
India T20 Squad : వెస్టిండీస్ పర్యటనకు వెళ్లే భారత్ టీ20 జట్టును ప్రకటించారు. అజిత్ అగార్కర్ సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రోజే జట్టును ఎంపిక చేశాడు. అగార్కర్ తన మార్కును చూపిస్తూ యువకులకు జట్టులో చోటు కల్పించాడు. తెలుగు తేజం తిలక్ వర్మ తొలిసారి భారత్ జట్టుకు ఎంపికయ్యాడు. ఐపీఎల్ లో అదరగొట్టిన యశస్వి జైస్వాల్, బెంగాల్ పేసర్ ముకేశ్ కుమార్ అవకాశం దక్కించుకున్నారు. స్పిన్నర్ రవి బిష్ణోయ్, పేస్ బౌలర్ అవేష్ ఖాన్ తిరిగి జట్టులోకి వచ్చారు.
ఆగస్టు 3న భారత్ -విండీస్ మధ్య తొలి టీ20 మ్యాచ్ జరుగుతుంది. మొత్తం ఈ సిరీస్ లో 5 మ్యాచ్ లు జరుగుతాయి. హార్దిక్ పాండ్య టీమిండియాకు కెప్టెన్ గా వ్యవహరిస్తాడు. సూర్యకుమార్ యాదవ్ కు వైస్ కెప్టెన్ బాధ్యతలు అప్పగించారు. విండీస్‌తో వన్డేలకు ఎంపికైన ఉమ్రాన్ మాలిక్‌కు సెలక్టర్లు టీ20ల్లోనూ అవకాశం కల్పించారు. ఇద్దరు వికెట్ కీపర్లు ఇషాన్ కిషన్, సంజు శాంసన్ జట్టులో ఉన్నారు. టీ20 సిరీస్ కంటే ముందు విండీస్‌తో టీమిండియా 2 టెస్టులు, 3 వన్డేలు ఆడుతుంది. తొలి టెస్టు ఈ నెల 12న ప్రారంభమవుతుంది.
భారత్ జట్టు : హార్దిక్ పాండ్య (కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్ (వైస్‌కెప్టెన్),శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, చాహల్, కుల్‌దీప్ యాదవ్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్, అవేష్ ఖాన్, ముకేశ్ కుమార్.