Mumbai Indians : టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మకి, ముంబై ఇండియన్స్ కి మధ్య వ్యవహారం ఏదో చెడిందనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. మరెక్కడ తేడా కొట్టిందో తెలీదుకానీ, రోహిత్ శర్మని మానసికంగా దెబ్బతీయడానికి ముంబై ఇండియన్స్ కంకణం కట్టుకున్నట్టుగా కనిపిస్తోంది. అందుకే పదే పదే తనని పదిమందిలో అవమానం చేస్తూ వెళుతోంది. తాజాగా ఈరోజు మరోక ఇష్యూలో రోహిత్ శర్మని డీ గ్రేడ్ చేస్తూ ప్రవర్తించింది.
ఇంతకీ విషయం ఏమిటంటే జనవరి 25నుంచి ఇంగ్లాండ్ తో టీమ్ ఇండియా తొలి టెస్ట్ మ్యాచ్ జరగనుంది. ఇందుకు ముంబై ఇండియన్స్ ఒక పోస్టర్ విడుదల చేసి, టీమ్ ఇండియాకి కంగ్రాట్స్ చెప్పింది. అందులో తమ ముంబై ఇండియన్స్ లో ప్లేయర్ల ముగ్గురి ఫొటోలు ప్రచురించింది. వారిలో కేఎల్ రాహుల్ ఫొటోని పెద్దగా వేసింది. దాని పక్కన బుమ్రా, శ్రేయాస్ అయ్యర్ల ఫొటోలు పెట్టింది.
అంటే దీని ఉద్దేశం ఏమిటి?అని అందరూ ప్రశ్నిస్తున్నారు. ఇండియా టీమ్ లో టెస్ట్ జట్టుకి ఎంపికైన ముగ్గురు ముంబై ఇండియన్స్ క్రికెటర్ల ఫొటోలు వాడారు. కానీ అసలైన కెప్టెన్ రోహిత్ శర్మ ఫొటో వాడలేదు. అంటే వారి ఉద్దేశం ఏమిటి? అని ప్రశ్నిస్తున్నారు. అంటే ఇంక ముంబై ఇండియన్స్ రోహిత్ శర్మని వదిలేసుకున్నట్టేనా? లేక రోహిత్ శర్మే గుడ్ బై చెప్పేశాడా? అంటున్నారు.
నిజానికి హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్ కూడా ముంబై ఇండియన్స్ లోనే ఉన్నారు. కాకపోతే వారిద్దరూ టెస్ట్ జట్టులో లేరు. అంతేకాదు గాయాలపాలై ఉన్నారు. అందువల్ల వారిని వదిలేశారంటే అర్థం ఉంది. మరి రోహిత్ శర్మ ఏం చేశాడు? మిమ్మల్ని పబ్లిగ్గా పల్లెత్తు మాట కూడా అనలేదు కదా అంటున్నారు. కానీ పదే పదే తనని గుచ్చడం కరెక్ట్ కాదంటున్నారు. కెరీర్ చివరి దశలో ఉన్నరోహిత్ తో ఇలా వ్యవహరించడం మంచి విధానం కాదని అంటున్నారు.
అంతేకాదు ముంబై ఇండియన్స్ పై ఉన్న గౌరవం కూడా వారికి వారే తగ్గించుకుంటున్నారని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఇది ముఖేష్ అంబానీకి తగులుతుందని చెబుతున్నారు. వీళ్లింతగా బరి తెగించారంటే అందుకు బలమైన కారణమేదో ఉండే ఉంటుందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.
ఈమధ్య రోహిత్ శర్మకు కోపం చాలా ఎక్కువగా వస్తోంది. ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ నుంచి తొలగించి హార్దిక్ పాండ్యాకి ఇవ్వగానే, మీడియాకి తెలీకుండా రోహిత్ ఏమైనా రియాక్ట్ అయ్యాడా? గిల్ మీద సీరియస్ అయినట్టే వారిని కూడా ఏమైనా అన్నాడా? లేకపోతే ఎందుకిలా ముంబై ఇండియన్స్ పగ బడుతుంది? అని అంటున్నారు.
ఒకవేళ రోహిత్ ఆవేదనతో అన్నా, ఐదుసార్లు ముంబై ఇండియన్స్ కి ట్రోఫీ అందించిన రోహిత్ ని ఇలా అవమానించడం సరికాదని సీనియర్లు పేర్కొంటున్నారు. ఇది ముంబై ఇండియన్స్ దురహంకారానికి నిదర్శనం అని సీరియస్ అవుతున్నారు. అప్పుడే అభిమానులు ముంబై ఇండియన్స్ తీరుపై ట్రోలింగ్ మొదలు పెట్టారు. ఎవరితో పెట్టుకున్నా పర్లేదు కానీ, సోషల్ మీడియాతో పెట్టుకుంటే బతుకు…చింపిన విస్తరి అయిపోతుందని డ్యాష్ డ్యాష్ అంటున్నారు.
మరి బీసీసీఐ ఏం చేస్తోంది. టీమ్ ఇండియా కెప్టెన్ పరిస్థితే, ఒక ఫ్రాంచైజీలో ఇలా ఉంటే, మిగిలిన వారి దుస్థితి ఇంకా దారుణంగా ఉండే ఉంటుంది. ఇలాంటివాటిని బీసీసీఐ నియంత్రించాలనే డిమాండ్లు అధికంగా వినిపిస్తున్నాయి.
వ్యాపార దృక్పథం నుంచి వచ్చేవారిని కంట్రోల్ చేయకపోతే, వీరు టీమ్ ఇండియా భవిష్యత్తునే నాశనం చేస్తారు, దాని ఉనికిని, మనుగడనే ప్రశ్నార్థకం చేస్తారని నెటిజన్లు సీరియస్ అవుతున్నారు. వారిదే పోయింది.. ఆ ఫ్రాంచైజీని అమ్ముకుపోతారు…
కానీ బీసీసీఐ చిరకాలం ఉండాల్సిన సంస్థ, అంతేకాదు టీమ్ ఇండియా పెర్ ఫార్మెన్ చేసినంత కాలం భారత్ లో క్రికెట్ కి ఆదరణ ఉంటుంది. బంగారు బాతులాంటి క్రికెట్ లో గుడ్లు తినాలి కానీ, బాతుని చంపుకోకూడదని సలహాలిస్తున్నారు.