Mohammad aamir on Sachin Wicket: లిటిల్ మాస్టర్ సచిన్ టెండూల్కర్ (Sachin tendulkar) గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. టన్నుల కొద్ది పరుగులు… అర్థ సెంచరీలు, సెంచరీలు చేసి ఎన్నో ప్రపంచ రికార్డులను నెలకొల్పారు సచిన్ టెండూల్కర్. బ్యాటర్ గానే కాకుండా బౌలర్ గా కూడా టీమిండియా కు చాలాసార్లు అండగా నిలబడ్డారు. ప్రత్యర్థి జట్టును ఓడించేందుకు, ఎంతకైనా తెగిస్తాడు సచిన్. అందుకే అతడిని క్రికెట్ గాడ్ అని పిలుస్తూ ఉంటారు. అలాంటి సచిన్ టెండూల్కర్ పై తాజాగా మహమ్మద్ అమీర్ (Mohammad Amir) సంచలన వ్యాఖ్యలు చేశారు. లిటిల్ మాస్టర్ సచిన్ టెండూల్కర్ కు బౌలింగ్ చేయాలంటే గుండెపోటు వచ్చినంత పని అయ్యేదని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అతడు ఒక లెజెండరీ క్రికెటర్ అని.. అలాంటోడిని ఎదుర్కోవడం చాలా గొప్ప విషయం అన్నారు.
లిటిల్ మాస్టర్ సచిన్ టెండూల్కర్ కు బౌలింగ్ వేయడంపై మహమ్మద్ అమీర్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. తన కెరీర్ ప్రారంభంలో సచిన్ టెండూల్కర్ కు బౌలింగ్ చేయాలంటే వణుకు పుట్టేదన్నారు. గుండెపోటు వచ్చినంత పని కూడా అయిందని వ్యాఖ్యానించారు. అయితే 2009లోనే ఓ మ్యాచ్ లో సచిన్ టెండూల్కర్ ను తాను 8 పరుగులకే అవుట్ చేసినట్లు గుర్తు చేశారు. ఆ రోజున పాకిస్తాన్ వీధుల్లో తన ఫోటో పెట్టుకుని అభిమానులు సెలబ్రేషన్స్ చేసుకున్నారని ఎమోషనల్ అయ్యారు. సచిన్ వికెట్ తీయడం అంటే పాకిస్తాన్ కు ఒక వరల్డ్ కప్ వచ్చినట్లే ఫీల్ అవుతారని షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. సచిన్ వికెట్ తీసిన తర్వాత మూడు రోజుల పాటు అసలు స్పృహలో లేనని కూడా వ్యాఖ్యానించారు. తన చరిత్రలో సచిన్ వికెట్ నిలిచిపోతుందన్నారు.
2009 సెప్టెంబర్ 25వ తేదీన టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ ( Team India vs. Pakistan ) మధ్య దక్షిణాఫ్రికా సెంచూరియన్ స్టేడియంలో మ్యాచ్ జరిగింది. ఇందులో పాకిస్తాన్ మొదట బ్యాటింగ్ చేసి 302 పరుగులు సాధించింది. అయితే ఈ లక్ష్యాన్ని చేదించే క్రమంలో సచిన్ టెండూల్కర్ బరిలోకి దిగారు. అప్పుడు మహమ్మద్ అమీర్ వయసు 17 ఏళ్లు మాత్రమే. అప్పటికి సచిన్ కు బౌలింగ్ వేయాలంటే భయపడుతూనే, 8 పరుగులకు అతడిని అవుట్ చేశాడు. ఇదే మ్యాచ్ లో పాకిస్తాన్ 54 పరుగులతో విజయం సాధించడం గమనార్హం. ఈ మ్యాచ్ తన చరిత్రలో నిలిచిపోతుందని తాజాగా ఇంటర్వ్యూలో మహమ్మద్ అమీర్ వెల్లడించారు. సచిన్ టెండూల్కర్ లాంటి గొప్ప ఆటగాడిని ఎదుర్కోవడం అదృష్టమేనన్నారు. అలాంటి వాళ్ల వికెట్లు తీస్తేనే మజా వస్తుందన్నారు.