Team India – RCB: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ విజేతగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు నిలిచిన సంగతి తెలిసిందే. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మధ్య ఫైనల్స్ జరిగింది. ఇందులో అద్భుతంగా రాణించిన బెంగుళూరు… ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించి ఛాంపియన్ గా నిలిచింది బెంగుళూరు. రజత్ పాటిదార్ నాయకత్వంలోని బెంగుళూరు.. గత 18 సంవత్సరాలుగా సాధించలేని రికార్డులు నెలకొల్పింది.. రజత్ పాటిదార్ కెప్టెన్సీలోనే, బెంగళూరుకు వరుసగా రెండు ట్రోఫీలు రావడం గమనార్హం. దీంతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ రజత్ పాటిదార్ పైన ప్రశంసల వర్షం కురుస్తోంది. టీమిండియా టి20 జట్టులోకి అతన్ని తీసుకువచ్చి.. కెప్టెన్సీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టును రెండుసార్లు ఛాంపియన్ గా నిలిపిన రజత్ పాటిదార్ ను టీమిండియాలోకి తీసుకురాబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అతి త్వరలో ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య టి20 జరగనుంది. ఈ సిరీస్ నేపథ్యంలో రజత్ పాటిదార్ ను తుది జట్టులోకి తీసుకువచ్చి, కెప్టెన్ ను కూడా చేయబోతున్నారని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతమున్న సూర్య కుమార్ యాదవ్ స్థానంలో, రజత్ పాటిదార్ కు బాధ్యతలు ఇవ్వబోతున్నట్లు చెబుతున్నారు. బ్యాటింగ్ తో పాటు కెప్టెన్సీలో కూడా అతగాడు అద్భుతంగా రాణిస్తున్నాడు. దాని ఫలితంగానే 18 సంవత్సరాలుగా టైటిల్ గెలవని బెంగుళూరు, వరుసగా రెండు టైటిల్స్ అందుకుంది. అంటే దాదాపు రోహిత్ శర్మతో పాటు మహేంద్ర సింగ్ ధోని లాంటి వాళ్ళ సరసన రజత్ పాటిదార్ చేరిపోయాడు. ఈ క్రమంలోనే అతన్ని టి20 జట్టుకు కెప్టెన్ చేయాలని కూడా డిమాండ్లు వినిపిస్తున్నాయి.
నిజంగానే టీమ్ ఇండియా టి20 జట్టులోకి రజత్ పాటిదార్ వస్తే మాత్రం మొదటగా కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ పై వేటుపడే ఛాన్సులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం టీమిండియా టి20 జట్టులో అందరూ బాగానే ఆడుతున్నారు. కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ తప్ప.. మిగతా వాళ్ళందరూ తోపులే. కాబట్టి సూర్యను పక్కకు పెట్టి రజత్ ను తీసుకునేందుకు ఇప్పటికే బీసీసీఏ నిర్ణయం తీసుకున్నట్లు కూడా సమాచారం అందుతోంది. దీంతో సూర్య రిటైర్మెంట్ తీసుకోవాల్సిందేనని కూడా కొంతమంది ట్రోలింగ్ చేస్తున్నారు. అదే సమయంలో శ్రేయస్ అయ్యర్ వన్డే వైస్ కెప్టెన్ గా కొనసాగుతున్నాడు. టి20 కెప్టెన్ గా అయ్యర్ ను చేస్తారని మొన్నటి వరకు ప్రచారం సాగింది. కానీ ఎప్పుడైతే పంజాబ్ ఎలిమినేట్ అయిందో… మళ్లీ అయ్యర్ పైన నెగిటివ్ స్ప్రెడ్ అవుతోంది. దానికి తగ్గట్టుగానే రజత్, బెంగళూరును రెండుసార్లు ఛాంపియన్ చేశాడు. అంటే అయ్యర్ కంటే రజత్ టి20 లకు బెస్ట్ అని కూడా బీసీసీఐ భావించే ఛాన్స్ ఉంది. ఈ క్రమంలో టి20 జట్టులోకి అయ్యర్ ను తీసుకున్నప్పటికీ.. రజత్ కు మాత్రమే కెప్టెన్సీ వస్తుందని చెబుతున్నారు.