
ICC World Cup 2023 : ఆస్ట్రేలియా టీమ్ లో బ్యాటర్లు ఒక్కసారే అవుట్ అయ్యే అవకాశం ఇస్తారు. ఆ సమయంలో ఇండియన్స్ క్యాచ్ మిస్ చేశారంటే మాత్రం భారీ మూల్యం చెల్లించక తప్పదు. అలా ఆస్ట్రేలియా మీద క్యాచ్ వదిలేస్తే మళ్లీ వారు దొరకరు. అంతేకాదు.. ఇంకా జాగర్తగా ఆడి, క్యాచ్ వదిలేసినోడి టపారం లేపేస్తారని సీనియర్లు హెచ్చరిస్తున్నారు.
ఎందుకంటే ఇదే వరల్డ్ కప్ లో అటువంటి సంఘటనలు ఎన్నికావాలంటే అన్ని కనిపిస్తాయి. అలాంటి వాటిలో కొన్ని మీకోసం.. ఆస్ట్రేలియాతో గెలవాల్సిన మ్యాచ్ ని ఆఫ్గాన్ వాళ్లు ఇలాగే క్యాచ్ లు వదిలి కొంప మీదకి తెచ్చుకున్నారు. 36 పరుగుల వద్ద మ్యాక్స్ వెల్ ఇచ్చిన క్యాచ్ ని వదిలేయడంతో తగిన మూల్యం చెల్లించుకున్నారు. తర్వాత ఇచ్చిన మరో క్యాచ్ ని వదిలేశారు. దాంతో మ్యాక్స్ వెల్ మరో తప్పు చేయలేదు. డబుల్ సెంచరీతో తుక్కు రేగ్గొట్టి వదిలాడు.
పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో డేవిడ్ వార్నర్ 10 పరుగుల దగ్గర ఇచ్చిన క్యాచ్ ని కొత్త ఆటగాడు ఉసామా మిర్ వదిలేశాడు. అంతే 164 పరుగులు చేసి మ్యాచ్ ని ఏకపక్షం చేసేశాడు. తర్వాత పాక్ మళ్లీ కోలుకోలేదు. ఆటగాళ్లు చేసిన పొరపాట్లకి పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్ బలైపోయాడు.
సౌతాఫ్రికాతో జరిగిన సెమీఫైనల్ లో ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఇచ్చిన సులువైన క్యాచ్ లను నేలపాలు చేశారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఆరు క్యాచ్ లు వదిలేశారు. దీంతో గెలవాల్సిన మ్యాచ్ ఓడిపోవాల్సి వచ్చింది. చివరికి కెప్టెన్ బవుమా మాట్లాడుతూ మాకు ఏడుపొక్కటే తక్కువ అని అన్నాడు.
ఆస్ట్రేలియాకి ఒక్క జీవదానం చేసినా, అది సరిదిద్దుకోలేని తప్పుగా మారిపోతుంది. ఆటలో పొరపాట్లు సహజం. కాకపోతే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ అందుకు భిన్నమని చెప్పాలి. అందుకే ఇక్కడ చాలా జాగర్తగా ఆడాల్సి ఉంటుంది. అయితే టీమ్ ఇండియా అద్భుతంగా ఆడుతోంది. అన్నివిధాలా వరల్డ్ కప్ కి అర్హత ఇండియాకే ఉందని చెప్పాలి. అంతేకాదు ఆటగాళ్లందరూ కూడా అద్భుతఫామ్ లో ఉన్నారు. ఇదొక శుభ పరిణామం అని చెప్పాలి.