Mohammad Yousuf: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) నేపథ్యంలో 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ( vaibhav suryavanshi) అదరగొడుతున్న సంగతి తెలిసిందే. మొన్న ఎలిమినేటర్ మ్యాచ్ సందర్భంగా సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుపైన ఏకంగా 97 పరుగులు చేసి బీభత్సం సృష్టించాడు వైభవ్ సూర్యవంశీ. ఈ క్రమంలో వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది. అంతకుముందు విమర్శలు చేసిన వాళ్లు కూడా ఇప్పుడు వైభవ్ ను మెచ్చుకుంటున్నారు. లేటెస్ట్ గా పాకిస్తాన్ మాజీ ఆటగాడు మహమ్మద్ యూసఫ్ ( Mohammad Yousuf) కూడా వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ కు ఫిదా అయిపోయాడు. వైభవ్ ను క్రిస్ గేల్ తో పోల్చొద్దు..వాడు షాహిద్ అఫ్రిది లాంటి చిచ్చరపిడుగు అంటూ మహ్మద్ యూసఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంటులో అద్భుతంగా రాణిస్తున్న 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీని మెచ్చుకుంటూ మహమ్మద్ యూసఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అందరూ క్రిస్ గేల్ తో వైభవ్ సూర్యవంశీని పోల్చుతున్నారు.. అది ఏ మాత్రం కరెక్ట్ కాదని తెలిపారు. వైభవ్ సూర్య వంశీని షాహిద్ అఫ్రిదితో పోల్చాలని వెల్లడించారు. కుర్రతనంలో షాహిద్ అఫ్రిది (Shahid Afridi ) చాలా భయంకరంగా బ్యాటింగ్ చేసేవాడు. అచ్చం వైభవ్ సూర్య వంశీ లాగానే అప్పట్లో షాహిద్ అఫ్రిది కూడా రెచ్చిపోయేవాడని గుర్తు చేశారు. ఇక ఇప్పుడు వైభవ్ సూర్యవంశీ కూడా అలాగే ఆడుతున్నాడని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో షాహిద్ అఫ్రిది తోనే వైభవ్ ను పోల్చాలని సూచనలు చేశారు.
వైభవ్ సూర్య వంశీకి మంచి భవిష్యత్తు ఉందని కూడా వ్యాఖ్యానించారు. వరల్డ్ క్లాసు బౌలర్లను కూడా చీల్చి చెండాడుతున్నాడని గుర్తు చేశారు. 15 ఏళ్ల వయసులో ఇంత భయంకరంగా ఆడడం అతడి అదృష్టమని వ్యాఖ్యానించారు. ఇక అతని వయసు గురించి తాను మాట్లాడను.. బ్యాటింగ్ మాత్రం అదరగొడుతున్నాడు… అలాంటప్పుడు వయసు గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదని, మహమ్మద్ యూసఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అతన్ని వెంటనే టీమిండియా జట్టులోకి తీసుకోవాలని కూడా డిమాండ్ చేశారు. వైభవ్ సూర్యవంశీ అణుబాంబు లాంటోడని, బౌలర్లకు నరకం చూపిస్తున్నాడని ప్రశంసించారు మహ్మద్ యూసఫ్.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ లో వైభవ్ సూర్య వంశీ తన బ్యాట్స్ లో AI చిప్ లు వాడుతున్నాడు అంటూ తన్వీర్ అహ్మద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఐసీసీ వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విచారణ జరిపి, వైభవ్ పై చర్యలు తీసుకోవాలని కోరారు.