
Netherlands : భారత్ ఉపఖండంలో నిర్వహించే వన్డే వరల్డ్ కప్ బరిలో నిలిచే జట్లపై క్లారిటీ వచ్చేసింది. వన్డే ర్యాంకింగ్స్ ఆధారంగా ఇప్పటికే భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, అప్ఘానిస్తాన్ జట్లు నేరుగా టోర్నిలో పొల్గొంటాయి. మరో రెండు బెర్తుల కోసం ప్రపంచ కప్ క్వాలిఫయర్ టోర్ని నిర్వహిస్తున్నారు. ఈ టోర్నిలో సత్తా చాటి శ్రీలంక ప్రపంచ కప్ కు అర్హత సాధించింది. తాజాగా జరిగిన సూపర్ సిక్స్ మ్యాచ్ లో స్కాట్ లాండ్ ను ఓడించి నెదర్లాండ్స్ కూడా ప్రపంచ కప్ బెర్త్ సాధించింది. ఆ జట్టు 12 ఏళ్ల తర్వాత వన్డే ప్రపంచకప్ ఆడనుంది.
నెదర్లాండ్స్ జట్టు అద్భుత ఆటతీరుతో 5వ సారి మెగా టోర్నీలో పోటీపడే అవకాశం దక్కించుకుంది. గురువారం ప్రపంచ కప్ క్వాలిఫయర్ సూపర్ సిక్స్ మ్యాచ్‌లో నెదర్లాండ్స్ అద్భుతమే చేసింది. సంచలన ప్రదర్శన చేసి 4 వికెట్ల తేడాతో స్కాట్లాండ్‌పై గెలిచింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ బాస్ డె లీడ్ (123, 92 బంతుల్లో 7×4, 5×6, 5/52) ఆల్‌రౌండ్ ప్రదర్శనతో జట్టుకు ప్రపంచ కప్ బెర్త్ ను అందించాడు.
ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 277 పరుగులు చేసింది. బ్రాండన్ మెక్‌ములెన్ (106, 110 బంతుల్లో 11×4, 3×6 ) సెంచరీతో ఆకట్టుకున్నాడు.కెప్టెన్ బెరింగ్టన్ (64) హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. ప్రపంచకప్‌కు అర్హత సాధించాలంటే 44 ఓవర్లలోపే నెదర్లాండ్స్ లక్ష్యాన్ని ఛేదించాలి. కానీ ఒకదశలో 31 ఓవర్లలో 164 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
ఈ దశలో హాఫ్ సెంచరీకీ దగ్గరగా ఉన్న లీడ్ ఒక్కసారి విధ్వంసం సృష్టించాడు. గేర్ మార్చి ఎడాపెడా బౌండరీలు, సిక్సులు బాదాడు. సకీబ్ (33 నాటౌట్)తో కలిసి 6వ వికెట్‌కు 11.3 ఓవర్లలోనే 113 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. దీంతో 42.5 ఓవర్లలోనే నెదర్లాండ్స్ లక్ష్యాన్ని చేధించింది.
నెదర్లాండ్స్ (నెట్ రన్‌రేట్ 0.160), స్కాట్లాండ్ ( నెట్ రన్ రేట్ 0.102), జింబాబ్వే ( నెట్ రన్ రేట్-0.099) ఈ 3 జట్లు సూపర్ సిక్సులో 6 పాయింట్లతో సమానంగా నిలిచాయి. మెరుగైన నెట్ రన్‌రేట్ ఉన్న నెదర్లాండ్స్ ప్రపంచ కప్ కు అర్హత సాధించింది. నెదర్లాండ్స్ 1996, 2003, 2007, 2011 వరల్డ్ కప్ లో ఆడింది.