Ravi Bishnoi : ఆసిస్ తో జరిగిన టీ 20 ఐదు మ్యాచ్ ల సిరీస్…ఆ యువ స్పిన్నర్ జీవన గమ్యాన్నే మార్చేసింది. పవర్ ప్లేలో అద్భుతంగా బౌలింగ్ చేసి ఆసిస్ వెన్ను విరిచిన రవి బిష్ణోయ్ ఏకంగా ఐసీసీ టీ 20 ర్యాంకింగ్స్ లో నెంబర్ వన్ స్థానానికి చేరుకున్నాడు.
5 మ్యాచ్ ల సిరీస్ లో మొత్తం 9 వికెట్లు తీసిన రవి బిష్ణోయ్ ఆఫ్గాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ ని రెండో స్థానానికి నెట్టి అగ్రస్థానానికి దూసుకెళ్లాడు. శ్రీలంక బౌలర్ వానిందు హసరంగ మూడో స్థానంలో, ఇంగ్లండ్ నుంచి ఆదిల్ రషీద్ నాలుగో స్థానంలో, శ్రీలంక నుంచి మహేష్ తీక్షణ ఐదో స్థానంలో ఉన్నారు.
టీ 20 బ్యాటింగ్ విభాగంలో చూస్తే సూర్య కుమార్ యాదవ్ ఎప్పటిలా అగ్రస్థానంలో కొనాసాగుతున్నాడు. మహ్మద్ రిజ్వాన్ (పాకిస్తాన్), ఐడెన్ మార్ క్రమ్ (సౌతాఫ్రికా) రెండు, మూడు స్థానాల్లో కొనసాగుతున్నారు. ఇక రుతురాజ్ గైక్వాడ్ ఏడో స్థానంలో ఉన్నాడు.
ఆల్ రౌండర్ల విభాగంలో హార్దిక్ పాండ్యా మూడో స్థానంలో ఉన్నాడు. తనకే గానీ గాయం కాకపోతే, తనే నెంబర్ వన్ గా ఉండేవాడని అందరూ అనుకుంటున్నారు. షకీబ్ ఆల్ హాసన్ (బంగ్లాదేశ్), మహ్మద్ నబీ (ఆఫ్గనిస్తాన్) మొదటి, రెండు స్థానాల్లో కొనసాగుతున్నారు. జట్లు పరంగా ర్యాంకింగుల్లో చూస్తే మూడు ఫార్మాట్లలో టీమ్ ఇండియా నెంబర్ వన్ గా ఉండటం విశేషం.
ఇంత గొప్పగా టీమ్ ఇండియా ఆటగాళ్లు ఒక సమయంలో దొరకడం నిజంగా అదృష్టమనే చెప్పాలి. ఇదే కరెక్ట్ టైమ్ వరల్డ్ కప్ ఫైనల్ కొట్టడానికి, కానీ అనూహ్యంగా మనవాళ్లు ఓటమి పాలయ్యారు. కానీ ఆటగాళ్లుగా వ్యక్తిగత రికార్డుల్లో మాత్రం దుమ్ము రేపారు.
మ్యాచ్ లు గెలుస్తున్నారు కానీ, సరిగ్గా నాకౌట్ మ్యాచ్ ల్లో ఓటమి పాలవుతున్నారు. అందుకే ఇక నుంచి ఒత్తిడిని ఎలా జయించాలనే దానిపై దృష్టి పెట్టి, నాకౌట్ మ్యాచ్ ల్లో విజయం సాధించడం ఎలా? అనే దానిపై సీరియస్ గా ఫోకస్ పెట్టాలని సీనియర్లు సూచిస్తున్నారు.