Big Stories

 Rahul Dravid : కోచ్‌గా మళ్లీ ద్రవిడే .. హెడ్ కోచ్ గా మళ్లీ బాధ్యతలు..

Share this post with your friends

Rahul Dravid

Rahul Dravid : వన్డే వరల్డ్ కప్ 2023 లో టీమ్ ఇండియాను ఒక స్థాయికి తీసుకువెళ్లిన హెడ్ కోచ్ గా రాహుల్ ద్రవిడ్ కి గొప్ప పేరు వచ్చింది. ఫైనల్ లో ఓడిపోయినా సరే, బీసీసీఐ మాత్రం రాహుల్ ద్రవిడ్ చేసిన సేవలను, ఆ స్ఫూర్తిని మరిచిపోలేదు.

అయితే క్రికెటర్లలాగే ద్రవిడ్ కూడా తీవ్ర మనస్థాపం చెందాడు. కొన్నిరోజులు అజ్నాతంలో ఉన్నాడు. ఈ సమయంలో బీసీసీఐ నుంచి ఒత్తిడి రావడం మొదలైంది. ఎందుకొచ్చిన గొడవ…ఎంత ఆడినా ఫలితం లేకపోయేసరికి మొదట్లో అంత ఆసక్తి చూపించలేదు. అయితే బీసీసీఐ మాత్రం పట్టువదలకుండా ప్రయత్నించింది. రాహుల్ ఉండాలని బలంగా విశ్వసించింది.

ఎట్టకేలకు ద్రవిడ్ కోచ్ గా అంగీకరించాడు. దీంతో టీమ్ ఇండియా హెడ్ కోచ్ గా మరోసారి రాహుల్ ద్రవిడ్ ని నియమిస్తూ బీసీసీఐ ప్రకటన చేసింది. రవిశాస్త్రి అనంతరం జట్టు కోచ్ గా బాధ్యతలు స్వీకరించిన ద్రవిడ్ ఎన్నో వినూత్నమైన ఆలోచనలు, ఆధునిక విధానాలతో జట్టుని ముందుకు నడిపించాడు. ఆటగాళ్లలో ఒక టీమ్ స్పిరిట్ ను తీసుకువచ్చాడు. కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచాడు.. వీటన్నింటిలో తన మార్క్ చూపించాడు.

ఒకదశలో రోహిత్ శర్మ, విరాట్ కొహ్లీ మధ్య విభేదాలున్నా వాటిని ద్రవిడ్ పరిష్కరించాడు. ఇద్దరిని కలిపి, ఒక తాటిపై నడిపించాడు. శ్రేయాస్ అయ్యర్ పదేపదే షార్ట్ పిచ్ బాల్స్ కి అవుట్ అవుతుంటే ప్రత్యేకంగా రెండురోజులు తనే దగ్డరుండి ట్రైనింగ్ ఇచ్చాడు. ఆ తర్వాత అయ్యర్ ఎలా ఆడాడు..అయ్యారే ! అనిపించాడు.

అసలు మహ్మద్ షమీ ప్రపంచకప్ కు ముందు వన్డేల్లో ఎక్కువ ఆడలేదు. కానీ ప్రాబబుల్స్ జాబితాలో ఎంపిక చేసింది రాహుల్ ద్రవిడ్ అనే సంగతి చాలామందికి తెలీదు. అలాగే ఫైనల్ గా 15మంది జాబితాలో ఉండేలా చేసింది కూడా ద్రవిడే…ఆ ఎంపిక వరల్డ్ కప్ లో ఇండియా గమనాన్నే మార్చి పడేసింది.

అగ్గికి సుడిగాలిలా షమీ తోడయ్యాడు. ప్రతి ఆటకి ముందురోజు గేమ్ ప్లాన్ చర్చించడం, టీమ్ అందరితో కూర్చుని మాట్లాడటం, వారి ఒపీనియన్స్ తీసుకోవడం, ప్లాన్ ఆఫ్ యాక్షన్ పై ఒక అంచనాకి రావడం, చాలా పెద్ద ఎక్సర్ సైజ్ చేశాడు. టీమ్ ఇండియాను వరల్డ్ కప్ ఫైనల్ కి చేర్చడంలో రాహుల్ ద్రవిడ్ ది కీలకపాత్ర అని చెప్పాలి. ఇది గమనించే బీసీసీఐ రిక్వెస్ట్ చేసి మరీ ద్రవిడ్ ని మళ్లీ ఒప్పించింది.

ద్రవిడ్ హెడ్ కోచ్ గా ఒప్పుకోవడంతో తన పాత సహాయక టీమ్ ఏదైతే ఉందో అదే మళ్లీ కొనసాగనుంది. బ్యాటింగ్ కోచ్ గా విక్రమ్ రాథోడ్, బౌలింగ్ కోచ్ గా పరాస్ మాంబ్రే, ఫీల్డిండ్ కోచ్ గా టి.దిలీప్ యథావిధిగా తమ స్థానాల్లో కొనసాగనున్నారు.

ఈ నేపథ్యంలో సౌతాఫ్రికా టూర్ కి మరోసారి రాహుల్ ద్రవిడ్ సిద్ధమవుతున్నాడు. డిసెంబర్ 10 నుంచి జనవరి 7 వరకు ఈ పర్యటన కొనసాగనుంది. మళ్లీ భారతజట్టును వెనుక నుంచి నడిపించేందుకు తన శాయశక్తులా ప్రయత్నిస్తాడనంలో ఎటువంటి సందేహం లేదు.


Share this post with your friends

ఇవి కూడా చదవండి

Latest News