US India Tariffs| భారత్‌తో సహా అనేక దేశాలపై భారీ స్థాయిలో ప్రతీకార సుంకాలు విధిస్తామని ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన ప్రపంచవ్యాప్తంగా గందరగోళానికి దారితీసింది. దీనిపై తాజాగా వైట్‌హౌస్ (White House) మీడియా కార్యదర్శి కరోలిన్ లివిట్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా నుంచి చాలా దేశాలు టారిఫ్‌లు (Tariffs) అత్యధిక స్థాయిలో వసూలు చేస్తున్నాయని ఆమె మండిపడ్డారు. తమ దేశం నుంచి ఎగుమతి అయ్యే మద్యం, ఇతర ఉత్పత్తులపై భారత్ (India) 150 శాతం సుంకాలు విధిస్తోందని ఆమె తెలిపారు.
మంగళవారం (అమెరికా కాలమానం ప్రకారం) వైట్‌హౌస్ వద్ద జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ప్రెసిడెంట్ ట్రంప్ నిర్ణయాలను సమర్థించారు. ‘‘ట్రంప్ పరస్పర ప్రతిచర్యను విశ్వసిస్తారు. దేశాల మధ్య పారదర్శకత, సమతుల్య వాణిజ్య విధానాలు ఉండాలని కోరుకుంటారు. కెనడా కొన్ని దశాబ్దాలుగా అత్యధిక సుంకాలు విధించి అమెరికాను దోచుకుంది. మన చీజ్, బటర్‌పై పొరుగుదేశం 300 శాతం టారిఫ్ వసూలు చేసింది. అమెరికా ఉత్పత్తులపై అత్యధిక సుంకాలు విధించే దేశాల జాబితాలో భారత్, జపాన్ వంటి దేశాలు కూడా ఉన్నాయి. మన మద్యంపై భారత్ 150 శాతం సుంకం విధిస్తోంది. అలా చేస్తే కెంటుకీ బోర్బన్ (అమెరికా ఆల్కహాల్ బ్రాండ్)ను ఆ దేశంలో విక్రయించడానికి సాధ్యమవుతుందా? మరి ఎగుమతి చేయడంలో ఏం లాభముంది? వ్యవసాయ ఉత్పత్తులపైనా భారత్ 100 శాతం వసూలు చేస్తోంది. ఇక, జపాన్ మన బియ్యంపై 700 శాతం టారిఫ్ విధిస్తోంది. అందుకే ట్రంప్ పరస్పర సుంకాలను విధించాలని భావిస్తున్నారు.’’ అని కరోలిన్ పేర్కొన్నారు.
Also Read: పాకిస్తాన్ ట్రైన్ హైజాక్.. 27 మిలిటెంట్లు, 30 సైనికులు మృతి.!
భారత్ అధిక దిగుమతి సుంకాలను విధిస్తోందని, అందుకే ఏప్రిల్ 2 నుంచి ఆ దేశంపై భారీగా ప్రతీకార సుంకాలను అమలు చేయబోతున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల కాంగ్రెస్ ప్రసంగంలో స్పష్టంగా తెలిపారు. భారత్‌తో పాటు చైనా, ఇతర దేశాలపైనా సుంకాలు అమల్లోకి తెస్తామని ఆయన వెల్లడించారు. ఇక ఇప్పటికే కెనడా, మెక్సికోపై మార్చి 4 నుంచి సుంకాలను అమల్లోకి తీసుకురాగా కొన్ని ఉత్పత్తులకు మాత్రం ఏప్రిల్ 2 వరకు మినహాయింపు ఇచ్చారు. మరోవైపు కెనడా నుంచి అమెరికా దిగుమతి చేసుకునే ఉక్కు, అల్యూమినియంపై ప్రస్తుతం విధించిన 25 శాతం టారిఫ్‌లను తాజాగా 50 శాతానికి పెంచడం గమనార్హం. అమెరికా సుంకాలకు వ్యతిరేకంగా విద్యుత్‌పై సుంకాలను విధిస్తామని కెనడా ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ట్రంప్ ప్రకటనలతో అంతర్జాతీయ మార్కెట్లు కుదేలవుతున్నాయి. అయితే అమెరికా ఉత్పత్తులపై సుంకాలు తగ్గించేందుకు భారత్ ఒప్పుకుందని డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)ఇటీవల ప్రకటించారు.
సుంకాల తగ్గింపుపై ఎలాంటి హామీ ఇవ్వలేదు.. ట్రంప్ ప్రకటనపై స్పష్టం చేసిన భారత్
అమెరికా ఉత్పత్తులపై సుంకాలు తగ్గించేందుకు భారత్ ఒప్పుకుందని యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఇటీవల ఒక సమావేశంలో ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై తాజాగా భారత్ స్పందించింది. టారిఫ్స్ తగ్గించేందుకు అమెరికాకు ఎటువంటి హామీ ఇవ్వలేదని తెలిపింది. దిగుమతి సుంకాలను తగ్గించడానికి కట్టుబడి లేమని పేర్కొంది. ఈ అంశంపై ఎటువంటి హామీలు అమెరికాకు ఇవ్వలేదని పార్లమెంటరీ ప్యానెల్‌కు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ‘‘భారత్, అమెరికా పరస్పరం ప్రయోజనకరమైన ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై పనిచేస్తున్నాయి. తక్షణ సుంకాల సర్దుబాట్ల కంటే దీర్ఘకాలిక సహకారానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాయి. కానీ సుంకాల తగ్గింపుపై ఎలాంటి హామీ ఇవ్వలేదు. ట్రంప్ పదే పదే లేవనెత్తుతున్న ఈ సమస్యను పరిష్కరించడానికి సెప్టెంబర్ వరకు సమయం అడిగాం. ఈ విషయంపై ఇరు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నాయి’’ అని విదేశీ వ్యవహారాలపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఎదుట హాజరైన వాణిజ్య కార్యదర్శి సునీల్ బార్త్వాల్ (Sunil Barthwal) తెలిపారు.