
ICC World Cup 2023 : ఇంతవరకు ఆటగాళ్లు రికార్డులు కొట్టడం చూశాం. లేదా జట్టుగా కలిసికట్టుగా రికార్డులు సాధించడం చూశాం కానీ..ఈసారి ఏకంగా మెగా టోర్నమెంట్ కే ఒక రికార్డ్ వచ్చి చేరింది.
ఎందుకంటే 48 ఏళ్ల వరల్డ్ కప్ చరిత్రలో అన్నిజట్లు, అంతమంది ఆటగాళ్లు ఆడారు గానీ, ఎవ్వరూ కూడా ఒక ఎడిషన్ లో ఇన్ని సెంచరీలు చేయలేదు. అందుకనే అత్యధిక సెంచరీలు చేసిన వరల్డ్ కప్ గా 2023 కొత్త రికార్డును తన పేరు మీద లిఖించుకుంది.
ఇంతకీ ఎన్ని సెంచరీలు సాధించిందయ్యా అంటే 39 సెంచరీలు వచ్చాయి. సెమీఫైనల్ లో సౌతాఫ్రికా బ్యాటర్ డేవిడ్ మిల్లర్ చేసిన సెంచరీతో ఈ రికార్డ్ సొంతమైంది. ఇంకా ఫైనల్ కూడా ఒకటుంది. అందులో ఎవరైనా సెంచరీలు చేస్తే అవి కూడా కలుస్తాయి.
ఈ 39 సెంచరీలు ఎవరెవరు చేశారంటే సౌతాఫ్రికా ఓపెనర్ డికాక్ (4), విరాట్ కొహ్లీ (3), రచిన్ రవీంద్ర (3), ఇంకా మిచెల్, శ్రేయాస్ అయ్యర్, వార్నర్, డుసెన్, మార్ష్, మాక్స్ వెల్ తలా రెండేసి సెంచరీలు చేశారు. రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, మార్కరమ్, మలాన్ మరికొందరు తలా ఒక సెంచరీ చేశారు. ఇవన్నీ కలిపి మొత్తం 39 ఉన్నాయి.
ఇలాగే టీమ్ ఇండియా కూడా ఒక అద్భుత రికార్డ్ నమోదు చేసింది. అదేమిటంటే ఒక క్యాలెండర్ ఇయర్ లో అత్యధిక సిక్సర్లు (251) కొట్టిన జట్టుగా రికార్డు నెలకొల్పింది. 2019లో విండీస్ (209), 2015 లో కివీస్ (179), 2023లో ఆస్ట్రేలియా (165) ఉన్నాయి. ఇక్కడ చెప్పుకోతగిన విషయం ఏమిటంటే ఈ ఏడాది ఇండియా ఆడే వన్డేలు మరికొన్ని ఉన్నాయి. దీంతో ఈ రికార్డు 251 నుంచి 300 దాటినా ఆశ్చర్యం లేదని అంటున్నారు.
టీమ్ ఇండియాలో రోహిత్ శర్మ, శ్రేయాస్, సూర్య కుమార్ యాదవ్ లు విధ్వంసకర బ్యాటింగ్ చేస్తారు. అలవోకగా సిక్సర్లు కొడతారు. వీరితో పాటు శుభ్ మన్ గిల్, కొహ్లీ, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా వీరందరూ ఉన్నారు.
వీరందరూ ఉండటం వల్ల సిక్సులు అలవోకగా వస్తూనే ఉంటాయి. అందువల్ల రాబోవు కాలంలో సిక్సర్ల రికార్డ్ ఇండియాని దాటి అంతత్వరగా వెళ్లే ఛాన్సే లేదని కూడా అంటున్నారు.