Amir on IPL 2026: ప్రపంచంలోనే అత్యంత సంపన్న లీగ్ లలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ {ఐపీఎల్} ఒకటి. ఈ లీగ్ లో ఆడేందుకు ప్రతి ఒక్క ప్లేయర్ ఆసక్తి చూపిస్తారు. ఈ ఐపీఎల్ లోని తొలి సీజన్ 2008లో పాకిస్తాన్ కి చెందిన ఆటగాళ్లు కూడా పాల్గొన్నారు. 2008లో జరిగిన ఐపీఎల్ ప్రారంభ ఎడిషన్ లో పాకిస్తాన్ క్రికెటర్లు వివిధ ఫ్రాంచైజీలలో భాగమయ్యారు. షాహిద్ ఆఫ్రిది, సోయబ్ మాలిక్, సోహైల్ తన్వీర్ వంటి ఆటగాళ్లు ఈ పోటీలో పాల్గొన్నారు.
కానీ ఆ తర్వాత 2009 ఎడిషన్ నుండి భారత్ – పాకిస్తాన్ మధ్య రాజకీయ ఉద్రిక్తతల కారణంగా పాకిస్తాన్ క్రికెటర్లు ఐపీఎల్ లో ఆడకుండా నిషేధించబడ్డారు. అయితే 2026 లో ప్రారంభం కాబోతున్న ఐపీఎల్ 19వ సీజన్ లో పాకిస్తాన్ కి చెందిన సీనియర్ పేస్ బౌలర్ మహమ్మద్ అమీర్ ఆడేందుకు అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అదేంటి పాకిస్తాన్ ఆటగాళ్లకు చాన్స్ లేదు కదా..? అనే అనుమానాలు మీకు రావచ్చు. అయితే మహమ్మద్ అమీర్ పాకిస్తాన్ ఆటగాడిగా కాకుండా బ్రిటన్ పౌరుడిగా ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది.
ఈ పాకిస్తాన్ మాజీ పేసర్ అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్మెంట్ అయినప్పటినుండి ఇంగ్లాండ్ లో నివసిస్తున్నాడు. 2010లో పాకిస్తాన్ ని కుదిపేసిన స్పాట్ ఫిక్సింగ్ ఘటనలో ముగ్గురు పాకిస్తాన్ ఆటగాళ్లలో అమీర్ కూడా ఒకరు. ఈ స్పాట్ ఫిక్సింగ్ కేసులో అమీర్ జైలు శిక్ష కూడా అనుభవించాడు. ఈ కేసును వాదించిన బ్రిటన్ కి చెందిన నజ్రీన్ ఖాటూన్ ని 2016లో ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఈమె పూర్వీకులు పాకిస్తాన్ నుండి బ్రిటన్ కి వలస వెళ్లారు.
నజ్రీన్ కి బ్రిటన్ పౌరసత్వం కూడా ఉంది. వీరికి ఇద్దరు కూతుళ్లు. అయితే ఈ స్పాట్ ఫిక్సింగ్ కేసు నుండి బయటపడి 2017లో మళ్లీ రీఎంట్రీ ఇచ్చాడు అమీర్. ఆ తర్వాత 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ లో శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లాంటి స్టార్ బ్యాటర్లను అవుట్ చేసి భారత ఓటమిని శాసించాడు. ఆ తర్వాత 2020లో పాకిస్తాన్ క్రికెట్ సెలక్టర్లతో గొడవపడి అంతర్జాతీయ క్రికెట్ కి రిటైర్మెంట్ ప్రకటించాడు అమీర్. ఇక అనంతరం బ్రిటన్ పౌరసత్వాన్ని పొందాడు. దీంతో అతడు ఇంగ్లాండ్ దేశస్థుడు అయిపోయాడు.
ఇప్పుడు అతడు ఐపిఎల్ లో ఆడేందుకు అవకాశం ఉంది. గతంలో పాకిస్తాన్ మాజీ ఆల్రౌండర్ అజార్ అహ్మద్ కూడా 2008లో ఇంగ్లాండ్ పౌరసత్వం పొంది ఐపీఎల్ ఆడాడు. ఇక మొహమ్మద్ అమీర్ పాకిస్తాన్ తరపున తన కెరీర్ లో 36 టెస్టులు, 61 వన్డేలు, 50 టి-20 మ్యాచ్ లు ఆడాడు. ఇందులో 259 వికెట్లు పడగొట్టాడు. 2009లో అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టిన అమీర్.. ఒక ఏడాదికే స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో ఐసిసి నిషేధానికి గురికావలసి వచ్చింది. ఇక నిషేధం పూర్తి చేసుకుని దాదాపు ఆరు సంవత్సరాల తర్వాత మళ్లీ జాతీయ జట్టులోకి వచ్చాడు. ఇతడు చివరిసారిగా 2020లో తన ఆఖరి అంతర్జాతీయ మ్యాచ్ ను ఆడాడు. ఆ సమయంలోనే అంతర్జాతీయ క్రికెట్ కి వీడ్కోలు పలికాడు.
🚨 MOHAMMAD AMIR IN IPL 🚨
– Mohammad Amir confirms he will be available for IPL from 2026. (Harna Mana hai). pic.twitter.com/L8BpXBcTS0
— Tanuj Singh (@ImTanujSingh) March 8, 2025