Indian Man Pakistan Love| ప్రేమ.. మనిషి చేత ఎంత పని అయినా చేయిస్తుంది. అందుకే అంటారు.. నిజమైన ప్రేమికులు ప్రపంచంతోనైనా పోరాడేందుకు సిద్ధపడతారని. ప్రేమకు హద్దులు లేవని. ఈ వాక్యాలను నిజం చేయడానికి భారత దేశానికి చెందిన ఒక యువకుడు పాకిస్తాన్ లో ఉన్న తన ప్రియురాలిని కలిసేందుకు, ఆమెను పెళ్లిచేసుకునేందుకు అక్రమంగా దేశ సరిహద్దులు దాటి వెళ్లాడు. కానీ అంత కష్టపడి అక్కడికి వెళితే.. ఆమె అతని సాహసం చూసి షాకై పోయింది. మరోవైపు ఈ విషయం తెలుసుకున్న యువకుడి తల్లిదండ్రులు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తమ కొడుకుని తిరిగి భారత దేశం తీసుకు వచ్చేందుకు సాయం చేయాలని వేడుకుంటున్నారు.
వివరాల్లోకి వెళితే.. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం అలిగడ్ నగరానికి చెందిన బాదల్ బాబు అనే 21 ఏళ్ల కుర్రాడు కొన్ని నెలల క్రితం ఉద్యోగం కోసం దేశ రాజధాని ఢిల్లీ వెళ్లాడు. అక్కడే తన స్నేహితుడి గదిలో ఉంటూ ఏదో చిన్న ఉద్యోగం చేసుకుంటున్నాడు. అయితే అతనికి ఫేస్ బుక్ లో ఒక యువతి పరిచయమైంది. ఆమె పేరు సనా రాని. వీరిద్దరి పరిచయం కాస్త ప్రేమగా మారింది. గత రెండు సంవత్సరాలుగా వీరి మధ్య చాటింగ్ జరుగుతూ ఉంది.
Also Read: పందెం కాశాడు.. 20 నిమిషాల్లో 2 విస్కీ బాటిళ్లు పచ్చిగానే.. ఎంత సంపాదించాడంటే!?
అయితే గత దీపావళికి ముందు రాఖీ పండుగ సమయంలో తల్లిదండ్రుల ఇంటికి వెళ్లిన బాదల్ బాబు.. దీపావళి పండుగ జరుపుకోకుండానే తనకు ఢిల్లీలో చాలా పని ఉందని చెప్పి ఇంటి నుంచి బయలుదేరాడు. వారం రోజుల తరువాత తన ఫోన్ పనిచేయడం లేదని.. స్నేహితుడి ఫోన్ తో తల్లిదండ్రులకు కాల్ చేసి చెప్పాడు. తనకు ఇకపై ఎవరూ ఫోన్ చేయవద్దని చెప్పి.. తాను కొన్ని రోజుల తరువాత కాల్ చేస్తానని అన్నాడు. కానీ ఆ తరువాత బాదల్ బాబు నుంచి అతని తల్లిదండ్రులకు ఎటువంటి ఫోన్ రాలేదు.
మరోవైపు బాదల్ బాబు అక్రమంగా పాకిస్తాన్ సరిహద్దులు దాటి దొంగచాటుగా పాకిస్తాన్ లోని పంజాబ్ రాష్ట్రం మండి బహాఉద్దీన్ జిల్లాకు వెళ్లాడు. అక్కడ నేరుగా తన ప్రియురాలు సనా రాని ఇంటికి వెళ్లగా.. ఆమె తల్లిదండ్రులు అతడిని చితకబాదారు. ఆ తరువాత అతను ఫేస్ బుక్ లో తన లవ్ స్టోరీ గురించి మొత్తం తెలియజేశాడు. సనా రానితో పెళ్లి కోసమే పాకిస్తాన్‌కు వచ్చానని తెలిపాడు.
ఇదంతా విని సనా రాని తల్లిదండ్రులు.. పోలీసులను పిలిచి అతడిని అరెస్టు చేయించారు. దీంతో పోలీసులు సనా రానిని కూడా అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. కానీ ఆమె తాను కేవలం బాదల్ బాబుతో స్నేహం మాత్రమే చేశానని ప్రేమించలేదని చెప్పింది. ఇది విన్న బాదల్ బాబు షాకయ్యాడు. ప్రస్తుతం బాదల్ బాబు పాకిస్తాన్ జైల్లో ఉన్నాడు. ఈ విషయం పాకిస్తాన్ పోలీసులు అతడి ఇంటికి ఫోన్ చేసి తెలియజేశారు. దీంతో బాదల్ బాబు తల్లిదండ్రులు షాక్‌కు గురయ్యారు.
వెంటనే బాదల్ బాబు తండ్రి కిర్పాల్ సింగ్ స్థానిక పోలీసులకు, అలీగడ్ జిల్లా ఎస్పీ అమ్రిత్ జైన్ కు ఫిర్యాదు చేశారు. వెంటనే తమ కొడుకు విడిపించాలని కోరారు. ఎస్పీ అమ్రిత్ జైన్ ఈ విషయాన్ని విదేశాంగ మంత్రిత్వ శాఖకు తెలియజేస్తానని.. బాదల్ బాబుని తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వ సహకారంతో చర్యలు చేపడతామని తెలిపారు. బాదల్ బాబు తండ్రి కిర్పాల్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తలుచుకుంటే తన కొడుకు తిరిగి రాగలడని.. ఆయనను కలిసి సాయం అడుగుతానని చెప్పారు.