Mohammed Siraj – Indian Flag: టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ (New Zealand vs India, 5th ODI) మధ్య జరిగిన ఐదవ వన్డే సందర్భంగా మహమ్మద్ సిరాజ్ (Mohammed Siraj) చేసిన ఓ పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో మహ్మద్ సిరాజ్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. మ్యాచ్ మధ్యలో ఓ అభిమాని భారత జాతీయ జెండాతో మైదానంలోకి దూసుకు వచ్చాడు. ఈ సందర్భంగా వికెట్ల దగ్గరకు వెళ్ళగానే అతడిని సెక్యూరిటీ సిబ్బంది పట్టుకుంది. ఈ క్రమంలో జాతీయ జెండా నేలపై పడిపోయింది.
అయితే ఇంత జరుగుతున్నా అక్కడే ఉన్న టీమిండియా క్రికెటర్లు ఎవరూ కూడా జాతీయ జెండాను తీసే ప్రయత్నం చేయలేదు. కానీ మహమ్మద్ సిరాజ్ ఒక్కడే.. బౌండరీ గేట్ దగ్గర నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి జాతీయ జెండాను తీసుకున్నాడు. ఆ తర్వాత భద్రంగా దాన్ని బయటకు తీసుకువెళ్లాడు. ఈ క్రమంలో మహమ్మద్ సిరాజ్ చేసిన పనిని అందరూ మెచ్చుకుంటున్నారు. జాతీయ జెండాను తీసుకుని సిరాజ్ తన దేశభక్తిని చాటుకున్నాడని ప్రశంసలు కురిపిస్తున్నారు. నిజమైన భారతీయుడు సిరాజే అంటూ సెల్యూట్ కొడుతున్నారు.
టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య ఐదవ వన్డే బే ఓవల్ వేదికగా ఆదివారం జరిగింది. ఈ వన్డే సిరీస్ లో ప్రతి మ్యాచ్ లో భారీగానే పరుగులు రాగా.. చివరి మ్యాచ్ లో మాత్రం తక్కువ స్కోరు నమోదు అయ్యాయి. ఐదవ వన్డే సందర్భంగా 42.1 ఓవర్లు ఆడిన టీమిండియా 209 పరుగులు చేసి కుప్పకూలింది. లక్ష్యం చిన్నది కావడంతో న్యూజిలాండ్ అవలీలగా విజయం సాధిస్తుందని అందరూ అనుకున్నారు. కానీ టీమిండియా బౌలర్ అర్ష్ దీప్ సింగ్ బౌలింగ్ లో ఇరగదీశాడు. 10 ఓవర్లలో 30 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీసి న్యూజిలాండ్ కు చుక్కలు చూపించాడు.
అటు మహమ్మద్ సిరాజ్ కూడా రెండు వికెట్లు పడగొట్టి అదరగొట్టాడు. ఈ క్రమంలో 187 పరుగులు చేసిన న్యూజిలాండ్ ఆలౌట్ అయింది. దీంతో 22 పరుగుల తేడాతో విక్టరీ అందుకున్న టీమిండియా, 3-1 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది. అటు ఇప్పటికే న్యూజిలాండ్ జట్టుపై ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్ ను శ్రేయస్ అయ్యర్ సేన దక్కించుకుంది. వరుసగా మూడింటిలో గెలిచిన టీమిండియా.. చివరి రెండు టి20లలో ఓడిపోయినప్పటికీ సిరీస్ మాత్రం కైవసం చేసుకుంది. ఇక ఈ రెండు జట్ల మధ్య నవంబర్ 19వ తేదీ నుంచి టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. వెల్లింగ్టన్ వేదికగా మొదటి టెస్ట్ జరగనుండగా నవంబర్ 27వ తేదీన హగ్లే ఓవల్ వేదికగా రెండో టెస్ట్ ఉంటుంది.
?utm_source=ig_web_copy_link&xtok=NTc4MTIwNjQ2YQ==