Telangana News : విదేశాల్లో ఉద్యోగం అంటే ఆశ పడ్డారు. భారీగా సంపాదించుకోవచ్చు అంటే సంబరపడ్డారు. ఊర్లో అప్పులన్నీ తీర్చేయొచ్చు. దర్జాగా బతికేయొచ్చు. ఓ పదేళ్లు పని చేసి తిరిగొచ్చేసి.. ఇక్కడే మంచి బిజినెస్ చూసుకొని సెటిల్ అయిపోవచ్చు. ఇలా అనేక కలలు కన్నారు. పేరెంట్స్‌కు, చుట్టాలకు, దోస్తులకు బైబై చెప్పేసి.. బ్యాగులతో విమానం ఎక్కేశారు. కట్ చేస్తే.. ఇప్పుడా ఇద్దరు యువకులు మయన్మార్ ఆర్మీ చెరలో బంధీలుగా బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు.
ఏజెంట్ల దారుణ మోసం
ఏజెంట్ల మాయమాటలకు దారుణంగా మోసపోయారు ఆ భూపాల్‌పల్లి జిల్లా వాసులు. బ్యాంకాక్, థాయిలాండ్‌లో మంచి జాబ్స్ ఉన్నాయని.. అక్కడికి వెళ్తే బాగా డబ్బులు వస్తాయని చెప్పారు. ఆ ఏజెంట్స్ మాటలను నమ్మి.. మహాముత్తారం మండలం నిమ్మగూడెంకు చెందిన అజ్మీరా సంతోష్, దొబ్బలపాడుకు చెందిన లావుడ్య విజయ్‌లు వారు అడిగినంత సొమ్ము ముట్టజెప్పారు. అయితే, బ్యాంకాక్ అని చెప్పి వారిద్దరి నుంచి పాస్‌పోర్టులు, ఇతర సర్టిఫికెట్లు తీసుకుని.. మయన్మార్ తీసుకెళ్లారు ఆ కంత్రీ మోసగాళ్లు. అక్కడ రెండు నెలలు నరకం చూపించారు. అడ్డమైన కూలీ పనులన్నీ చేయించారు. ఆ తర్వాత ఆ ఏజెంట్ వీళ్లను అక్కడే వదిలేసి పరార్ అయ్యాడు.
మయన్మార్ ఆర్మీ చెరలో మనోళ్లు..
అసలే దేశం కాని దేశం. అందులోనూ మయన్మార్. క్రూరమైన సైనిక పాలన నడుస్తోంది. భాష రాదు. డబ్బులు లేవు. పాస్‌పోర్టూ లేదు. ఏం చేయాలో తెలీలేదు. వీళ్ల గురించి సమాచారం తెలిసి.. అనుమానంతో అదుపులోకి తీసుకుంది మయన్మార్ ఆర్మీ. అప్పటి నుంచి వాళ్లకు మరిన్ని కష్టాలు. మయన్మార్ ఎందుకొచ్చారు? ఏదైనా కుట్రతో వచ్చారా? ఇండియాకు స్పై చేస్తున్నారా? ఇలా రకరకాల ప్రశ్నలు. తాము అలాంటి వాళ్లం కాదని.. ఏజెంట్ చేతిలో మోసపోయామని చెప్పినా అక్కడి ఆర్మీ నమ్మట్లేదు.
Also Read : పోలీస్ కార్‌తో రీల్స్.. వీడియో వైరల్
మంత్రులే ఆదుకోవాలి..
ఎలాగోలా వీలు చూసుకుని కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి తమ గోడు వినిపించారు ఆ బాధిత యువకులు. మయన్మార్‌లో తాము పడుతున్న కష్టాలను వివరించి చెప్పారు. విషయం తెలిసి ఆ కుటుంబం షాక్‌కు గురైంది. తీవ్రంగా ఆందోళన చెందుతోంది. కేంద్రమంత్రి బండి సంజయ్, రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబులు జోక్యం చేసుకుని.. తమ పిల్లలను సురక్షితంగా తిరిగి తీసుకురావాలని కోరుతున్నారు. తమ పిల్లలు ప్రాణాలతో వస్తారో రారోనని.. టెన్షన్ పడుతున్నారు ఆ కుటుంబ సభ్యులు.