Champions Trophy 2025: ప్రతిష్టాత్మక ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా భారత్ నేడు తన తొలి మ్యాచ్ ని బంగ్లాదేశ్ తో ఆడుతోంది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే ఈ ఆరంభ మ్యాచ్ లోనే బంగ్లాకి ఎదురు దెబ్బ తగిలింది. బంగ్లాదేశ్ బ్యాటర్లు పెద్దగా రాణించలేకపోయారు. బంగ్లాదేశ్ 49.4 ఓవర్ల వద్ద 228 పరుగులు చేసి ఆల్ అవుట్ అయ్యింది.
ఇదిలా ఉంటే.. క్రీడాభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న భారత్ – పాకిస్తాన్ మ్యాచ్ ఆదివారం రోజు దుబాయ్ వేదికగా జరగబోతున్న విషయం తెలిసిందే. ఈ కీలక మ్యాచ్ కి ముందు పాకిస్తాన్ జట్టుకు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు కీలక ప్లేయర్ ఫకర్ జమాన్ జట్టు నుండి దూరం అయినట్లు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు {పిసిబి} పేర్కొంది. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా తొలి మ్యాచ్ లో న్యూజిలాండ్ – పాకిస్తాన్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పాకిస్తాన్ జట్టుకి మొదటి ఓవర్ లోనే షాక్ తగిలింది.
ఫీల్డింగ్ చేస్తూ పాకిస్తాన్ ఓపెనర్ ఫకర్ జమాన్ గాయపడ్డాడు. దీంతో వెంటనే అతడు మైదానం వీడాడు. అతడి స్థానంలో కమ్రాన్ గులామ్ ని సబిస్టిట్యూడ్ గా ఫీల్డింగ్ కి దించారు. కానీ ఆ తర్వాత మళ్లీ బ్యాటింగ్ కి దిగాడు. రెగ్యులర్ ఓపెనింగ్ స్థానంలో కాకుండా నాలుగవ స్థానంలో బరిలోకి దిగాడు. అయితే బ్యాటింగ్ చేస్తున్న సమయంలో చాలా ఇబ్బంది పడుతూనే ఆడాడు. 41 బంతులు ఆడిన ఫకర్ జమాన్ నాలుగు ఫోర్ల సాయంతో 24 పరుగులు చేశాడు.
అయితే తాజాగా ఫకర్ గాయంపై స్పందించింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. ” ఫకర్ జమాన్ కండరాలు బెనకడంతో ఇబ్బంది పడ్డాడు. అతడిని వైద్య బృందం పరిశీలించింది. ఫకర్ జమాన్ కి ప్రస్తుతం పూర్తి విశ్రాంతి అవసరం. ఈ నేపథ్యంలో అతడు దుబాయ్ కి వెళ్లడం లేదు”. అని తెలిపింది. అయితే ఫకర్ జమాన్ స్థానంలో ఇమామ్ ఉల్ హక్ ని జట్టులోకి తీసుకుంటారని సమాచారం.
ఫిబ్రవరి 23 వ తేదీన భారత్ తో జరగబోయే కీలకమైన మ్యాచ్ కి అతడు దూరం కావడం పాకిస్తాన్ జట్టుకు పెద్ద ఎదురుదెబ్బగానే చెప్పవచ్చు. కాగా భారత్ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 లోని తన మ్యాచ్ లు అన్నింటినీ దుబాయిలో ఆడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదివారం రోజున భారత్ తో మ్యాచ్ కోసం కరాచీ నుండి నేడు పాకిస్తాన్ జట్టు దుబాయ్ కి బయలుదేరి వెళ్ళింది.
ఈ బృందంలో గాయపడ్డ ఫకర్ జమాన్ లేడు. దీంతో రెగ్యులర్ ఓపెనర్ ని పాకిస్తాన్ జట్టు కోల్పోయింది. ఇప్పటికే తొలి మ్యాచ్ లో ఓడిపోయిన పాకిస్తాన్ జట్టుకి ఇప్పుడు ఓపెనర్ దూరం కోలుకోలేని దెబ్బ. ఇక తొలి మ్యాచ్ లో ఓటమితో.. ఈ ఛాంపియన్స్ ట్రోఫిలో పాకిస్తాన్ సెమీస్ చేరాలంటే భారత్ తో సహా బాంగ్లాదేశ్ తో జరిగే అన్ని మ్యాచ్ లలో పాకిస్తాన్ విజయాలు సాదించాల్సి ఉంది.