
IND vs PAK match: వన్డే ప్రపంచ కప్‌లో భారత్ – పాకిస్థాన్ (IND vs PAK) మ్యాచ్ టికెట్లపై వివాదం నడుస్తోంది. అక్టోబర్ 14న జరగనున్న మ్యాచ్ సంబంధించిన కొన్ని టికెట్లను మంగళవారం సాయంత్రం ఆన్‌లైన్‌లో పెట్టారు. గంటలోనే సోల్డ్ ఔట్ అని కనిపించడంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు.
గంటలోనే టికెట్లు అయిపోవడం ఏంటి? అసలు ఎన్ని టికెట్లను అందుబాటులో ఉంచారో చెప్పాలని క్రికెట్ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు.
అభిమానుల ఒత్తిడికి బోర్డు దిగొచ్చింది. కొన్ని టికెట్లను మాత్రమే ఆన్‌లైన్లో అందుబాటులో ఉంచామని, సెప్టెంబర్ 3న మరోసారి సేల్ ఉంటుందని బీసీసీఐ ప్రకటించింది.
ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ బోర్డు అయిన బీసీసీఐ.. టికెట్ బుకింగ్ సిస్టమ్ ఇలా ఉందంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. టికెట్ల కోసం ఆన్‌లైన్ క్యూలో ఎంటర్ అయినా.. టికెట్ జారీకి 4 గంటల నుంచి 4 నెలల ఎక్స్‌పెక్టెడ్ టైమ్ చూపించడంతో.. ఫుల్‌గా ట్రోలింగ్ చేస్తున్నారు.
ఆన్‌లైన్ బుకింగ్ అంతా స్కాం అని మండిపడుతున్నారు కొందరు. టికెట్లు అమ్మకూడదని అనుకుంటే ఇలాంటి డ్రామాలు చేయడం ఎందుకని.. అభిమానుల భావోద్వేగాలతో ఆడుకోవడం దారుణమని.. నెటిజన్స్ కామెంట్లతో కుమ్మేస్తున్నారు.