IND VS NZ: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 చివరి అంకానికి చేరుకుంది. ఫిబ్రవరి 19 నుండి ప్రారంభమైన ఈ ట్రోఫీలో గ్రూప్ ఎ లో ఉన్న భారత్-న్యూజిలాండ్ జట్లు ఫైనల్ కీ చేరుకున్నాయి. ఈ ఫైనల్ మ్యాచ్ ఈ నెల 9 ఆదివారం రోజున దుబాయ్ వేదికగా జరగబోతోంది. ఈ మ్యాచ్ కోసం ఇరుజట్లు సిద్ధమవుతున్నాయి. ఈ ఫైనల్ మ్యాచ్ లో విజయం సాధించి 2000 సంవత్సరంలో కెన్యా వేదికగా జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ లో ఎదురైన ఓటమికి ఘనంగా ప్రతీకారం తీర్చుకోవాలని కోరుకుంటున్నారు భారత క్రీడాభిమానులు.
Also Read: ICC CT 2025 – IPL 2025: ఫైనల్స్ కెప్టెన్లు ఇద్దరు… హార్దిక్ పాండ్యా కింద ఆడాల్సిందే ?
అయితే ఈ ఫైనల్ మ్యాచ్ కి ముందు న్యూజిలాండ్ జట్టుకు భారీ షాక్ తగిలింది. న్యూజిలాండ్ స్టార్ పేస్ బౌలర్ మ్యాట్ హెన్రీ గాయం కారణంగా ఈ ఫైనల్ మ్యాచ్ ఆడే అవకాశం పై సందేహం ఏర్పడింది. సౌత్ ఆఫ్రికాతో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్ లో క్లాసెక్ క్యాచ్ తీసుకోవాలనే ప్రయత్నంలో హెన్రీ భుజంపై పడిపోయాడు. ఈ గాయం కారణంగా అతడు కొంతసేపు మైదానం నుండి బయటకు వెళ్ళాడు.
ఆ తరువాత తన ఓవర్లను పూర్తి చేయడానికి తిరిగి వచ్చాడు. ఈ క్రమంలో అతడు ఫైనల్ మ్యాచ్ ఆడడంపై సందిగ్ధం నెలకొంది. గాయం తీవ్రత ఎక్కువై అతడు ఫైనల్ కీ దూరం అయితే.. ఇది న్యూజిలాండ్ జట్టుకు భారీ ఎదురు దెబ్బగా చెప్పవచ్చు. గ్రూప్ స్టేజ్ లో భారత్ తో జరిగిన మ్యాచ్ లో హెన్రీ 8 ఓవర్లు వేసి 42 పరుగులు మాత్రమే ఇచ్చి ఐదు వికెట్లు పడగొట్టాడు. న్యూజిలాండ్ జట్టులో కీలక ఆటగాళ్లు దూరం కావడంతో ఛాంపియన్స్ ట్రోఫీలో బౌలింగ్ ఎటాక్ ని హెన్రీ ముందుండి నడిపించాడు.
పాకిస్తాన్ తో జరిగిన తొలి మ్యాచ్లో రెండు వికెట్లు, బంగ్లాదేశ్ పై ఒక వికెట్ సాధించాడు. హెన్రీ ఈ టోర్నమెంట్ లో ఇప్పటివరకు అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఈ టోర్నీలో ఇప్పటివరకు మొత్తం 10 వికెట్లు పడగొట్టి అగ్రస్థానంలో ఉన్నాడు. కానీ అతడు ఫైనల్ కీ అందుబాటులో లేకపోతే న్యూజిలాండ్ బౌలింగ్ దళానికి పెద్ద ఎదురు దెబ్బ అవుతుంది. ఇక అతడి గాయం తీవ్రతపై కోచ్ గ్యారీ స్టీడ్ స్పందిస్తూ.. ” మేము అతనిపై స్కాన్లు, ఇతర పరీక్షలు నిర్వహించాము.
Also Read: BCCI – Virat Rohit: గ్రేడ్ A+ గ్రేడ్ కాంట్రాక్టులు కోల్ప నున్న రోహిత్, విరాట్, జడ్డూ?
అతడు ఫైనల్ కీ అందుబాటులో ఉండేందుకు అవకాశం ఇస్తాం. అయితే ఇది ఇప్పటికీ స్పష్టంగా చెప్పలేం. భుజం గాయం కారణంగా అతడు చాలా నొప్పితో ఉన్నాడు. కానీ సమయానికి కోలుకుంటాడని ఆశిస్తున్నాం” అని చెప్పుకొచ్చాడు. మరోవైపు అతడి గాయం పై కెప్టెన్ మిచెల్ శాంట్నర్ స్పందిస్తూ.. ” హెన్రీ భుజం నొప్పితో బాధపడుతున్నాడు. మ్యాచ్ సమయంలోపు అతడు కోలుకుంటాడా..? లేదా అన్నది ఇప్పుడే చెప్పడం కష్టం. భారత్ తో ఫైనల్ ఆడేందుకు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాం” అని అన్నాడు.