Rohit Sharma – Ravi Shastri: ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ దారుణంగా విఫలమవుతున్న విషయం తెలిసిందే. వ్యక్తిగతంగా పెర్త్ వేదికగా జరిగిన మొదటి టెస్ట్ కి రోహిత్ శర్మ దూరమయ్యాడు. ఇక ఆ తర్వాత జరిగిన ఆడిలైడ్, బ్రిస్ బెన్ రెండు టెస్టుల్లో దారుణ ప్రదర్శన చేశాడు. అయితే జట్టులో ఓపెనర్ గా కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్ కుదురుకోవడంతో కెప్టెన్ రోహిత్ శర్మ ఆరవ స్థానంలో బ్యాటింగ్ కి దిగుతున్నాడు.
Also Read: sameer rizvi fastest double century: ఢిల్లీ క్యాపిటల్స్ యంగ్ బ్యాటర్ సంచలన డబుల్ సెంచరీ
కానీ ఆ స్థానంలో పరిస్థితులకు తగ్గట్లు ఆడలేక విఫలం చెందుతున్నాడు. ఈ నేపథ్యంలో హిట్ మ్యాన్ మళ్లీ ఓపెనర్ గా బరిలోకి దిగాలని పలువురు మాజీలు సూచిస్తున్నారు. కానీ తాజాగా భారత మాజీ క్రికెటర్, మాజీ కోచ్ రవి శాస్త్రి మాత్రం రోహిత్ శర్మ ఆరో స్థానంలోనే బ్యాటింగ్ చేయాలని అంటున్నాడు. ” రోహిత్ శర్మ ఓపెనర్ గా రావాలనుకుంటే దానికి ఏమి ఇబ్బంది లేదు. గత మ్యాచ్ లోనే ఇన్నింగ్స్ ని ప్రారంభించాలని నేను అడిగాను. కానీ ఓపెనర్ గా కేఎల్ రాహుల్ ఆడిన తీరులో నా అభిప్రాయం కాస్త మారింది.
రాహుల్ ఓపెనర్ గా మంచి ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శిస్తున్నాడు. అతడి కవర్ డ్రైవ్ లు చూస్తుంటే అతడు ఆ స్థానాన్ని ఆస్వాదిస్తున్నట్లు అనిపిస్తుంది. ఎలాంటి బాల్ ఆడాలి, ఏ బాల్ ని వదిలేయాలి అనే విషయంలో రాహుల్ చాలా క్లారిటీతో ఉన్నాడు. ఈ నేపథ్యంలో రోహిత్ కి ఆరవ స్థానమే కరెక్ట్. ఆరో స్థానంలో రోహిత్ శర్మ డేంజరస్ ఆటగాడు. టెస్ట్ క్రికెట్ లో ఎంతోమంది దూకుడుగా ఆడే ఆటగాళ్లు ఆరవ స్థానంలోనే బ్యాటింగ్ కి దిగుతారు. టెస్ట్ మ్యాచ్ లో మిడిల్ ఆర్డర్ లో బ్యాటింగ్ కి దిగేటప్పుడు రోహిత్ శర్మ తన మైండ్ సెట్ ని మార్చుకోవాలి.
ఇప్పటికే ఐదారు వికెట్లు పడిన కారణంగా నెమ్మదిగా ఆడాలని చాలామంది ఆటగాళ్లు అనుకుంటారు. కానీ సాధ్యమైనన్ని పరుగులు చేయడమే లక్ష్యంగా ఆరో స్థానంలో వచ్చిన బ్యాటర్ ఎటాకింగ్ చేయాలి. రోహిత్ శర్మ కూడా ఇదే పద్ధతిని పాటిస్తే మ్యాచ్ పరిస్థితి మారే అవకాశం ఉంటుంది. గతంలో కూడా రోహిత్ శర్మకి ఆరవ స్థానంలో ఆడిన అనుభవం ఉంది” అని రవి శాస్త్రి అభిప్రాయపడ్డాడు.
Also Read: Robin Uthappa Arrest : క్రికెటర్ రాబిన్ ఉతప్పకు అరెస్ట్ వారెంట్ జారీ.. ఫ్రాడ్ కేసు
పరిమిత ఓవర్ల క్రికెట్ లో మాదిరిగా రోహిత్ శర్మ ఎటాకింగ్ చేయాలని సూచించాడు రవి శాస్త్రి. అలాగే బోర్డర్ గవాస్కర్ సిరీస్ లో భారత్ ఆశలు సజీవంగా ఉండడానికి జస్ప్రీత్ బూమ్రా అనే ఒక ఆటగాడు కారణమని పేర్కొన్నారు రవి శాస్త్రి. బూమ్రా ఒంటి చేత్తో సిరీస్ ని చేజారకుండా ఆపారని.. మిగిలిన స్టార్లు కూడా మేల్కుంటే ఆస్ట్రేలియా పని అయిపోయినట్లేనని అన్నారు. బాక్సింగ్ డే టెస్టులో మన వాళ్ళు చెలరేగుతారని అనుకుంటున్నాను అని చెప్పుకొచ్చాడు రవి శాస్త్రి. ఇక ఇప్పటివరకు జరిగిన మూడు టెస్ట్ మ్యాచ్ లలో బూమ్రా 21 వికెట్లు తీయడం విశేషం.