Manoj Tiwari: టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ పైన మాజీ క్రికెటర్ మనోజ్ తివారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా వన్డే కెప్టెన్ గా ఉన్న రోహిత్ శర్మను జట్టులోంచి తొలగించే కుట్రలు జరుగుతున్నాయని… బాంబు పేల్చాడు. ఆ దిశగా భారత క్రికెట్ నియంత్రణ మండలి అడుగులు వేస్తున్నట్లు స్పష్టం చేశాడు మనోజ్ తివారి. టీమిండియా కు సెలెక్ట్ కావాలంటే యోయో టెస్ట్ మొదట ఉండేదని… కానీ ఇప్పుడు బ్రాంకో టెస్ట్ తెరపైకి తీసుకు వస్తున్నారని.. ఆగ్రహం వ్యక్తం చేశాడు. రోహిత్ శర్మను వన్డే జట్టు నుంచి తొలగించేందుకే ఈ టెస్టులు తీసుకు వస్తున్నారని… సంచలన వ్యాఖ్యలు చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్ మనోజ్ తివారి. ఇందులో గౌతమ్ గంభీర్ కుట్రలు ఉన్నట్లు కూడా ఆయన పేర్కొనడం గమనార్హం.
వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మనోజ్ తివారి
టీమిండియా మాజీ క్రికెటర్ మనోజ్ తివారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్గా ఎదుగుతున్న సమయంలోనే మనోజ్ తివారి కూడా టీమిండియాలో.. చోటు దక్కించుకునేందుకు చాలా కసరత్తులు చేశాడు. కానీ హెవీ కాంపిటీషన్ కారణంగా టీమిండియా జట్టులో మనోజ్ తివారికి పెద్దగా అవకాశాలు రాలేదు. దీంతో ఛాన్సులు దక్కించుకోలేక… చివరికి అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు తివారి. అయితే ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్లో మాత్రం కోల్కత్తా నైట్ రైడర్స్ లాంటి కొన్ని జట్ల తరఫున ఆడాడు.
ఇక ప్రస్తుతం రాజకీయాల్లో కొనసాగుతున్న మనోజ్ తివారి… మహేంద్ర సింగ్ ధోని అలాగే రోహిత్ శర్మ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహేంద్ర సింగ్ ధోనీ కారణంగానే.. 2011 సమయంలో తనకు చాన్స్ రాలేదని… ఆగ్రహం వ్యక్తం చేశాడు మనోజ్ తివారి. సెంచరీ చేసినప్పటికీ కూడా టీమిండియాలోకి తనను తీసుకోలేదని ధోనిని ఉద్దేశించి నిప్పులు చెరిగాడు టీమిండియా మాజీ క్రికెటర్ తివారి. ఇక ఇప్పుడు రోహిత్ శర్మ గురించి కూడా హాట్ కామెంట్స్ చేశాడు. రోహిత్ శర్మను జట్టులోంచి తీసివేసేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి కుట్రలు చేస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశాడు. అందుకే యోయో టెస్ట్ స్థానంలో బ్రాంకో టెస్టులు కూడా నిర్వహించేందుకు బీసీసీఐ అడుగులు వేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ టెస్టుల్లో రోహిత్ శర్మ పాస్ కాడని.. అందుకే ఈ టెస్ట్ లు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారని మండిపడ్డాడు.
అసలు ఏంటి ఈ బ్రాంకో టెస్టులు ?
టీమిండియా తొలి జట్టులో స్థానం దక్కించుకోవాలంటే కచ్చితంగా యోయో టెస్ట్ పాస్ కావాల్సిందే. ఇది ఒకప్పటి మాట. కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది. యోయో టెస్ట్ ఒకటే కాదు కొత్తగా బ్రాంకో టెస్ట్ పెట్టేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి సన్నద్ధమవుతోంది. ఈ టెస్టుల ప్రకారం 20, 40, 60 మీటర్ల దూరాల మధ్య పరిగెత్తాల్సి ఉంటుంది ప్లేయర్లు. మొదట 20 మీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాన్ని చేరుకున్న తర్వాత తిరిగి వెనక్కి రావలసి ఉంటుంది. అలా మొత్తం మూడు రౌండ్లు టెస్టులు నిర్వహిస్తారు. ఇలా మొత్తం 1200 మీటర్లు పరిగెత్తాల్సి ఉంటుంది.