
ODI World Cup Final : ఒకవైపు మెగా టోర్నమెంట్ లో వరల్డ్ కప్ సన్నాహాలు చురుగ్గా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో అహ్మదాబాద్ లోని మోదీ స్టేడియం లో పిచ్ ఎలా ఉంటుందన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. అందరూ రకరకాలుగా చెబుతున్నారు గానీ.. ఏకంగా పిచ్ తయారు చేసిన క్యూరేటర్ల దగ్గర నుంచి విషయం బయటకు రావడం సంచలనమైంది.
బీసీసీఐ పిచ్ క్యూరేటర్లు ఆశిష్ భౌమిక్, తపోష్ ఛటర్జీ సహా స్థానిక మోదీ స్టేడియం క్యూరేటర్ జయేశ్ పటేల్ తో భారత్ కోచ్ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడారు. ఈ నేపథ్యంలో వారి మధ్య జరిగిన సంభాషణ బయటకు తెలిసింది.
ఇక్కడ కూడా టాస్ కీలక పాత్ర పోషిస్తుందని తేలింది. టాస్ గెలిచిన వాళ్లు బ్యాటింగ్ ఎంచుకోవాల్సి ఉంటుందని క్యూరేటర్లు చెబుతున్నారు. ఈ పిచ్‌పై 315 పరుగులు టార్గెట్ ఇస్తే సరిపోతుందని, విజయం సాధించడానికి ఆ పరుగులు సరిపోతాయని చెబుతున్నారు.
మరోవైపు, ఈ వరల్డ్ కప్ లీగ్ దశలో ఇదే స్టేడియంలో భారత్ – పాకిస్థాన్ తలపడ్డాయి. ఆ మ్యాచ్ కు నల్లమట్టితో కూడిన పిచ్ ను రూపొందించారు. ఇప్పుడు కూడా అదే రకమైన పిచ్ ను తయారు చేసినట్టు సమాచారం. చివరిగా ఫైనల్స్ కోసం స్లో ట్రాక్ రెడీ చేసినట్టు సమాచారం.
సెకెండ్ ఇన్నింగ్ ఆడే జట్టుకు మాత్రం ఇబ్బందులు తప్పవని క్యురేటర్ అభిప్రాయపడ్డారు. మ్యాచ్ సాగుతున్న కొద్దీ- పిచ్ మందకొడిగా మారే అవకాశం ఉందని, అది బౌలర్లకు లబ్ది కలిగిస్తుందని చెప్పారు. ఇద్దరు క్యురేటర్లు, బీసీసీఐ జనరల్ మేనేజర్ పర్యవేక్షణలో ఉందీ పిచ్. ఐసీసీ పిచ్ కన్సల్టెంట్ కు వాళ్లు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.
ఇక ఫైనల్స్‌లో ఆస్ట్రేలియాతో అమీతుమీ తేల్చుకోవడానికి జట్టు సన్నద్ధమౌతోంది. నెట్స్‌లో కఠోరంగా శ్రమిస్తోంది. కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజాతో పాటు ఇతర ఆటగాళ్లు బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ నెట్స్‌లో ప్రాక్టీస్ ముమ్మరం చేశారు.