Heinrich Klaasen: సన్ రైజర్స్ హైదరాబాద్ స్టార్ బ్యాటర్, దక్షిణాఫ్రికాకి చెందిన హెన్రిచ్ క్లాసెన్ {Heinrich Klaasen} కి షాక్ తగిలింది. అతడి అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ ముగింపు దశకు చేరుకుంది. సౌత్ ఆఫ్రికా సెంట్రల్ కాంట్రాక్ట్ లో క్లాసెన్ కి చోటు దక్కలేదు. సౌత్ ఆఫ్రికా సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాలో 18 మంది ఆటగాళ్లలో క్లాసెన్ పేరును చేర్చలేదు. సౌత్ ఆఫ్రికా క్రికెట్ బోర్డు 2025-2026 కి సంబంధించిన జాతీయ కాంట్రాక్టు జాబితాను సోమవారం విడుదల చేసింది.
ఇందులో క్లాసెన్ పై వేటు వేశారు. టి-20 క్రికెట్ లో స్పెషలిస్ట్ బ్యాటర్ గా గుర్తింపు పొందిన హెన్రిచ్ క్లాసెన్ {Heinrich Klaasen} కి.. సెంట్రల్ కాంట్రాక్ట్ దక్కకపోవడంతో అతడి భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మారింది. టి-20 వరల్డ్ కప్ లో టీమిండియాతో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో 23 బంతులలోనే హాఫ్ సెంచరీ చేశాడు క్లాసెన్. ఈ ఇన్నింగ్స్ లో రెండు ఫోర్లు, ఐదు సిక్సర్లు కూడా బాదాడు. ముఖ్యంగా క్లాసెన్ బ్యాటింగ్ లో దూకుడు కొనసాగిస్తాడు. కీపింగ్ లో కూడా అద్భుతాలు చేస్తాడు.
అందువల్లే క్లాసెన్ కి సౌత్ ఆఫ్రికాలో ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కానీ కొద్ది రోజులుగా క్లాసెన్ సరిగా ఆడడం లేదు. దీంతో సౌత్ ఆఫ్రికా జట్టుకి ఆశించిన స్థాయిలో విజయాలు సాధించడం లేదు. మరోవైపు క్లాసెన్ 2024 జనవరిలో టెస్ట్ క్రికెట్ నుండి రిటైర్ అయ్యాడు. మునుపటి సైకిల్ లో అతడు వైట్ బాల్ కాంట్రాక్ట్ లో ఉన్నాడు. ఇటువంటి పరిస్థితిలో భవిష్యత్తులో అతడు టి-20 లీగ్ లు మాత్రమే ఆడే అవకాశం ఉంది. రాబోయే కాలంలో తుది నిర్ణయం తీసుకుంటామని క్రికెట్ సౌత్ఆఫ్రికా తెలిపింది.
ఇక ప్రస్తుతం క్లాసెన్ ఐపీఎల్ తో బిజీగా ఉన్నాడు. సన్రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం 2025 ఐపీఎల్ మెగా వేలంలో క్లాసెన్ ని 23 కోట్లకు రిటైన్ చేసుకుంది. కానీ గత సీజన్ లో మాదిరిగా ప్రస్తుతం ఆడలేకపోతున్నాడు. తాజాగా హైదరాబాద్ వేదికగా గుజరాత్ జట్టుతో జరిగిన మ్యాచ్లో కేవలం 27 పరుగులు మాత్రమే చేశాడు. అంతకుముందు కలకత్తాతో జరిగిన మ్యాచ్ లో 33 పరుగులు చేశాడు. అయితే సౌత్ ఆఫ్రికా మేనేజ్మెంట్ క్లాసెన్ విషయంలో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అతడి అభిమానులకు రుచించడం లేదు.
ఇక డేవిడ్ మిల్లర్, రస్సీ వాన్ డస్సెన్ లకు హైబ్రిడ్ కాంట్రాక్ట్ ఇచ్చారు. వీరు ఎంపిక చేసిన సిరీస్ లు మాత్రమే ఆడతారు. ఇక 18 మంది ఆటగాళ్ల కాంట్రాక్ట్ జాబితాలో లిజాద్ విలియమ్స్ కూడా ఉన్నాడు. ఈ సంవత్సరం మోకాలు శాస్త్ర చికిత్స చేయించుకున్నప్పటికీ.. అతడు ఆటకు దూరంగా ఉంటున్నాడు. ఆల్ రౌండర్ సెనురాన్ ముత్తుస్వామి, 18 ఏళ్ల ఎడమ చేతి వాటం ఫాస్ట్ బౌలర్ క్వేనా మ్పాకా తొలిసారిగా జట్టులోకి వచ్చారు. అయితే క్లాసెన్ పట్ల తీసుకున్న నిర్ణయం పై క్రికెట్ మేనేజ్మెంట్ ఎలా సమర్ధించుకుంటుందో వేచి చూడాలి. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్, వన్డే వరల్డ్ కప్ 2027 ని దృష్టిలో పెట్టుకుని ఆటగాళ్లను సెలెక్ట్ చేసినట్లు సౌత్ ఆఫ్రికా జట్టు డైరెక్టర్ ఇనోచ్ ఇన్క్వె తెలిపారు.