Formula 1 Race: ఫార్ములా వన్ రేస్ మొదలు కానుందా? రేస్‌పై కేంద్ర తనవంతు ప్రయత్నాలు మొదలుపెట్టిందా? ఇప్పటికే స్పోర్ట్స్ మంత్రి రేసులు జరిగే ప్రాంతాలను సందర్శించారా? దేశంలో ఫార్ములా రేస్ ఎక్కడ జరగనుంది? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి.
భారత్‌లో మళ్లీ ఫార్ములా వన్ రేస్ సందడి
ఫార్ములా వన్ గురించి చెప్పనక్కర్లేదు. ఈ రేసు నిర్వహించేందుకు ప్రపంచంలోని చాలా దేశాలు ఆసక్తి చూపుతుంటాయి. దీనివల్ల ఆ దేశానికి మాంచి పేరు వస్తుంది. ఈ తరహా రేస్‌ల వల్ల నష్టమా? లాభమా? అనేది పక్కనబెడితే దాదాపు దశాబ్దం తర్వాత మళ్లీ ఇండియా ఫార్ములా వన్ సందడి చేయనుంది.
విదేశీ పర్యాటకులను ఆకట్టుకునేందుకు కేంద్రప్రభుత్వం తన వంతు ప్రయత్నాలు మొదలుపెట్టింది. కేవలం టూరిజంగా కాకుండా రకరకాల క్రీడల ద్వారా విదేశీ పర్యాటకులకు రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. దాదాపు దశాబ్దం తర్వాత రేస్‌ని పునరద్దరించడానికి ప్రభుత్వం దృష్టి సారించింది. ఫార్ములా రేస్ అంటే ముందుగా గుర్తుకొచ్చేది గ్రేటర్ నొయిడాలోని బుద్దా సర్క్యూట్.
గతంలో అక్కడ ఆ తరహా రేస్ జరిగింది. కాకపోతే అనుకోని సమస్యల వల్ల మిగతా ప్రభుత్వాలు దాన్ని కంటిన్యూ చేయలేకపోయాయి. తాజాగా వీటిపై కేంద్రం ఫోకస్ చేసింది. ఫార్ములా వన్ పునరుద్ధరణ కోసం కేంద్ర స్పోర్ట్స్ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ ఇప్పటికే బుద్ధా సర్క్యూట్‌ను పరిశీలించినట్టు తెలుస్తోంది. రేసింగ్ ట్రాక్ నిర్వహణ చూస్తున్న యమున ఎక్స్‌ప్రెస్‌వే ఇండస్ట్రీయల్ డెవలప్‌మెంట్ అథారిటీతో ఆయన మాట్లాడిట్టు సమాచారం.
విదేశీ పర్యాటకులపై ఫోకస్.. కేంద్రం ప్రయత్నాలు
ఈ ట్రాక్‌ను దక్కించుకోవాలని అదానీ గ్రూప్ ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అదే జరిగితే దేశంలో మళ్లీ ఎఫ్-1 రేస్ హంగామా చేయనుంది. ఎఫ్-1 రేసు నిర్వహించడం ఖర్చుతో కూడిన వ్యవహారం. త్వరలో ఆశ తీరుతుందని ఆశిస్తున్నట్లు చెప్పుకొచ్చారు స్పోర్ట్స్ మంత్రి. రేసు పునరుద్ధరించేలా చేస్తామని క్రీడల మంత్రి.. ట్రాక్ నిర్వాహకులకు చెప్పినట్టు సమాచారం. ఈ విషయాన్ని భారత ఫార్ములా వన్ వర్గాలు వెల్లడించాయి.
ఇండియన్ గ్రాండ్ ప్రిక్స్ మొదటిసారిగా 2011లో యూపీలోని యమునా ఎక్స్‌ప్రెస్‌వే వెంబడి బుద్ధా ఇంటర్నేషనల్ సర్క్యూట్‌లో జరిగింది. ఈ ఈవెంట్ ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాదు, ప్రపంచవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించింది. 2011-13 వరకు రేసు జరిగింది. అయినప్పటికీ ఆ ప్రదర్శన ఎక్కువ కాలం కొనసాగలేదు.
ALSO READ: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌కు కొత్త అధ్యక్షుడు.. ఎవరంటే?
ప్రపంచ స్థాయి ట్రాక్ సౌకర్యం ఉన్నప్పటికీ 2013 సీజన్ తర్వాత ఇండియన్ గ్రాండ్ ప్రిక్స్‌ను ప్రపంచ ఛాంపియన్‌షిప్ నుండి తొలగించారు. నిర్వాహకులు- కేంద్రప్రభుత్వానికి మధ్య ఆర్థిక, వివాదానికి నిలయంగా మారింది. గతంలో యూపీ ప్రభుత్వం ఫార్ములా 1ని ఒక క్రీడా కాకుండా, వినోదంగా పరిగణించారు. రకరకాల పన్నులు విధించారు. దీంతో రేసు నిర్వహించడానికి అయ్యే ఖర్చు అమాంతంగా పెరిగింది.
క్రీడా కార్యక్రమాల కింద అందించే పన్ను మినహాయింపులు, ఆర్థిక ప్రోత్సాహకాలను పొందే ప్రయత్నాలను బలహీనపరిచాయి. ఫలితంగా అక్కడ రేసు ఆగిపోయింది. ఆ తర్వాత హైదరాబాద్‌లో ఫార్ములా ఈ వన్ రేసు జరిగింది. ఇక్కడ కూడా వివాదాలకు కేంద్రంగా మారడంతో దేశంలో ఫార్ములా రేస్ ఆగిపోయిన విషయం తెల్సిందే.