INDW vs AUSW : ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలో టీమ్ ఇండియా అమ్మాయిలు చివరి వరకు పోరాడి ఓడిపోయారు. దీంతో మూడు వన్డేల సిరీస్ ను, మరో మ్యాచ్ ఉందనగానే 2-0 తేడాతో ఆసీస్ కైవసం చేసుకుంది.
ముంబై వాంఖేడి స్టేడియంలో జరిగిన రెండో వన్డేలో మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసింది. 259 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కి దిగిన భారత్ 8 వికెట్ల నష్టానికి 255 పరుగులు మాత్రమే చేయగలిగింది. విజయానికి అవసరమైన మూడు పరుగులను చేయలేక చతికిలపడింది. వన్ డౌన్ బ్యాటర్, వికెట్ కీపర్ రిచా ఘోష్ చేసిన 96 పరుగులు వృథా అయిపోయాయి.
మొదట టాస్ నెగ్గిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ తీసుకుంది. ఓపెనర్ పోబ్ లీచ్ ఫీల్డ్ (63), ఎలిస్ పెర్రీ (50) అర్థశతకాలతో మెరిశారు. మెక్ గ్రాత్ (24), జార్జియా వేర్ హామ్ (22), సదర్లాండ్ (23) స్కోర్ బోర్డుని పెంచే ప్రయత్నం చేసి అవుట్ అయ్యారు. చివర్లో అలానా కింగ్ దూకుడుగా ఆడి 28 పరుగులు చేసింది. మొత్తమ్మీద ఆస్ట్రేలియా 8 వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసింది.
భారత బౌలర్లలో స్పిన్నర్ దీప్తీ శర్మ 5 వికెట్లు తీసింది. శ్రేయాంక పాటిల్, స్నేహ్ రాణా, పూజా వస్త్రాకర్ తలా ఒక వికెట్టు పడగొట్టారు.
259 పరుగుల లక్ష్యసాధనలో టీమ్ ఇండియా అమ్మాయిలు తడబడుతూనే మొదలుపెట్టారు. ఓపెనర్ యాస్తికా భాటియా 14 పరుగులు చేసి అవుట్ అయ్యింది. మరో ఓపెనర్ స్మ్రతి మంథాన 36 పరుగులు చేసి ఫర్వాలేదనిపించింది. అయితే ఫస్ట్ డౌన్ లో వచ్చిన వికెట్ కీపర్ రిచా ఘోష్ చివరి వరకు పోరాడింది. 13 ఫోర్ల సాయంతో 96 పరుగులు చేసి విజయంపై ఆశలు పెంచింది. తను ఉన్నంత వరకు గెలుపు భారత్ వైపే మొగ్గు చూపింది.
తను 43.5 ఓవర్ లో 218 స్కోరు వద్ద 5 వ వికెట్టుగా వెనుతిరిగింది. అప్పటికి విజయానికి 41 పరుగుల దూరంలో భారత్ ఉంది. కానీ 39 పరుగులు మాత్రమే తర్వాత వాళ్లు చేయగలిగారు. విజయానికి మూడు పరుగుల దూరంలో ఆగిపోయారు.
జెమీమా రోడ్రిగ్స్ (44) రాణించింది. తర్వాత యాస్తికా భాటియా (14), కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (5) నిరాశపరిచారు. చివరికి దీప్తి శర్మ (24), శ్రేయంక పాటిల్ (5) నాటౌట్ గా నిలిచారు.
ఆసీస్ బౌలర్లలో జార్జియా వేర్ హామ్ 2, అనాబెల్ 3, గార్డ్ నర్, కిమ్, అలానా కింగ్ తలా ఒకొక్క వికెట్టు తీశారు. ఆఖరిదైన నామమాత్రపు మ్యాచ్ జనవరి 2న జరగనుంది.