Mohammad Amir On Virat Kohli: టీమిండియా ఒకప్పటి కెప్టెన్ విరాట్ కోహ్లీని (Virat Kohli) చూస్తే ప్రత్యర్ధులు గజ గజ వణికిపోతారన్న సంగతి తెలిసిందే. సచిన్ టెండుల్కర్ తర్వాత రన్ మిషన్ గా పేరు గాంచిన విరాట్ కోహ్లీ.. సింగిల్ హ్యాండ్ తో టీమిండియాకు ఎన్నో విజయాలను అందించాడు. ముఖ్యంగా పాకిస్తాన్ తో మ్యాచ్ జరిగితే మనోడికి… ఎక్కడ లేని ఊపు వస్తుంది. పాకిస్తాన్ జట్టును ఓడించే వరకు విరాట్ కోహ్లీ నిద్రపోడు. అంత కసిగా ఆడతాడు. అలాంటి విరాట్ కోహ్లీ పై పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ అమీర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2017 లోనే విరాట్ కోహ్లీని చూసి తాను ప్యాంట్ తడుపుకున్నానని బాంబు పేల్చారు. అతడికి బౌలింగ్ చేయాలంటేనే భయం వేసేది అని.. కానీ ఒత్తిడిని తట్టుకొని మరీ, విరాట్ కోహ్లీని ఎదుర్కొన్నట్లు గుర్తు చేశారు. దీంతో మహమ్మద్ అమీర్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
2017 ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్ సందర్భంగా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ నేపథ్యంలో విరాట్ కోహ్లీని ఎదుర్కోవడంపై మహమ్మద్ అమీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్ సందర్భంగా విరాట్ కోహ్లీని అవుట్ చేసేందుకు తాను అల్లాను ప్రార్థించానని వెల్లడించారు. దానికి తగ్గట్టుగానే ప్రతిఫలం కూడా వచ్చిందని పేర్కొన్నారు. కానీ ఈ మ్యాచ్ ప్రారంభంలో విరాట్ కోహ్లీకి బౌలింగ్ చేయడం అంటేనే తనకు భయం వేసిందని వెల్లడించారు. హై ప్రెజర్ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ వికెట్ తీయడం ఎంత ముఖ్యమో తమకు చాలా తెలుసని.. దాన్ని బట్టి నడుచుకున్నామని వివరించారు.
ఇక ఈ ఫైనల్ మ్యాచ్ లో తాను వేసిన ఓవర్ లో విరాట్ కోహ్లీకి మంచి లైఫ్ వచ్చిందని గుర్తు చేశారు. విరాట్ కోహ్లీ ఇచ్చిన స్లిప్ క్యాచ్ ను అజహర్ అలీ డ్రాప్ చేసినట్లు వివరించారు. ప్రపంచంలోనే అత్యుత్తమ ఛేజ్ మాస్టర్ అయిన విరాట్ కోహ్లీకి లైఫ్ రావడం పాకిస్తాన్ జట్టులో తీవ్ర కలవరాన్ని రేపిందని మహమ్మద్ అమీర్ చెప్పుకొచ్చారు. క్యాచ్ మిస్ అయిన నేపథ్యంలో తాను వ్యూహం మార్చానని స్పష్టం చేశారు. విరాట్ కోహ్లీ ఇన్ స్వింగర్ ఆశించి ఆడతాడని ఊహించి… అవుట్ సింగర్ సందించినట్లు చెప్పుకొచ్చారు.
ఇక్కడ విరాట్ కోహ్లీ బోల్తా కొట్టి… డిఫెన్స్ ఆడబోయి క్యాచ్ అవుట్ అయినట్లు గుర్తు చేశారు. విరాట్ కోహ్లీ క్యాచ్ షాదాబ్ ఖాన్ పట్టుకోవడంతో… అతిపెద్ద వికెట్ టీమిండియా కోల్పోయిందని వెల్లడించారు. ఇక ఇదే మ్యాచ్ లో రోహిత్ శర్మ ను తాను డకౌట్ చేశానని… శిఖర్ ధావన్ ను 21 పరుగుల వద్ద పెవిలియన్ కు పంపినట్లు కీలక వ్యాఖ్యలు చేశారు మహమ్మద్ అమీర్. తన మొదటి స్పెల్ దెబ్బకు టీమిండియా 158 పరుగులకు కుప్పకూలినట్లు గుర్తు చేశారు. తద్వారా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ 2017 ట్రోఫీని కూడా తమ అందుకున్నట్లు వివరించారు.