Knight Riders : ఒక్క ఇన్నింగ్స్… ఒకే ఒక్క ఇన్నింగ్స్ క్రికెట్ లో బ్యాటర్ల తలరాతనే మార్చేస్తూ ఉంటుంది. అప్పటిదాకా సాదాసీదా బ్యాటర్ గా ఉండే ఓ క్రికెటర్… ఒక్కసారి అద్భుతంగా ఆడితే చాలు… ఓవర్ నైట్ లో హీరోగా మారిపోతుంటాడు. బంగ్లాదేశ్ బ్యాటర్ లిట్టన్ దాస్ ది కూడా ఇప్పుడు అదే పరిస్థితి. బంగ్లాదేశ్ తరఫున చాలా ఏళ్లుగా ఆడుతున్న లిట్టన్ దాస్… 35 టెస్టులు, 57 వన్డేలు, 62 టీ20లు ఆడి… 5 వేలకు పైగా పరుగులు సాధించాడు. ఇందులో 8 సెంచరీలు, 29 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. బంగ్లా తరఫున వన్డేల్లో అత్యధికంగా 176 రన్స్ చేసిన రికార్డ్ కూడా దాస్ పేరు మీదే ఉంది. ఇన్ని ఘనతలున్నా ఏనాడూ ఎవరూ పట్టించుకోని లిట్టన్ దాస్… T20 వరల్డ్ కప్ లో భారత్ పై మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో… ఇప్పుడు అందరి కళ్లలో పడ్డాడు.
కేవలం 21 బంతుల్లోనే 6 ఫోర్లు, 3 సిక్సర్లతో హాఫ్ సెంచరీ చేసిన దాస్… అదే ఊపులో ఆడితే బంగ్లా విజయం ఖాయమని అనుకున్నారంతా. కానీ వర్షం కారణంగా ఓవర్లు కుదించడం… పిచ్, మైదానం చిత్తడిగా మారడం… దాస్ రనౌట్ కావడంతో పాటు వెంట వెంటనే వికెట్లు కోల్పోయి బంగ్లా ఓటమి పాలైంది. ఆ జట్టు ఓడినా… దాస్ ఇన్నింగ్స్ ను రెండు దేశాల క్రికెట్ అభిమానులు అంత ఈజీగా మర్చిపోలేరు. ఇప్పుడు ఓ ఐపీఎల్ ఫ్రాంచైజీ కూడా దాస్ ఆటతీరు చూసి… అతనిపై మనసు పారేసుకుందన్న ప్రచారం జరుగుతోంది. రెండుసార్లు ఐపీఎల్ ఛాంపియన్ అయిన కోల్‌కతా నైట్‌రైడర్స్… దాస్‌ను దక్కించుకునేందుకు ఇప్పటి ప్రయత్నిస్తోందని చెబుతున్నారు. లిట్టన్ దాస్ స్వతహాగా బెంగాలీ కావడంతో… తమ జట్టులో ఉంటే బాగుంటుందని ఫ్రాంచైజీకి చెందిన కీలక వ్యక్తి అతనితో సంప్రదింపులు జరిపేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. అతను అనుకున్నట్లు జరిగితే… దాస్ ను కేకేఆర్ టీమ్ లో చేరడం ఖాయం.