Tanveer Ahmed On IND VS NZ: ఆక్లాండ్ వేదికగా జరిగిన నాలుగో టీ20లో టీమిండియా ఘోరంగా ఓడిపోయింది. వరుసగా మూడింటిలో గెలిచిన శ్రేయస్ అయ్యర్ సేన.. నాలుగో టీ20లో మాత్రం చేతులెత్తేసింది. దీంతో 87 పరుగుల తేడాతో టీమిండియాపై న్యూజిలాండ్ విక్టరీ అందుకుంది. అయితే ఈ మ్యాచ్ పై పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ తన్వీర్ అహ్మద్ రియాక్ట్ అయ్యారు. నిజంగా టీమిండియాలో ఛాంపియన్లు ఉంటే 260 పరుగుల టార్గెట్ అవలీలగా చేదించే వాళ్ళని వెల్లడించాడు. ఆ జట్టులో అందరూ చేతకాని దద్దమ్మలే ఉన్నారని.. అందుకే నాలుగో టీ20లో ఓడిపోయినట్టు వ్యాఖ్యానించాడు. సంజు శాంసన్, అభిషేక్ శర్మ ఇద్దరిలో ఎవరో ఒకరు రాణిస్తేనే.. టీమ్ ఇండియా గెలుస్తోందని లేకపోతే చిత్తుగా ఓడిపోతోందని షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. దీంతో టీమ్ ఇండియా పై తన్వీర్ అహ్మద్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
న్యూజిలాండ్ గడ్డపై వరుసగా విజయాలతో దూసుకు వెళ్తున్న టీమిండియా జట్టుపై తన్వీర్ అహ్మద్ (Tanveer Ahmed) రియాక్ట్ అయ్యాడు. నాలుగో టీ20లో భారత్ పూర్తిగా కళ తప్పినట్టు కనిపించిందని బాంబు పేల్చాడు. గ్లెన్ ఫిలిప్స్ సెంచరీ చేసే క్రమంలో టీమ్ ఇండియా బౌలర్లకు చుక్కలు చూపించాడని గుర్తు చేశాడు. అదే సమయంలో టీమిండియా బ్యాటర్లు మాత్రం తేలిపోయినట్టు విమర్శలు చేశాడు. నాలుగో టీ20లో భారత బ్యాటర్ల అసలు రంగు బయటపడిందని చురకలు అంటించాడు. ఇండియాలోని హైవే పిచ్ లపై ఆడిన టీమిండియా క్రికెటర్లు న్యూజిలాండ్ లో ఆడలేరని తాను ముందు నుంచి చెబుతున్నట్టు గుర్తు చేశాడు.
అందుకే 260 పరుగుల లక్ష్యాన్ని చేదించలేక చేతులెత్తేసారని ఫైర్ అయ్యాడు. కానీ కొంత మంది ఇండియన్స్ తన యూట్యూబ్ ఛానల్ కు వచ్చి మరీ, నన్ను ట్రోల్ చేస్తున్నాడని చురకలు అంటించాడు. టీమిండియా ఓడిపోయినప్పుడు వీళ్ళు పారిపోతున్నారని సెటైర్లు పేల్చాడు. దమ్ముంటే ఇప్పుడు చూసుకుందాం రండి అంటూ సవాల్ విసిరాడు. అభిషేక్ శర్మ అలాగే సంజు శాంసన్ ఇద్దరు బాగా ఆడితేనే టీమిండియా విజయం సాధిస్తుందని వ్యాఖ్యానించాడు.
వీళ్ళిద్దరిని త్వరగా ఔట్ చేస్తే టీమిండియా చిత్తుగా ఓడిపోతుందని దానికి నాలుగో టీ20 నిదర్శనం అంటూ వ్యాఖ్యానించాడు. ఇది ఇలా ఉండగా, ఆక్లాండ్ వేదికగా టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య ఫైట్ జరిగింది. ఇందులో న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 259 పరుగులు సాధించింది. ఈ లక్ష్యాన్ని చేదించే క్రమంలో విఫలమైన టీమిండియా తొమ్మిది వికెట్ల నష్టానికి 172 పరుగులు మాత్రమే సాధించింది. దీంతో 87 పరుగుల తేడాతో ఓడిపోవాల్సి వచ్చింది.