harbhajan singh: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ గురించి కాంగ్రెస్ నాయకురాలు షామా మహమ్మద్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనియాంశంగా మారాయి. షామా మొహమ్మద్ చేసిన ట్వీట్ పై అటు సోషల్ మీడియాలో, ఇటు బిజెపి నేతలు కౌంటర్లతో ఫిట్నెస్ పాలిటిక్స్ పీక్స్ కి చేరాయి. రోహిత్ శర్మ ఫిట్నెస్ విషయంలో కాంగ్రెస్ టార్గెట్ గా బిజెపి నేతల విమర్శలతో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది.
Also Read: Rohit Sharma: రోహిత్ శర్మ చెత్త రికార్డు..వరుసగా 14వ సారి టాస్ ఓడింది !
“రోహిత్ శర్మ ఫ్యాట్ స్పోర్ట్స్ మెన్, అతడు బరువు తగ్గాల్సిన అవసరం ఉంది. భారత జట్టు కెప్టెన్ గా అతని రికార్డ్ కూడా బాలేదు” అంటూ ట్వీట్ చేసింది షామా మొహమ్మద్. ఈ ట్వీట్ పై తీవ్ర దుమారం రేగడంతో ఆ ట్వీట్ ని డిలీట్ చేసింది. కానీ తన వ్యాఖ్యలను మాత్రం వెనక్కి తీసుకోలేదు. తాను బాడి షేమింగ్ చేయలేదని.. ఆటగాళ్లు ఫిట్ గా ఉండాలని చెప్పానని పేర్కొంది. ఆమె ట్వీట్ పై బీసీసీఐ కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. కీలక టోర్ని మధ్యలో ఉన్నప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరైనది కాదని.. వ్యక్తిగత ప్రచారం కోసం ఇటువంటి వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని సూచించింది.
మరోవైపు బిజెపి కూడా షామా మహమ్మద్ కి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ వరుసగా మ్యాచ్ లు గెలుస్తుందని.. పాకిస్తాన్ ని కూడా ఓడించామని అన్నారు బిజెపి నేత షెహజాద్ పూనావాలా. రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ 93 ఎన్నికలు ఓడిపోయిందని.. అలాంటివారు రోహిత్ శర్మ కెప్టెన్సీ గురించి మాట్లాడడం హాస్యాస్పదమని అన్నారు. మరోవైపు ఆమె చేసిన వ్యాఖ్యలపై మాజీ ఆటగాడు హర్భజన్ సింగ్ తీవ్రంగా ఖండించారు.
ఎక్స్ {ట్విటర్} లో హార్బజన్ సింగ్ ట్వీట్ చేస్తూ.. రోహిత్ శర్మ ఫిట్నెస్ గురించి ఇంత రచ్చ చేయాల్సిన అవసరం లేదు. రోహిత్ ఔట్ స్టాండింగ్ ప్లేయర్. భారత క్రికెట్ కి ఎంతో సేవ చేసిన అద్భుతమైన లీడర్. క్రీడాకారులు కూడా సాధారణ మనుషులే. వాళ్లకి కూడా ఎమోషన్స్, సెంటిమెంట్స్ ఉంటాయి. క్రికెట్ గురించి ఎలాంటి అవగాహన లేని వాళ్ళు చేసే కామెంట్లు బాధపెట్టాయి. ఇలాంటి వ్యాఖ్యలు దురదృష్టకరం. ఆటను గౌరవించండి.. ఆటగాళ్లను గౌరవించండి” అని ట్విట్ చేశాడు హర్భజన్ సింగ్.
ఇక టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీలో గ్రూప్ దశలో సత్తా చాటి.. సెమీ ఫైనల్ లో అడుగు పెట్టింది. ఈ నేపథ్యంలో సెమి ఫైనల్ తో నేడు ఆస్ట్రేలియాతో తలపడుతుంది. ఈ నేపథ్యంలో భారత జట్టుకు సైతం కీలక సూచనలు చేశాడు హర్భజన్ సింగ్. ఆస్ట్రేలియా ఆటగాళ్లు భారీ షాట్లతో వేగంగా పరుగులు తీస్తారని.. వారికి ఎటువంటి అవకాశాన్ని ఇవ్వకూడదని తెలిపాడు. మహమ్మద్ షమీ ఇప్పటివరకు ఆడిన విధానాన్ని కొనసాగించాలని తెలిపాడు. ప్రస్తుతం ఆడుతున్నది నాకౌట్ మ్యాచ్ కాబట్టి అతిగా ఏ విషయాన్ని ప్రయత్నించాల్సిన అవసరం లేదన్నాడు.