అభిమానులను ఊరించి ఉసూరుమనిపించడం… టీమిండియా ఆటగాళ్లకే సాధ్యం. ప్రతీ మెగా టోర్నీలోనూ లీగ్ మ్యాచ్ ల్లో అదరగొట్టడం… కీలక మ్యాచ్ ల్లో బోల్తా కొట్టడం ఈ మధ్య మామూలైపోయింది. T20 వరల్డ్ కప్ లోనూ టీమిండియా ఆటగాళ్లు మూకుమ్మడిగా విఫలమై… ఫ్యాన్స్ తో చివాట్లు తింటున్నారు. ఐపీఎల్లో అదరగొట్టే క్రికెటర్లు… దేశం కోసం ఆడాల్సి వచ్చినప్పుడు ఎందుకు జీరోలవుతున్నారని మండిపడుతున్నారు. ఐపీఎల్ ని నిషేధిస్తే కానీ టీమిండియా ఆటగాళ్లు దారిలోకి వచ్చేలా లేరని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
T20 వరల్డ్ కప్ లో టీమిండియా ఓటమికి ప్రధాన కారణం ఐపీఎల్ అని అభిమానులు గట్టిగా వాదిస్తున్నారు. ఐపీఎల్ మోజులో పడి టీమిండియా ఆటగాళ్లలో కొందరు ప్రధాన మ్యాచ్ ల్లో అస్సలు ఆడటం లేదని అంటున్నారు. ముఖ్యంగా కేఎల్ రాహుల్, బుమ్రా లాంటి ఆటగాళ్లు కేవలం ఐపీఎల్‌లో మాత్రమే సూపర్ అనిపిస్తారు తప్ప… వరల్డ్ కప్ లాంటి మెగా టోర్నీలకు పనికిరారని తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఐపీఎల్‌లో కెప్టెన్‌గా ఐదు టైటిళ్లు సాధించిన రోహిత్ శర్మ… టీమిండియా కెప్టెన్‌గా మాత్రం పూర్తిగా విఫలమయ్యాడని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఐపీఎల్ లాంటి ప్రైవేట్ లీగ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌ను పోల్చకూడదని రోహిత్‌కు ఈ పాటికే అర్థమై ఉండాలని సెటైర్లు వేస్తున్నారు.
ఇక బుమ్రా మీద కూడా ఫ్యాన్స్ పూర్తి గుస్సాగా ఉన్నారు. ఎందుకంటే… 2013 సీజన్లో ఐపీఎల్ లోకి అరంగేట్రం చేసిన బుమ్రా… ఇప్పటిదాకా ప్రతీ సీజన్ లోనూ ఒక్క మ్యాచ్ కూడా వదలకుండా ఆడాడు. అదే దేశం కోసం ఆడాల్సి వస్తే… గాయాల సాకుతో తప్పుకుంటున్నాడని ఫ్యాన్స్ తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. T20 వరల్డ్ కప్ కు ఎంపిక కూడా అయిన బుమ్రా… ఆ తర్వాత గాయం సాకు చూపి ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండానే ఇంట్లో కూర్చున్నాడని చివాట్లు పెడుతున్నారు. ప్రత్యర్థులపై పూర్తి ఆధిపత్యం కనబరిచే బుమ్రా… కేవలం ఐపీఎల్ కే పరిమితమా? దేశం తరఫున అంతర్జాతీయ మ్యాచ్ ల్లో ఆడడా? అని ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. అలాగైతే ఆటకు రిటైర్మెంట్ ప్రకటించి… కేవలం డబ్బులొచ్చే లీగ్ ల్లోనే ఆడుకోమని సలహా ఇస్తున్నారు.