర్నమెంట్ ను భారత్ విజయంతో ప్రారంభించింది.
బంగ్లాదేశ్ తో జరిగిన తొలి మ్యాచ్ లో భారత జట్టు ఆరు వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని సాధించింది. ఇక రేపు జరగబోయే భారత్ – పాకిస్తాన్ మ్యాచ్ లో.. పాకిస్తాన్ జట్టు ఓడిపోతే ఈ టోర్నీ నుండి ఔట్ అవుతుంది. ఇక ఇండియా గెలిస్తే సెమీఫైనల్ చేరుతుంది. ఈ నేపథ్యంలో ఇరుజట్లు మ్యాచ్ ని గెలుచుకోవడానికి వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ ఈ మ్యాచ్ లో గెలుపొందాలని అభిమానులంతా కోరుకుంటే.. భారత మాజీ క్రికెటర్ అతుల్ వాసన్ విరుద్ధంగా స్పందించారు.
ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ జట్టు గెలవాలని కోరుకుంటున్నానని, అప్పుడే టోర్నీలో మజా వస్తుందని అన్నాడు. ఒకవేళ ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ ఓడిపోతే టోర్నీ పై పెద్దగా ఆసక్తి ఉండదని అభిప్రాయపడ్డాడు. మరోవైపు టీమ్ ఇండియా బ్యాటింగ్ డెప్త్ అద్భుతంగా ఉందని కొనియాడాడు. అలాగే రిషబ్ పంత్, అర్షదీప్ సింగ్ లను బెంచ్ కి పరిమితం చేయడం తప్పుడు నిర్ణయమని అభిప్రాయపడ్డాడు అతుల్ వాసన్. ఈ సందర్భంగా అతుల్ వాసన్ మాట్లాడుతూ.. ” కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి మిడిల్ ఓవర్లలో కీలకపాత్ర పోషిస్తారు.
అయితే హార్దిక్ పాండ్యా బౌలింగ్ చేయగల నాలుగు సీమర్లను కలిగి ఉండడం జట్టుకు అదనపు బలం. గౌతమ్ గంభీర్, అతడి సపోర్ట్ స్టాఫ్ ఇష్టం వచ్చినట్లు ఎంపిక చేసుకున్నారు. గౌతమ్ గంభీర్ ప్రధాన కోచ్ అయినప్పటి నుండి జట్టు ఎంపిక, మేనేజ్మెంట్ పై విమర్శలు ఎదుర్కొంటున్నాడు. అతను తనకి కావలసిన మద్దతు సిబ్బందిని ఎంపిక చేసుకున్నాడు. కాబట్టి ఇప్పుడు రాణించాలి. ఒకవేళ తగిన ఫలితాలు రాకపోతే అతనిపై ఒత్తిడి పెరుగుతుంది” అని వ్యాఖ్యానించాడు.