India Vs Zimbabwe T20: టీ 20 ప్రపంచకప్ గెలిచిన ఉత్సాహం, అందరిలో జోష్ నింపింది. అదే ఊపుతో జింబాబ్వే వెళ్లిన కుర్రాళ్లు తొలి టీ20లో చతికిలపడ్డారు. హరారేలో జరిగిన తొలి టీ 20లో పరాజయం పాలైంది. అయితే అనుభవం లేమి స్పష్టంగా కనిపించింది. నిజానికి టాస్ గెలిచి మరీ ఓడిపోయారు. ఇది అభిమానులకు కొంత నిరాశ కలిగించింది.
సీనియర్లకు ధీటుగా ఆడుదామని భావించి తొలి మ్యాచ్ లో మన కుర్రాళ్లు అత్యుత్సాహంతో అనవసర షాట్లకు పోయి వికెట్లు సమర్పించుకున్నారు. జింబాబ్వే బౌలర్లు అద్భుతంగా బౌలింగు చేసి టీమ్ ఇండియాని ఎక్కడా కోలుకోనివ్వలేదు. ఇకపోతే తక్కువ స్కోరుకి జింబాబ్వేని కట్టడి చేసి కూడా మనవాళ్లు గెలవలేక చతికిలపడ్డారు.
మొదట బ్యాటింగ్ కి వచ్చిన జింబాబ్వే 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 115 పరుగులు చేసింది. లక్ష్యఛేదనలో టీమ్ ఇండియా 19.5 ఓవర్లలో 102 పరుగులకి ఆలౌట్ అయ్యింది. 13 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.
116 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన టీమ్ ఇండియాకి ఆదిలోనే కోలుకోని దెబ్బ తగిలింది. ఐపీఎల్ లో హైదరాబాద్ ఓపెనర్ గా చెలరేగి ఆడిన అభిషేక్ శర్మ ఇక్కడ డక్ అవుట్ అయ్యాడు. స్కోరు బోర్డుపై ఒక్క పరుగు లేకుండా అలా వికెట్ల పతనం మొదలైంది. ఆ పరంపర అలా కొనసాగుతూనే పోయింది.
జింబాబ్వే బౌలర్లపై ఆధిపత్యం చెలాయించాలనే అత్యుత్సాహంతో పిచ్ పరిస్థితిని గమనించకుండా గుడ్డిగా బ్యాట్ ఊపి ఒకరి తర్వాత ఒకరు ఔటైపోయారు. రుతురాజ్ (7), రియాన్ పరాగ్ (2), రింకూ సింగ్ (0), ధ్రువ్ జురెల్ (6), ముఖేష్ కుమార్ (0), రవి బిష్ణోయ్ (9) ఇలా ఫటాఫటా వికెట్లు పడిపోయాయి. ముగ్గురు డక్ అవుట్లు అయ్యారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
ఇక ఆడింది ఎవరంటే కెప్టెన్ శుభ్ మన్ గిల్ ఒకవైపు నిలిచి ఆడాడు. 29 బాల్స్ లో 5 ఫోర్ల సాయంతో 31 పరుగులు చేసి అవుట్ అయిపోయాడు. చివర్లో వాషింగ్టన్ సుందర్ (27), ఆవేశ్ ఖాన్ (16) చేయడంతో ఆమాత్రమైనా స్కోరు వచ్చింది. కనీసం గౌరవ ప్రదంగా ఓడిపోయారని అంత అనుకున్నారు. అయితే ఆవేశ్ ఖాన్ ఉన్నంతవరకు మ్యాచ్ గెలుస్తుందనే ఆశ ఉంది. తను అవుట్ కావడంతో ఓటమి నిశ్చయమైపోయింది.
నిజానికి ఒక దశలో 22 పరుగులకి 4 వికెట్లు కోల్పోయి టీమ్ ఇండియా పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. గిల్ అవుట్ అయ్యే సమయానికి స్కోరు 10.2 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 47 పరుగులతో గిలగిల్లాడుతోంది. అప్పుడు రవి, సుందర్, ఆవేశ్ ఖాన్ కలిసి ఆ ఓటమి వ్యత్యాసాన్ని తగ్గించి, అలా ఇండియా పరువు నిలబెట్టారు. రాబోవు మ్యాచ్ ల్లో అయినా జాగ్రత్తగా ఆడమని నెటిజన్లు కోరుతున్నారు. ఇదే పిచ్ పై మ్యాచ్ లు జరుగుతాయి కాబట్టి, కొంచెం చూసి, షాట్లు కొట్టమని అంటున్నారు.
ఇక జింబాబ్వే బౌలింగులో ఛతర 3, బ్లెస్సింగ్ 1, సికందర్ రజ 3, బ్రెయిన్ 1, విల్లింగ్టన్ 1, ల్యూక్ 1 వికెట్ పడగొట్టారు.
అంతకుముందు బ్యాటింగ్ ప్రారంభించిన జింబాబ్వేకి ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ ఇన్నోసెంట్ కైయా గోల్డెన్ డక్ అవుట్ అయ్యాడు. తర్వాత ఫస్ట్ డౌన్ వచ్చిన బ్రెయిన్ బెన్నెట్ (22), మరో ఓపెనర్ వెస్లీ (21) టీమ్ ఇండియా పేసర్లను సులువుగా ఎదుర్కొన్నారు. అడపాదడపా ఫోర్లు కొడుతూ పవర్ ప్లేలో చక్కగా ఆడారు. 5.1 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి చేసిన 40 పరుగులు చేశారు. అవే వారిని గెలిపించాయి. ఆ పని మనవాళ్లు చేయలేకపోయారు. 5 ఓవర్లు గడిచేసరికి మనవాళ్లు 22 పరుగులకే 4 వికెట్లు కోల్పోయారు.
Also Read: నువ్వు ఒక్కసారైనా వరల్డ్ కప్ గెలిచావా..? వాన్‌కు గట్టి కౌంటరిచ్చిన రవిశాస్త్రి
ఇకపోతే జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజ (17), డియాన్ మైర్స్ (23), క్లైవ్ మదాండే (29) చక్కగా ఆడారు. అయితే జింబాబ్వే ఆటగాళ్లు కూడా నలుగురు డక్ అవుట్లు అయ్యారు. కానీ నలుగురు 20పైనే పరుగులు చేశారు. ఒకరు 17 చేశారు. అలా నిలిచి అతికష్టమ్మీద 9 వికెట్ల నష్టానికి 115 పరుగులు చేశారు.
వారిలా మనవాళ్లు వికెట్లు కాపాడుకుంటూ సింగిల్స్ తీసైనా ముందుకు నడిపించలేకపోయారు. ఇదే వారికి, మనకి గెలుపు-ఓటమికి ఉన్న వ్యత్యాసం అని చెప్పాలి.
టీమ్ ఇండియా బౌలింగులో రవి బిష్ణోయ్ 4, వాషింగ్టన్ సుందర్ 2, ఆవేశ్ ఖాన్ 1, ముఖేష్ కుమార్ 1 వికెట్లు పడగొట్టారు.