Big Stories

T20 World Cup : భారత్ మహిళల జోరు.. విండీస్ పై ఘన విజయం.. సెమీస్ రేసులో ముందుకు..

T20 World Cup : దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ లో భారత్ మహిళల జట్టు జోరు కొనసాగుతోంది. తొలి మ్యాచ్ లో దాయాది జట్టు పాకిస్థాన్ ను చిత్తు చేసిన భారత్… అదే ఊపులో కేప్ టౌన్ లో జరిగిన రెండో మ్యాచ్ లో విండీస్ పై ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ టీమ్ భారత్ కు 119 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టీమిండియా ఓపెనర్లు స్మృతి మంధాన, షఫాలీ వర్మ దూకుడుగా ఇన్నింగ్స్ ను ప్రారంభించారు. అయితే నాలుగో ఓవర్ లో స్మృతి ( 10) అనవసరమైన షాట్ కు ప్రయత్నించి కరిష్మా బౌలింగ్ లో స్టంపౌట్ అయ్యింది. కాసేపటికే జేమీమా రోడ్రిగ్స్ ( 1), షఫాలీ వర్మ ( 28) వెంట వెంటనే అవుట్ కావడం భారత్ కష్టాల్లో పడింది.

- Advertisement -

ఈ దశలో కెప్టెన్ హర్మన్ , కీపర్ రిచా ఘోష్ మంచి భాగస్వామ్యం నెలకొల్పారు. ముఖ్యంగా రిచా దూకుడు ఆడుతూ జట్టను విజయం వైపు నడిపించింది. ఈ జోడి 72 పరుగుల భాగ్యస్వామ్యం నెలకొల్పింది. విజయానికి నాలుగు పరుగుల దూరంలో హర్మన్ (33) భారీ షాట్ కు ప్రయత్నించి పెవిలియన్ బాట పట్టింది. అయితే రిచా ఘోష్ 32 బంతుల్లోనే 5 ఫోర్ల సాయంతో 44 పరుగులు చేసి అజేయంగా నిలిచి జట్టును విజయ తీరాలకు చేర్చింది. దీంతో భారత్ మరో 11 బంతులు మిగిలి ఉండగానే 6 వికెట్ల తేడాతో విండీస్ పై గెలిచింది.

- Advertisement -

అంతకు ముందు తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసింది. ఆ జట్టులో టేలర్ (42), క్యాంప్ బెల్ (30) , నేషన్ ( 21 నాటౌట్ ) కాస్త మెరుగ్గా రాణించారు. మిగతా బ్యాటర్లు విఫలం కావడంతో విండీస్ భారీ స్కోర్ సాధించలేకపోయింది. భారత్ బౌలర్లలో దీప్త శర్మ 15 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీసింది. ఈ క్రమంలో టీ20ల్లో వంద వికెట్లు తీసిన తొలి భారత్ బౌలర్ గా రికార్డు సృష్టించింది. దీప్తి శర్మకే ఫ్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. రేణుకా సింగ్, పూజా వస్త్రాకర్ చెరో వికెట్ తీశారు. వరుసగా రెండు విజయాలు సాధించిన భారత్ సెమీస్ రేసులో ముందుంది. టీమిండియా.. ఇంగ్లాండ్ , ఐర్లాండ్ లతో మ్యాచ్ లు ఆడాల్సిఉంది. ఇందులో ఒక మ్యాచ్ గెలిచినా సెమీస్ చేరడం ఖాయం.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News