Ravi Shastri: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియా చేతిలో 3-1 తేడాతో భారత జట్టు ఓటమిపాలయ్యాక బీసిసిఐ 10 పాయింట్లతో కూడిన కొత్త నిబంధనలను ప్రవేశపెట్టింది. అందులో ఒకటి క్రికెటర్ల భార్యలు, ప్రియురాళ్ల గురించి. భారత జట్టు విదేశీ పర్యటనల సమయంలో క్రికెటర్ల వెంట కుటుంబ సభ్యుల బసపై బీసీసీఐ పరిమితులు విధించింది. విదేశీ పర్యటనలు లేదా 45 రోజుల కంటే ఎక్కువ టోర్నమెంట్లు జరిగిన సమయంలో.. ఆటగాళ్ల భార్యలు గరిష్టంగా 14 రోజులు మాత్రమే వారితో ఉండాలని నిబంధన విధించింది.
దానికంటే తక్కువ వ్యవధి గల విదేశీ పర్యటనలలో ఆటగాళ్లు తమ కుటుంబ సభ్యులతో ఏడు రోజులు మాత్రమే ఉండగలరు. ఇక తాజాగా ముగిసిన ఛాంపియన్స్ ట్రోఫీ కేవలం 15 రోజుల మాత్రమే కావడంతో బీసీసీఐ అనుమతి నిరాకరించింది. అయితే దాదాపు పది సంవత్సరాల క్రితం ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన విరాట్ కోహ్లీ.. తన గర్ల్ ఫ్రెండ్ అనుష్క శర్మకు తీసుకువచ్చేందుకు ఏం చేశాడో తెలుసా..? గతంలో విదేశీ పర్యటనలకు వెళ్లిన ఆటగాళ్లతో పాటు వారి భార్యలను మాత్రమే బీసీసీఐ అనుమతి ఇచ్చేది.
కానీ ఇప్పుడు బీసీసీఐ దానిని కూడా తొలగించింది. 2014 – 15లో ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా విరాట్ కోహ్లీ.. అనుష్క శర్మను ఆస్ట్రేలియాకి ఆహ్వానించాడు. ఆ సమయంలో వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారు. అయితే అప్పుడు విరాట్ కోహ్లీకి, రవి శాస్త్రికి మధ్య మంచి స్నేహం ఉండేది. దీంతో విరాట్ కోహ్లీ.. రవి శాస్త్రి దగ్గరకు వెళ్లి అనుష్క శర్మని తీసుకురావచ్చా అంటూ అడిగారట. ఆమెని ఇక్కడికి తీసుకురావడానికి బోర్డ్ అనుమతి ఇవ్వడం లేదని రవి శాస్త్రికి తెలపడంతో.. ఆయన బోర్డు పెద్దలతో మాట్లాడి అనుష్క శర్మని ఆస్ట్రేలియా కి రప్పించారు.
ఈ విషయాన్ని ఇటీవల రవి శాస్త్రి ఫ్యాక్స్ క్రికెట్ తో మాట్లాడుతూ వెల్లడించారు. ఇక అప్పుడు ఆస్ట్రేలియా పర్యటన అనంతరం కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అకస్మాత్తుగా టెస్ట్ క్రికెట్ కి రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ టీమ్ ఇండియాకు నాయకత్వం వహించాడు. ఆ తరువాత విదేశీ పర్యటనలకు క్రికెటర్ల వెంట సతీమణి, ప్రియసఖిలను అనుమతించాలని కోహ్లీ గట్టిగా పట్టుబట్టాడు. దీంతో 2018లో విరాట్ కోహ్లీ కోరికను భారత క్రికెట్ నియంత్రణ మండలి {బిసిసిఐ} మన్నించింది. విదేశీ పర్యటనలకు వెళ్ళినప్పుడు క్రికెటర్ల వెంట భార్య, ప్రియురాలు తీసుకువెళ్లేందుకు బోర్డు పరిపాలకులు అనుమతించారు.
ఇక తాజాగా ముగిసిన ఛాంపియన్స్ ట్రోఫీ సమయంలో ఆటగాళ్లు తమ కుటుంబ సభ్యులను వెంట తీసుకువెళ్లడానికి బీసీసీఐ అనుమతి ఇచ్చినట్లు ఓ వార్త బయటకి వచ్చింది. అయితే ఇందులో కూడా కొన్ని షరతులను విధించిందట. ఆటగాళ్లు తమ కుటుంబ సభ్యులను కేవలం ఒక మ్యాచ్ కి మాత్రమే తమతో తీసుకు వెళ్లేందుకు అనుమతి ఇచ్చినట్లు పలు కథనాలు పేర్కొన్నాయి. అయితే వారి కుటుంబ సభ్యులు ఏ మ్యాచ్ కి హాజరు అవుతారన్న విషయాన్ని ముందే బిసిసిఐ కి వారి అభ్యర్థనను సమర్పించాల్సి ఉంటుంది. అనంతరం బీసీసీఐ ఆమోదం పొందిన తర్వాత బోర్డు దానికి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తోంది. అలాగే సిరీస్ సమయంలో వ్యక్తిగత సిబ్బంది మరియు ఏదైనా వాణిజ్య ప్రకటనల షూట్ కోసం ముందే సెలక్షన్ కమిటీ చైర్మన్, హెడ్ కోచ్ నుండి ఆమోదం పొందాల్సి ఉంటుంది.