
Rohit Sharma : వరుసగా తొమ్మిది విజయాలతో నాన్ స్టాప్ గా వన్డే వరల్డ్ కప్ 2023లో దూసుకుపోతున్న ఇండియా గెలుపు మంత్ర ఏమిటని అందరూ అడిగిన దానికి కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు.
ఇందులో గెలుపు మంత్ర ఏమీలేదు. ఓన్లీ గేమ్ ప్లాన్ మాత్రమే ఉందని అన్నాడు. ఇండియాలో మెగా టోర్నీ జరగడం వల్ల మాకు పిచ్ ల మీద అవగాహన ఉండటం కొంచెం అడ్వాంటేజ్ అయ్యిందని తెలిపాడు. రకరకాల ప్రాంతాలు, విభిన్నమైన పిచ్ లు, అన్నిటి మీదా ఒకేలా ఆడలేం…కానీ టీమ్ ఇండియా అంతా కలిసికట్టుగా ఆడిందని అన్నాడు.
అదొకటి గెలుపు సూత్రం అని అన్నాడు.
టీమ్ ఇండియాలోని ప్రతీ ఒక్కరూ కష్టపడ్డారు. అందరూ అద్భుతమైన ఫామ్ లో ఉన్నారని అన్నాడు. ప్రతీ ఒక్కరూ ఒకొక్క సందర్భంలో మ్యాచ్ విన్నర్లుగా మారారని అన్నాడు. మేం తొలి నాలుగు మ్యాచ్ లు ఛేజింగ్ లో ఆడినవే ఉన్నాయి. ఇందులో బ్యాట్స్ మెన్లు ప్రధాన పాత్ర పోషించారు.
తర్వాత ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు మ్యాచ్ గెలిపించే బాధ్యతను బౌలర్లు తీసుకున్నారు. వారు గెలిపించారు. ఇలా ఒకరికి ఒకరు తోడుగా ఉన్నాం. డ్రెస్సింగ్ రూమ్ లో కూడా ఒక ఆరోగ్యకరమైన వాతావరణం ఉంది. అంతా ఆహ్లాదకరంగా ఉంది. ఇదొక మంచి పరిణామమని అన్నాడు.
అందరూ మనసుపెట్టి ఆడుతున్నారు. ఈసారి ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉన్నారని అన్నాడు. ఒక సానుకూల దృక్పథం మమ్మల్ని నడిపిస్తోందని తెలిపాడు. ప్రతి మ్యాచ్ కి ముందు రోజు ఎలా ఆడాలనే గేమ్ ప్లాన్ ఒకటి రాసుకుంటున్నాం. అది గ్రౌండ్ లో అమలు చేస్తున్నామని తెలిపాడు. పిచ్ స్వభావాన్ని బట్టి, గ్రౌండ్ లోకి వెళ్లాక మారిన పరిస్థితులను బట్టి అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ విజయం సాధిస్తున్నామని అన్నాడు. అవన్నీ సఫలీకృతం అయ్యాయని అన్నాడు.
ఇక చివరిగా ఒకమాటన్నాడు. ఐదుగురు బౌలర్లతో పోరాటంలోకి దిగినప్పుడు స్కోరు బోర్డుపై భారీగా పరుగులుంటే, అంటే నెదర్లాండ్ పై చేసినట్టు 410 ఉంటే వారిపై ఒత్తిడి ఉండదు. కానీ లీగ్ చివరి మ్యాచ్ లో మాకు తొమ్మిది మంది బౌలర్లు ఉన్నారని నవ్వుతూ అన్నాడు. అంటే సరదాగా అన్నా…ఇది సీరియస్ మేటర్ అని చెప్పకనే చెప్పాడు. రేపు సెమీ ఫైనల్, ఫైనల్ మ్యాచ్ ల్లో ఇలా ఎదురు కాకూడదని, ముఖ్యంగా షమీ మళ్లీ పికప్ కావాలని, రోహిత్ శర్మలాగే మనమూ కోరుకుందాం.