Champions Trophy Pakistan ICC| ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీ ముందు అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈవో) జెఫ్ అలార్డీస్ తన పదవికి రాజీనామా చేశారు. పాకిస్థాన్ ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణకు సన్నద్ధత సముచితంగా లేకపోవడమే ఆయన రాజీనామాకు కారణమని సమాచారం.
“ఒకవైపు టి20 ప్రపంచ కప్ ఆడిట్ జరుగుతున్న తరుణంలో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అలార్డైస్ వీటికి సమాధానం ఇవ్వాల్సి ఉండగా, పాకిస్థాన్‌లో ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఏర్పాట్లకు కూడా ఆయనదే బాధ్యత. అయితే ఇప్పటి వరకు పాక్‌లోని క్రికెట్ స్టేడియంలు టోర్నమెంట్‌కు సిద్ధంగా లేవు. ఈ అంశాలు ఐసిసి బోర్డు దృష్టికి వెళ్లాయి. దీంతో అలార్డైస్ పనితీరుపై అసంతృప్తి వ్యక్తమైంది,” అని ఐసిసి సభ్యులలో ఒకరు మీడియాతో వెల్లడించారు.
ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి 19వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. కానీ టీమిండియా భద్రతా కారణాల దృష్ట్యా పాకిస్తాన్‌లో కాకుండా దుబాయ్ వేదికగా మ్యాచ్‌లు ఆడనుంది.
Also Read: ప్రియురాలి కోసం అక్రమంగా పాకిస్తాన్ వెళ్లిన భారతీయుడు.. మోసం చేసిన యువతి..కానీ..
క్రికెట్ ఆస్ట్రేలియాకు చెందిన 57 ఏళ్ల అలార్డైస్ 2012లో ఐసిసి జనరల్ మేనేజర్‌గా చేరారు. 2021 నవంబరులో ఐసిసి సీఈవోగా నియమితులయ్యారు. తన పదవిలో అంకితభావంతో పనిచేశారని ఐసిసి ఛైర్మన్ జై షా కొనియాడారు. అయితే ఆయన రాజీనామాకు ఛాంపియన్స్ ట్రోఫీ సన్నద్ధత కూడా ఒక కారణమని తెలుస్తోంది. మిగతా కారణాలపై ఇంకా స్పష్టత రాలేదు. తదుపరి సీఈవో ఎంపిక ప్రక్రియను ఐసిసి ప్రారంభించినట్లు సమాచారం. అయితే ఆ పదవికి పోటీలో ఎవరున్నారన్న విషయాన్ని ఐసిసి ఇంకా ప్రకటించలేదు.
ఇదిలా ఉంటే, ఛాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్య దేశమైన పాకిస్థాన్‌లో కరాచీ, రావల్పిండి స్టేడియాల్లో మ్యాచ్‌లు జరగాల్సి ఉన్నాయి. కానీ అక్కడి స్టేడియంలు ఇంకా నిర్మాణ దశలోనే ఉన్నాయని తెలిసింది. వాటికి సంబంధించిన కొన్ని ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పాక్ టోర్నమెంట్ నిర్వహణకు సిద్ధమా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు, పాక్‌ను ఆతిథ్య దేశంగా ఎంపిక చేయడంపై ఐసిసి తీవ్ర విమర్శలను ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో అలార్డైస్ రాజీనామా చేయడం గమనార్హం.
అంతేకాకుండా, ఐసిసి అధికారుల్లో వరుస రాజీనామాలు సంచలనం రేపుతున్నాయి. హెడ్ ఆఫ్ ఈవెంట్స్ క్రిస్ టెట్లే, యాంటీ కరప్షన్ యూనిట్ హెడ్ అలెక్స్ మార్షల్, మార్కెటింగ్ & మీడియా హెడ్ క్లెయిర్ ఫర్లోంగ్‌లు వ్యక్తిగత కారణాలతో తమ పదవులను వీడినట్లు తెలిపారు.
పాకిస్తాన్ లో క్రికెటర్లకు ప్రమాదం పొంది ఉంది
ఈ అంశంపై మాజీ ఇండియన్ క్రికెటర్ ఆకాశ్ చోప్రో మాట్లాడుతూ.. “పాకిస్తాన్ లో ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నెమెంట్‌లో పాల్గొనే ఆటగాళ్లు, ప్రేక్షకులకు భద్రత పెద్ద సమస్యగా కనిపిస్తోంది. అందుకే అక్కడి స్టేడియంలు ఇంకా సిద్ధంగా లేవు. ఈ నేపథ్యంలో క్రికెటర్ల, ప్రేక్షకులకు అక్కడ ప్రమాదం పొంచిఉన్నట్లు నా అభిప్రాయం. జనవరి 31లోగా పాకిస్తాన్ స్టేడియంలలో అన్ని ఏర్పాట్లు పూర్తి కాకపోతే ఐసిసి దీనిపై ఒక నిర్ణం త్వరగా తీసుకోవాలి. వెంటనే మరో వేదికలో ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహించాలి.” అని చెప్పారు.