Pakistan win will give confidence for India tour, says Najmul Shanto: పాకిస్తాన్ పై సిరీస్ విజయంతో ఉప్పొంగిపోతున్న బంగ్లాదేశ్ కెప్టెన్ నజ్ముల్ హుస్సేన్ షాంటో మితిమీరిన ఆత్మవిశ్వాసాన్ని చూపించాడు. ఇప్పుడది నెట్టింట వైరల్ గా మారింది. పాకిస్తాన్ పై రెండు టెస్టుల విజయం అనంతరం మాట్లాడుతూ ఇదే జోరులో భారత్ ను కూడా ఓడిస్తామని అన్నాడు. సుదీర్ఘ ఫార్మాట్‌లో పాక్‌పై బంగ్లాకు ఇదే తొలి సిరీస్ విజయం కావడంతో కెప్టెన్ గా ఆనందంలో మునిగితేలుతున్నాడు.
ఈ విజయాన్ని, అనుభూతిని వర్ణించడానికి మాటలు రావడం లేదని అన్నాడు. జట్టులోని ప్రతీ ఒక్కరు అద్భుతంగా ఆడారని అన్నాడు. సరైన సమయంలో అందరూ ఫామ్ లోకి వచ్చారని, ఎవరి పాత్ర వారు సమర్థవంతంగా పోషించారని తెలిపాడు. ముఖ్యంగా మా పేసర్ల అసాధారణ ప్రతిభతో విజయం తేలికైందని అన్నాడు.
మా జట్టులో అనుభవం కలిగిన ఆటగాళ్లు ఎందరో ఉన్నారు. మెహిదీ హసన్, షకీబ్, ముష్ఫికర్ అందరూ ఇదే జోరు కొనసాగిస్తే భారత్‌ను ఓడించడం పెద్ద కష్టం కాదని తెలిపాడు. సెప్టెంబర్ 19 నుంచి భారత్ వేదికగా బంగ్లాదేశ్ రెండు టెస్ట్‌ల సిరీస్ ఆడనుంది.
ఇకపోతే, ఓటమి అనంతరం పాక్ కెప్టెన్ షాన్ మసూద్ మాట్లాడుతూ అక్కడే మ్యాచ్ మలుపు తిరిగిందని అన్నాడు. అక్కడంటే ఎక్కడంటే… బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్ లో ఒక దశలో 26 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అప్పుడు లిటన్ దాస్(138), మెహ్‌దీ హసన్ మీరాజ్(78) అద్భుత బ్యాటింగ్‌తో ఆదుకున్నారు. ఏడో వికెట్‌కు ఏకంగా 165 పరుగులు జోడించారు. ఈ భాగస్వామ్యమే మ్యాచ్ ఫలితాన్ని మలుపు తిప్పిందని అభిప్రాయపడ్డాడు. అక్కడ పట్టు వదిలేశామని, మళ్లీ ఎక్కడ బ్రేక్ దొరకలేదని తెలిపాడు.
Also Read: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్.. ఫైనల్ డేట్ ఫిక్స్
మా వైఫ్యలాల నుంచి మేం పాఠాలు నేర్చుకోలేకపోయామని అన్నాడు. ఆస్ట్రేలియా పర్యటనలో మెరుగైన క్రికెట్ ఆడాలనేది బోధపడింది. ఇక సొంతగడ్డపై పరాభవాన్ని మరిచిపోవడం అంత ఈజీ కాదని అన్నాడు. నా సారథ్యంలో ఇలా జరగడం ఇది నాలుగోసారని వివరించాడు. ఇకపోతే టెస్ట్ క్రికెట్‌లో ఆటగాళ్లు మరింత ఫిట్‌నెస్‌తో ఉండటం ముఖ్యమని తెలిపాడు.
తొలి టెస్టులో నలుగురు ఫాస్ట్ బౌలర్లతో దిగాం. ఆ పని రెండో టెస్టులో చేయాల్సిందని అన్నాడు. వ్యూహాలు బెడిసి కొట్టాయని తెలిపాడు. తొలిటెస్టులో స్పిన్నర్ లేక ఓడిపోతే, రెండో టెస్టులో సరైన పేసర్ లేకి ఓటమి పాలయ్యామని అన్నాడు. షాహిద్ ఆఫ్రిది మూడు ఫార్మాట్లలో ఆడుతున్నాడు. అందుకే తనకి రెస్ట్ ఇచ్చినట్టు తెలిపాడు. అది కూడా వ్యూహాత్మక తప్పిదమేనని అన్నాడు. ఏదేమైనా ఈ ఓటమి నుంచి గుణపాఠాలు నేర్చుకోవాల్సిన అవసరమైతే ఉందని అన్నాడు.