Preeti Zinta In Temple: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 లో ( IPL 2025) ఫేవరెట్ గా బరిలోకి దిగి.. అనూహ్యంగా పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది సన్రైజర్స్ హైదరాబాద్. ఒకటి కాదు రెండు కాదు వరుసగా నాలుగు మ్యాచ్ లలో పరాజయం పాలయింది. ఈ నేపథ్యంలో నేడు జరగబోయే మ్యాచ్ సన్రైజర్స్ హైదరాబాద్ కి కీలకంగా మారింది. నేడు సన్రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య 27వ మ్యాచ్ ఏప్రిల్ 12వ తేదీ హైదరాబాదులోని ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగుతుంది. ఈ మ్యాచ్ ఈ రోజు రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. ప్యాట్ కమీన్స్ కెప్టెన్సీలో ఆడుతున్న సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఈ సీజన్ కలిసి రావడం లేదు.
వరుస పరాజయాలతో అభిమానులను నిరాశ పరుస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్.. గెలుపు బాట పట్టేందుకు నేడు ఓ అవకాశం. ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే నేడు జరిగే మ్యాచ్ లో కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితులలో ఉంది సన్రైజర్స్. ఇక హైట్రిక్ విజయాలతో పాయింట్ల పట్టికలో మరింత ముందుకు వెళ్లాలని భావిస్తుంది పంజాబ్. ఈ సీజన్ లో సొంత గడ్డపై తొలి మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ పై గెలిచిన సన్రైజర్స్ కి.. ఆ తర్వాత అన్ని పరాభవాలే. వరుసగా లక్నో, ఢిల్లీ, కలకత్తా, గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓడిపోయింది. కేవలం రెండు పాయింట్లతో పట్టికలో చిట్ట చివరి స్థానాన నిలిచింది.
మిగిలిన 9 మ్యాచ్లలో కనీసం 7 గెలిస్తేనే ప్లే ఆఫ్ రేసులో నిలిచే అవకాశం ఉంది. సన్రైజర్స్ బ్యాటర్లంతా సమిష్టిగా సత్తా చాటితేనే నేడు గెలిచే అవకాశం ఉంది. ఇక ఐపీఎల్ లో సన్రైజర్స్ హైదరాబాద్ – పంజాబ్ మధ్య జరిగిన హెడ్ టూ హెడ్ రికార్డుల గురించి మాట్లాడుకుంటే.. హైదరాబాద్ జట్టు పై చేయి సాధించినట్లు కనిపిస్తోంది. ఇప్పటివరకు ఈ రెండు జట్ల మధ్య మొత్తం 23 మ్యాచ్ లు జరిగాయి. వీటిలో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు 16 మ్యాచ్లలో విజయం సాధించగా.. పంజాబ్ కింగ్స్ జట్టు ఏడు మ్యాచ్లలో విజయం సాధించింది. ఈ నేపథ్యంలో నేడు జరగబోయే ఈ కీలక మ్యాచ్ లో తమ జట్టు విజయం సాధించాలని సికింద్రాబాద్ లో ఉన్న తాడ్బండ్ ఆంజనేయ స్వామి ఆలయంలో ( Tadbund Veeranjaneya Swamy ) ప్రత్యేక పూజలు నిర్వహించింది పంజాబ్ కింగ్స్ సహా యజమాని ప్రీతి జింటా( Preeti Zinta ).
Also Read: Prithvi Shaw In CSK: CSKను కాపాడేందుకు బులెట్ లా దూసుకొస్తున్న పృథ్వీ షా
ఈ నేపథ్యంలో ప్రీతి జింటాకి ఆలయ అధికారులు ఘనస్వాగతం పలికి.. ప్రత్యేక పూజలు నిర్వహించి, తీర్థ ప్రసాదాలు అందజేశారు. అయితే ఈ సీజన్ లో ఐపీఎల్ జట్ల యాజమానులు తమ ఆటగాళ్లను మందలించడం, లేదా ఆటగాళ్లతో విభేదాలు కలిగి ఉండడం చూస్తూనే ఉన్నాం. కానీ ప్రీతి జింటా మాత్రం అందరికంటే భిన్నంగా పంజాబ్ ఆటగాళ్లను ప్రశంసిస్తూ కనిపిస్తోంది. అంతేకాకుండా తమ జట్టు విజయం సాధించాలని ఇలా ఆలయాలలో పూజలు చేస్తూ వార్తల్లో నిలిచింది.