
Astrotalk : భారత్ – ఆస్ట్రేలియా మధ్య మరికొద్దిగంటల్లో వరల్డ్ కప్ ఫైనల్ పోరు మొదలుకానుంది. ఈ మ్యాచ్ ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు లక్ష 30 వేల మంది ఇప్పటికే నరేంద్రమోదీ స్టేడియంకు చేరుకున్నారు. వరల్డ్ కప్ 2023 ఫైనల్స్ లో ఉన్న ఇండియా కప్ గెలవాలని 140 కోట్లమంది భారతీయులు ఆకాంక్షిస్తున్నారు. ముచ్చటగా మూడోసారి మెగా కప్పును టీమిండియా ముద్దాడాలని ప్రార్థిస్తున్నారు. ఈ క్రమంలో ఓ ఆస్ట్రాలజీ కంపెనీ సీఈఓ సంచలన ప్రకటన చేశారు. భారత్ గెలవాలని కోరుతూ.. తమ కస్టమర్లకు బంపరాఫర్ ప్రకటించారు. ఫైనల్ లో భారత్ గెలిస్తే రూ.100 కోట్లు పంచుతానని తెలిపారు.
ఇంతకీ ఏంటా కంపెనీ ? ఎవరు ఆ సీఈఓ అని ఆలోచిస్తున్నారా ? ప్రముఖ ఆస్ట్రాలజీ కంపెనీ ఆస్ట్రోటాక్ సీఈఓ పునీత్ గుప్తా ఈ ప్రకటన చేశారు. 2011లో భారత్ ప్రపంచకప్ గెలిచినపుడు తాను కాలేజీలో చదువుకుంటున్నానని, ఆరోజున స్నేహితులతో కలిసి ఆడిటోరియంలో మ్యాచ్ చూశానని తెలిపారు. ఆ టోర్నీలో టీమిండియా గెలిచాక తమ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయన్నారు. “ఇప్పుడు టీమిండియా మళ్లీ ఫైనల్ కు వచ్చింది. గెలిస్తే ఏం చేయాలి అని చాలా సేపు ఆలోచించాక.. యాజర్లు గుర్తొచ్చారు. వారంతా కూడా నా స్నేహితులే. వారితో నా ఆనందాన్ని పంచుకోవాలనుకుంటున్నా. టీమిండియా ప్రపంచకప్ ను ముద్దాడితే.. మా సంస్థ యూజర్లందరికీ రూ.100 కోట్లను సమానంగా పంచాలని నిర్ణయించుకున్నా. టీమిండియా గెలవాలని ప్రార్థిద్దాం” అని పునీత్ గుప్తా తన పోస్ట్ లో వెల్లడించారు.