Rishabh Pant: టీమిండియా క్రికెటర్, స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఎక్స్ {ట్విట్టర్} వేదికగా సంచలన ప్రకటన చేశాడు. మరోసారి తన మంచి మనసును చాటుతూ ఇకపై తన ఆదాయంలో 10% పేదలకు ఇస్తానని ప్రకటించారు. యాడ్స్ ద్వారా తనకు వచ్చే ఆదాయంలో 10% పేదలకు ఆర్థిక సాయం చేస్తానని వెల్లడించాడు రిషబ్ పంత్. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదిక ద్వారా పంచుకున్నాడు. దీంతో రిషబ్ పంత్ తీసుకున్న ఈ నిర్ణయం పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
Also Read: Ind vs Eng 1st ODI: నేటి నుంచే వన్డే సిరీస్..టైమింగ్స్ ఇవే..ఉచితంగా ఇలా చూడండి ?
ఈ మేరకు ఓ వీడియో రిలీజ్ చేసిన రిషబ్ పంత్.. ” క్రికెట్ వల్లే నేను ఈ స్థాయికి చేరుకున్నాను. కఠిన సమయాలలో ధైర్యంగా ఎలా ఉండాలో నాకు ఎదురైన అనుభవాల ద్వారా నేర్చుకున్నాను. క్రికెట్ నాకు అందించిన దానికి కృతజ్ఞతగా.. సమాజానికి తిరిగి అందించాలనే ఆలోచన నా మనసులో ఉంది. ఒక్కోసారి మన జీవితంలో అనుకోకుండా చోటు చేసుకునే ఘటనలు జీవిత పాఠాలు నేర్పిస్తాయి. కొన్ని సంవత్సరాల క్రితం నేను అలాంటి కఠిన పరిస్థితులను ఎదుర్కొన్నాను. అందుకే ఇంకా ఎక్కువ కృతజ్ఞతతో ఉండాలని నిర్ణయించుకున్నాను.
జీవితంలో నేను నేర్చుకున్నది ఎప్పుడూ వదులుకోకుండా, ఎల్లప్పుడూ ఆశతో నవ్వుతూ ఉండడం, నా ఆట ద్వారా నేను పొందిన దానిలో కొంత భాగం ప్రజలకు ఇచ్చి.. వారిలో కూడా చిరునవ్వులను తీసుకురావాలనేది నా లక్ష్యం. తిరిగి ఇవ్వడం ద్వారా వచ్చే ఆనందం మాటల్లో చెప్పలేనిది. అందుకే యాడ్స్ ద్వారా వచ్చిన సంపాదనలో 10% రిషబ్ పంత్ ఫౌండేషన్ { Rishabh pant Foundation} ద్వారా పేదలకు ఖర్చు చేస్తాను.
రిషబ్ పంత్ ఫౌండేషన్ నాకు చాలా ఇష్టమైంది. దాని లక్ష్యాలు నా హృదయానికి దగ్గరగా ఉన్నాయి. మరో రెండు నెలల్లో దీని పూర్తి వివరాలు వెల్లడిస్తాను. మీ ప్రేమ, ఆశీస్సులు, మద్దతుకు ధన్యవాదాలు”. అంటూ రిషబ్ పంత్ ఓ వీడియోని రిలీజ్ చేశారు. ఇలా రిషబ్ పంత్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల అతని అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గొప్ప వాళ్ళు ఎప్పుడూ గొప్పగానే ఆలోచిస్తారని కామెంట్స్ చేస్తున్నారు.
ఇక ఇటీవల జరిగిన ఐపీఎల్ 2025 మెగా వేలంలో రిషబ్ పంత్ అత్యధిక ధరకు అమ్ముడుపోయిన క్రికెటర్ గా చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. లక్నో సూపర్ జాయింట్ అతడిని ఏకంగా రూ. 27 కోట్లకు కొనుగోలు చేసింది. అంతేకాకుండా తమ జట్టుకు కెప్టెన్ గా నియమించింది. ఇక రిషబ్ పంత్ ప్రస్తుతం సుమారు 10 కోట్ల ఉత్పత్తులకు ప్రచారకర్తగా ఉన్నట్లు సమాచారం.
ప్రస్తుతం టీమిండియాలో మూడు ఫార్మాట్లలో కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు. 2017లో టీమిండిగా తరఫున అరంగేట్రం చేసిన పంత్.. ఇప్పటివరకు 150 అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడాడు. జట్టులో ఓ కీలక ఆటగాడిగా ఎదిగాడు. 2024 లో టీమిండియా టి-20 వరల్డ్ కప్ గెలవడంలో పంత్ కూడా ఓ సభ్యుడు. ఇక విదేశీ గడ్డపై దూకుడుగా ఆడడంలో పంత్ కి మరెవ్వరూ సాటిరారు.
#RishabhPantFoundation #RP17 pic.twitter.com/WV45tNDI3g
— Rishabh Pant (@RishabhPant17) February 5, 2025