Sania Mirza : టెన్నీస్ లెజెండ్ సానియా మీర్జా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. ఈమె టెన్నీస్ పరంగా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందింది. భారత టెన్నీస్ చరిత్రలో ఆమె ఒక సంచలనం అనే చెప్పాలి. సింగిల్స్, డబుల్స్, మిక్స్ డ్ డబుల్స్ లో ఇలా అన్నింట్లో కూడా మన దేశానికి పతకాలను తీసుకొచ్చింది. మరోవైపు నాలుగు సార్లు ఒలంపిక్స్ లో పాల్గొని సత్తా చాటింది. రెండు దశాబ్దాల తన సుదీర్జ టెన్నీస్ కెరీర్ కి 2023 ఫిబ్రవరి నెలలో టెక్నీస్ కి వీడ్కోలు పలింకింది. అకస్మాత్తుగా సానియా తన రిటైర్మెంట్ ప్రకటించడంతో అభిమానులు అంతా ఆశ్చర్యపోవడం విశేషం. అప్పట్లో అభిమానులు దీని వెనుక ఉన్న అసలు కారణం ఏంటి తెలుసుకోవాలని ప్రయత్నించార. కానీ అప్పుడు చెప్పలేదు. ఇటీవలే ఓ పాడ్ కాస్ట్ షో లో వెల్లడించింది సానియా మీర్జా.
ముఖ్యంగా తన కెరీర్ ను సమతుల్యం చేసుకోవడంలో తన కొడుకు ఇజాన్ ను పెంచడంలో వచ్చిన భావోద్వేగ సవాళ్ల గురించి చెప్పుకొచ్చింది. ఓ పాడ్ కాస్ట్ లో ప్రొఫెషనల్ టెన్నీస్ నుంచి రిటైర్డ్ కావాలనే తన నిర్ణయం వెనుక ఉన్న వ్యక్తిగత కారణాల గురించి మాట్లాడారు సానియా మీర్జా. ప్రధానంగా కొడుక్కి పాలు ఇచ్చే తరుణంలో తాను శారీరకంగా, మానసికంగా కుంగిపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ సమయంలోనే ఆట పరంగా.. ఇతర పనులు, నిద్రలేమి సమస్యలు ఎదురయ్యాయని వెల్లడించారు. అప్పుడు తనకు బ్రెస్ట్ ఫీడింగ్ కష్టం అనిపించిందని.. ఆ తరువాత తన శరీరం ఆటకు సహకరించకపోవడంతో రిటైర్మెంట్ ప్రకటించానంటూ ఆమె చెప్పుకొచ్చారు. రిటైర్డ్ అయ్యాక తన కుమారుడితో ఎక్కువగా సమయం గడపాలని నిర్ణయించుకున్నానని స్పష్టం చేసింది. అక్టోబర్ 30, 2018న తన ప్రసవానికి ముందు రాత్రి కూడా టెన్నీస్ ఆడుతూ శారీరకంగా ఫిట్ గా ఉన్నానని గుర్తు చేసుకుంది సానియా మీర్జా. ప్రెగ్నెన్సీ ఒక బెస్ట్ ఎక్స్ పీరియన్స్ అయితే.. బ్రెస్ట్ ఫీడింగ్ చాలా కష్టంగా అనిపించిందని తెలిపింది. మరో మూడు సార్లు తాను గర్భం దాల్చినా కానీ.. బ్రెస్ట్ ఫీడ్ మాత్రం చేయలేను అని అనుకుంటున్నానని చెప్పుకొచ్చింది.
వృత్తి, ఉద్యోగాల్లో కొనసాగే చాలా మంది మహిళలను మామ్ గిల్ట్ వేధించడం సాధారణమే. కెరీర్ ధ్యాసలో పడి పుట్టిన బిడ్డను నిర్లక్ష్యం చేస్తున్నానేమో అన్న అపరాధ భావన. ఒక దశలో తాను ఇలాంటి భావనతోనే నలిగిపోయానంటూ ఆ సందర్భాన్ని గుర్తు చేసుకుంది సానియా మీర్జా. ” ఇజాన్ పుట్టి ఆరు వారాలు అయింది. ఆ సమయంలో తాను ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమానికి తప్పకుండా హాజరు కావాల్సి ఉంది. పసి బిడ్డను, పాలు తాగే పిల్లాడిని ఎలా వదిలి పెట్టాలి..? ఇది నా వల్ల అయ్యే పనేనా..? ఇలా నా మనస్సులో ఎన్నోప్రశ్నలు మొదలయ్యాయి. అయినా ఫ్లైట్ ఎక్కక తప్పలేదు. నేను బయలు దేరే వరకు ఇజాన్ కి పాలు ఇస్తూనే ఉన్నా. విమానంలోనూ బ్రెస్ట్ పంప్ సహాయంతో పాలు తీసి భద్రపరిచాను. తిరిగి సాయంత్రం వరకు ఇల్లు చేరుకున్నా. బిడ్డను చూడాలనే ఆరాటం నన్ను నిలువనివ్వలేదు. ఇంటికి వచ్చి వాడిని చూస్తే కానీ నా మనస్సు కుదుటపడలేదు” అంటూ చెప్పుకొచ్చింది సానియా మీర్జా.

Share