AP DSC notification: ఏపీలో మెగా డీఎస్సీపై మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన చేశారు. ఎవరూ ఊహించని రీతిలో శాసనమండలిలో లోకేష్ ప్రకటన జారీ చేయడంపై డీఎస్సీ అభ్యర్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం చెప్పే ఈ ప్రకటన కోసం ఎందరో అభ్యర్థులు ఎదురుచూపులు చూస్తున్న పరిస్థితి. ఈ దశలో శాసనమండలి సాక్షిగా లోకేష్ చెప్పిన ఆ ప్రకటన ఏమిటో తెలుసుకుందాం.
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీపై తొలి సంతకం చేసింది. ముందు పాలనాపరమైన అంశాలపై దృష్టి సారించిన ప్రభుత్వం, డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలకు ముందు టెట్ పరీక్ష నిర్వహించాలన్న ఉద్దేశంతో టెట్ పరీక్షను నిర్వహించింది. దీనితో టెట్ పాస్ కాని అభ్యర్థులకు మరో అవకాశం ఇచ్చినట్లయింది. టెట్ ఉత్తీర్ణులైన వారే డీఎస్సీ రాసేందుకు అర్హత సాధిస్తారు. అందుకే ప్రభుత్వం అభ్యర్థులందరికీ అవకాశం కల్పించేందుకు టెట్ నిర్వహించిందని చెప్పవచ్చు.
అయితే ఇప్పటికే కూటమి ప్రభుత్వం విడుదల చేసే డీఎస్సీ నోటిఫికేషన్ కోసం అభ్యర్థులు ఎదురుచూపుల్లో ఉన్నారు. కాగా డీఎస్సీకి సంబంధించి సిలబస్ ను కూడా ప్రభుత్వం విడుదల చేయడంతో అభ్యర్థులు పుస్తకాలు చేతబట్టారు. అంతేకాదు కోచింగ్ ల కోసం కోచింగ్ సెంటర్ల బాట పట్టారు. ఎందరో అభ్యర్థులు కోచింగ్ సెంటర్లకు వెళ్లలేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్న పరిస్థితిని దృష్టిలో ఉంచుకున్న ప్రభుత్వం బీసీ స్టడీ సర్కిళ్ల ద్వారా ఉచిత కోచింగ్ ఇవ్వడంపై అభ్యర్థులు హర్షం వ్యక్తం చేశారు.
మొత్తం 16 వేలకు పోగా పోస్టుల భర్తీ చేయనున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. వచ్చే విద్యా సంవత్సరంలోగా డీఎస్సీ నిర్వహించి, ఎంపికైన వారికి నియామక పత్రాలు ఇవ్వడమే కాక, బదిలీలు కూడా నిర్వహిస్తామని సీఎం మాటిచ్చారు. అందుకే ఏపీ ప్రభుత్వం నోటిఫికేషన్ గురించి చెప్పే ప్రకటన కోసం అభ్యర్థులు వేచి ఉన్న పరిస్థితి. ఇలాంటి తరుణంలో లోకేష్ శాసనమండలి సాక్షిగా డీఎస్సీ నోటిఫికేషన్ పై కీలక ప్రకటన చేశారు. లోకేష్ మాట్లాడుతూ.. ఎట్టిపరిస్థితుల్లో మార్చి నెలలో డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చే బాధ్యత కూటమి ప్రభుత్వానిదని స్పష్టం చేశారు.
వైసీపీ ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో ఒక్క టీచర్ పోస్టునూ భర్తీ చేయలేదని, 1994 నుంచి 2,60,194 టీచర్ పోస్టులు భర్తీ చేస్తే.. అందులో టీడీపీ హయాంలోనే 1,80,272 పోస్టులు భర్తీ చేశామన్నారు. ఒక్క టీడీపీ హయాంలోనే 70శాతం టీచర్ పోస్టులు భర్తీ చేయడం జరిగిందని వివరించారు. వర్గీకరణపై వన్ మ్యాన్ కమిషన్ నివేదిక త్వరలోనే రాబోతోందని భావిస్తున్నామని తెలిపారు.
Also Read: Perabathula Rajasekharam MLC: కూటమికి వరుస విజయాలు.. ఉభయ గోదావరి జిల్లాలో టీడీపీ అభ్యర్థి విజయం..
మొత్తం మీద ఈ నెలలో నోటిఫికేషన్ కానుందని లోకేష్ ప్రకటించడంపై అభ్యర్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా అటు నోటిఫికేషన్ ఇవ్వడం, ఆ తర్వాత పరీక్ష, వెనువెంటనే నియామకాలు ఇస్తున్న నేపథ్యంలో డీఎస్సీ కోసం ఎదురుచూపుల్లో ఉన్న అభ్యర్థుల ఆశలు చిగురించాయి. మీరు డీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నారా.. నోటిఫికేషన్ వస్తోంది.. బీ అలర్ట్.. మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి!