ICC Awards 2023 : 2023లో టీ 20 మ్యాచ్ ల్లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన వారిలో నలుగురు ఉత్తమ ఆటగాళ్లను ఎంపిక చేసిన ఐసీసీ, ఇప్పుడు మెన్స్ వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్-2023 అవార్డుకి కూడా నలుగురు ఆటగాళ్లను ఎంపిక చేసింది. విశేషం ఏమిటంటే వీరిలో ముగ్గురు టీమ్ ఇండియా ప్లేయర్లు ఉన్నారు.
వన్డే వరల్డ్ కప్ 2023 లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అవార్డు అందుకున్న విరాట్ కొహ్లీతో పాటు, వరల్డ్ కప్ లో అత్యున్నత స్థానానికి ఎగసిన మహ్మద్ షమీ ఉన్నాడు. ఇంకా టీమ్ ఇండియా యువ కెరటం, 2023 క్యాలండర్ ఇయర్ లో అత్యధిక పరుగులు చేసిన శుభ్ మన్ గిల్ కూడా ఉన్నారు. వీరి ముగ్గురితో పాటు న్యూజిలాండ్ హిట్టర్ డారిల్ మిచెల్ కూడా అవార్డు రేస్ లో ఉన్నాడు.
2004 నుంచి ఐసీసీ ఈ అవార్డును ప్రదానం చేస్తోంది. విరాట్ కొహ్లీ ఇప్పటివరకు మూడుసార్లు అవార్డు అందుకున్నాడు. ఈ సారి కూడా అందుకుంటే ఎవరికీ దక్కని ఘనత సాధిస్తాడు. సౌతాఫ్రికాకు చెందిన డీవిలియర్స్ 3సార్లు, శ్రీలంకకి చెందిన కుమార సంగక్కర 3సార్లు, ఎంఎస్ ధోనీ 2 సార్లు, పాకిస్తాన్ కి చెందిన బాబర్ ఆజామ్ 2 సార్లు అవార్డు దక్కించుకున్నవారిలో ఉన్నారు.
విరాట్ కొహ్లీ 2012, 2017, 2018 సంవత్సరాల్లో మూడు సార్లు అవార్డు అందుకున్నాడు. ఈ ఏడాది కూడా రేస్ లో నిలిచాడు. 2023లో 27 మ్యాచ్‌ల్లో 72 సగటుతో 1377 పరుగులు చేశాడు. దీనిలో ఆరు సెంచరీలు, ఎనిమిది హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 12 క్యాచ్‌లు అందుకున్న కోహ్లి ఒక్క వికెట్ కూడా తీశాడు.
మిగిలిన ముగ్గురి విశేషాలను చూస్తే శుభ్ మన్ గిల్ 29 మ్యాచ్‌ల్లో 63 సగటుతో 1584 పరుగులు చేశాడు. అందులో డబుల్ సెంచరీ కూడా ఉంది. షమి 19 మ్యాచ్‌ల్లో 43 వికెట్లు పడగొట్టాడు. ప్రపంచకప్‌లో 7 మ్యాచ్‌లే ఆడి 24 వికెట్లు సాధించాడు. కివీస్ ప్లేయర్ మిచెల్ 26 మ్యాచ్‌ల్లో 1204 పరుగులు చేశాడు. 9 వికెట్లు కూడా తీశాడు.
నలుగురికి నలుగురు కూడా మంచి గణాంకాలతో ఉన్నారు. మరి వీరిలో ఎవరు ముందడుగు వేస్తారు. ఐసీసీ మెన్స్ వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్-2023 అవార్డు ఎవరు దక్కించుకుంటారనేది వేచి చూడాల్సిందే.