BCCI – Virat Rohit: దాదాపు పది సంవత్సరాల విరామం అనంతరం ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని రెండవసారి గెలుచుకోవాలని పట్టుదలతో ఉంది భారత జట్టు. గతంలో 2013 లో ఇంగ్లాండ్ లోని బర్మింగ్ హమ్ లో జరిగిన ఫైనల్ లో మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వంలో భారత జట్టు 5 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ జట్టుపై విజయం సాధించి ఈ ఛాంపియన్స్ ట్రోఫీని దక్కించుకుంది.
Also Read: Rohit Sharma Retirement: ఫైనల్స్ కు ముందే టీమిండియాకు షాక్.. వన్డే కెప్టెన్సీకి రోహిత్ గుడ్ బై..?
మళ్లీ ఇప్పటివరకు భారత్ ఈ ట్రోఫీని గెలుచుకోలేకపోయింది. 2017 లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ లో పాకిస్తాన్ జట్టు భారత్ పై 180 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి ఈ ఛాంపియన్స్ ట్రోఫీని దక్కించుకుంది. మళ్లీ ఈ ట్రోఫీని సాధించాలంటే భారత జట్టు ఈ ఫైనల్ మ్యాచ్లో సత్తా చాటాల్సిందే. అయితే ఈ టోర్నీ అనంతరం భారత కెప్టెన్ రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించబోతున్నాడని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది.
2024లో టి-20 ప్రపంచ కప్ గెలిచిన తర్వాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా వంటి సీనియర్ ఆటగాళ్లు టి-20 క్రికెట్ కి రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆస్ట్రేలియా పర్యటనలో వీరు విఫలం కావడంతో ఇక రిటైర్మెంట్ ప్రకటించాలని డిమాండ్లు వినిపించాయి. అయితే ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో విజయం సాధిస్తే ఈ ముగ్గురు సీనియర్ ఆటగాళ్లు మరికొంత కాలం ఆడే అవకాశం కనిపిస్తోంది. ఆదివారం రోజు దుబాయ్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఫైనల్ మ్యాచ్ లో న్యూజిలాండ్ తో తలపడబోతోంది భారత జట్టు.
అయితే ప్రస్తుతం క్రికెటర్లకు బీసీసీఐ అన్ని ఫార్మాట్ లలోను గ్రేడ్ – ఏ ప్లస్ కాంట్రాక్ట్ ఇస్తుంది. ఇలా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా ఈ గ్రేడ్ లోనే ఉన్నారు. కానీ వీరు టి-20 ఫార్మాట్ కి రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో గ్రేడ్ పడిపోయే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఛాంపియన్స్ ట్రోఫీ ముగిశాక బిసిసిఐ దీనిపై ఓ నిర్ణయానికి రావచ్చని సమాచారం. మరోవైపు గత సంవత్సరం కాంట్రాక్ట్ దక్కించుకోలేకపోయిన శ్రేయస్ అయ్యర్ కి ఈసారి అవకాశం దక్కవచ్చని బోర్డు వర్గాలు తెలిపాయి.
Also Read: Mohammed Shami: షమీ ఎనర్జీ డ్రింక్స్ వివాదం… మళ్లీ గెలికిన షామా మహ్మద్
ఈ ఛాంపియన్ ట్రోఫీ అనంతరం రోహిత్ శర్మ రిటైర్మెంట్ వైపు మొగ్గు చూపిస్తే.. తదుపరి ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది బోర్డు ఆలోచన చేయనుంది. సెంట్రల్ కాంట్రాక్టుల విషయంలోనూ చర్యలు తీసుకునే అవకాశం ఉందని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం మూడు ఫార్మాట్లలో నాణ్యమైన క్రికెట్ ఆడే వారికి ఏ ప్లస్ గ్రేడ్ ని కేటాయిస్తుంది బీసీసీఐ. భారత టాప్ ప్లేయర్లు టి-20 రిటైర్మెంట్ తీసుకున్న నేపథ్యంలో.. ఇప్పుడు వన్డేలకు సైతం రిటైర్మెంట్ ప్రకటిస్తే గ్రేడింగ్ లో మార్పులు చేయడం ఖాయం.