
IND vs SA 1st Test : కర్ణుడి చావుకి కారణాలనేకం అన్నట్టు టీమ్ ఇండియా ఘోర పరాజయానికి ఎన్నో కారణాలు కనిపిస్తున్నాయి. సెంచూరియన్ వేదికపై జరిగిన బాక్సింగ్ డే టెస్టులో టీమ్ ఇండియా ఇన్నింగ్ , 32 పరుగుల తేడాతో ఓటమి పాలు కావడాన్ని క్రీడాభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు. అయితే ఆ ఇద్దరి వల్ల టెస్ట్ మ్యాచ్ ఓటమి పాలైందని అంటున్నారు. ఇంతకీ వారెవరంటే… ఒకరు ప్రసిద్ధ్ కృష్ణ, మరొకరు శార్దూల్ ఠాకూర్ గా చెబుతున్నారు.
దీనంతటికి ప్రధాన కారణం కోచ్ రాహుల్ ద్రవిడ్ అని విమర్శిస్తున్నారు. ప్రసిద్ధ్ కర్ణాటక వాడు కావడంతోనే ద్రవిడ్ నెత్తిమీద పెట్టుకుంటున్నాడని విమర్శలు గుప్పిస్తున్నారు. 20 ఓవర్లు వేసి 93 పరుగులిచ్చి ఒక్క వికెట్ మాత్రమే తీసుకున్నాడని చెబుతున్నారు.
ఇక శార్దూల్ ఠాకూర్ 5.31 ఎకానమీ రేటుతో 101 పరుగులు సమర్పించుకున్నాడు. అటు బ్యాటింగ్‌లోనూ ఏ మాత్రం ప్రభావం చూపించలేకపోయాడు. ఒకే ఒక వికెట్టు పడగొట్టాడు. తను టెస్ట్ మ్యాచ్ లకు సరిపోడని సీనియర్లు వ్యాఖ్యానిస్తున్నారు.
వన్డే సిరీస్‌లో ముఖేష్ కుమార్ బ్రహ్మాండంగా బౌలింగ్ చేశాడు. సూపర్ ఫామ్‌లో ఉన్న తనని కాదని ప్రసిద్ద్ ని ఆడించడం ఘోర తప్పిదమని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. అదే ముఖేష్ ఉండి ఉంటే, యార్కర్లు వేయడంలో మంచి దిట్ట అని చెబుతున్నారు. ఇప్పటికైనా కళ్లు తెరిచి రెండో టెస్ట్‌లోనైనా ముఖేష్ కుమార్‌కు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
టెస్ట్ జట్టు సెలక్షన్ విషయంలో సెలక్టర్లు చాలా ఉదాసీనత ప్రదర్శించారని చెబుతున్నారు. ఆ ఐదుగురు బౌలర్లు అనే కాన్సెప్ట్ ఇప్పుడు కొంప ముంచుతోందని, ఆల్ రౌండర్ లేని లోటు స్పష్టంగా తెలుస్తోందని అంటున్నారు. శార్దూల్ ఠాకూర్ ని ఆల్ రౌండర్ గా చెప్పలేని దుస్థితిలో ఉన్నారని అంటున్నారు.
సౌతాఫ్రికా గడ్డపై టెస్ట్ సిరీస్ గెలవాలనే కోరిక మళ్లీ తీరనేలేదు. ఎందుకంటే ఒకవేళ రెండో టెస్ట్ లో టీమ్ ఇండియా గెలిస్తే సిరీస్ సమం అవుతుంది. ఓడితే సిరీస్ పోతుంది. ఎప్పటిలా ఫ్లయిట్ ఎక్కి ఇండియాకి వచ్చేస్తారు.
అయితే టీమిండియా ఓటమికి బ్యాటింగ్ వైఫల్యం ప్రధాన కారణంగా చెబుతున్నారు. హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ ని కూడా ఆడిపోసుకుంటున్నారు. మహమ్మద్ షమీ లేని లోటు స్పష్టంగా కనిపించింది. ఫైనల్ గా సమతుల్యత ఉన్న జట్టుగా టీమ్ ఇండియాను తీర్చిదిద్దాల్సిన అవసరం ఎంతైనా ఉందని అంటున్నారు.