India vs Pakistan: భారత్ – పాకిస్తాన్ దేశాల మధ్య క్రికెట్ మ్యాచ్ కోసం ఇరుదేశాల క్రీడాభిమానులే కాకుండా.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తారన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా భారత్ – పాకిస్తాన్ జట్లమధ్య జరిగిన మ్యాచ్ ని ఎంతగానో ఎంజాయ్ చేశారు క్రీడాభిమానులు. ఈ ఐసీసీ టోర్నీలో భారత జట్టు పాకిస్తాన్ ని ఆరు వికెట్ల తేడాతో ఓడించి తమ ఆధిపత్యాన్ని మరోసారి నిరూపించుకుంది.
ఈ ఓటమితో పాకిస్తాన్ జట్టు టోర్నమెంట్ నుండి నిష్క్రమించాల్సి వచ్చింది. అయితే ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ కోసం ఎంతగానో ఎదురుచూసే అభిమానులకు మరో మరో శుభవార్త. అదేంటంటే.. ఈ ఏడాది మరోసారి భారత్ – పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్లను చూడబోతున్నారు. ఈ సంవత్సరం ఆసియా కప్ నిర్వహించాలని ఆసియా క్రికెట్ కౌన్సిల్ {ఎసిసి} నిర్ణయించింది. ఈ టోర్నీ ఈ సంవత్సరం సెప్టెంబర్ లో జరిగే అవకాశం ఉంది. అయితే ఆసియా కప్ ఈసారి దుబాయ్ లేదా శ్రీలంకలో జరగనున్నట్లు సమాచారం.
ఈ ఆసియా కప్ లో భాగంగా భారత్ – పాకిస్తాన్ జట్ల మధ్య మూడు మ్యాచ్ లు జరిగే అవకాశం ఉంది. ఈసారి ఈ కాంటినెంటల్ టోర్నీ టీ-20 ఫార్మాట్ లో జరగబోతోంది. ఇందులో మొత్తం 19 మ్యాచులు జరుగుతాయి. సెప్టెంబర్ 2, 4 వారాల మధ్యలో ఈ టోర్నీ జరగబోతోంది. అయితే ఈ టోర్నీ మొదట భారత్ కి కేటాయించబడింది. కానీ భారత్-పాకిస్తాన్ దేశాల మధ్య సత్సంబంధాలు లేని కారణంగా ఈ టోర్నీని తటస్థ వేదికపై నిర్వహించాలని ఎసిసి నిర్ణయించింది.
ప్రస్తుతానికి వేదిక ఖరారు కానప్పటికీ.. దుబాయి లేదా శ్రీలంకలో ఈ టోర్నీ నిర్వహించే అవకాశం ఉంది. ఈ ఆసియా కప్ టోర్నీ 2025 ఎడిషన్ లో భారత్, పాకిస్తాన్ దేశాలతో పాటు శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్గనిస్తాన్, యూఏఈ, ఓమన్, హాంకాంగ్ పాల్గొంటాయి. ఉపఖండం నుండి నేపాల్ ఒక్కటే ఈ టోర్నీకి అర్హత సాధించలేకపోయింది. ఈ జట్లను రెండు గ్రూపులుగా విభజిస్తారు. అయితే అందరూ ఊహించినట్లుగానే భారత్ పాకిస్తాన్ ఒకే గ్రూపులోనే ఉంటాయి. ఈ 8 జట్లను రెండు గ్రూపులుగా విభజిస్తారు.
ఇందులో ఒక్కో గ్రూపులో రెండు జట్లు తదుపరి రౌండ్ కి అర్హత సాధిస్తే.. సూపర్ ఫోర్ దశలో కూడా మళ్లీ ఆడవచ్చు. మొదటి, రెండు స్థానాల్లో నిలిచిన జట్లు ఫైనల్ కి అర్హత సాధిస్తాయి. అలా భారత్-పాకిస్తాన్ గ్రూప్ దశలో ఒకసారి, సూపర్ ఫోర్ దశలో మరోసారి, ఫైనల్ లో మూడోసారి తలపడే అవకాశం ఉంది. ఇక టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇప్పటికే టీ-20 ఫార్మాట్ కి రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో.. ఈ ఆసియా కప్ కి, ప్రస్తుతం ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో వైస్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్న గిల్.. జట్టు సారధ్య బాధ్యతలను చేపట్టే అవకాశం ఉంది. మొత్తానికి భారత్ – పాకిస్తాన్ మ్యాచ్ జరిగితే అదో మినీ యుద్ధంలా ఉంటుందనడంలో సందేహం లేదు.