
Satya Nadella : వన్డే వరల్డ్ కప్ లో భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య బుధవారం జరిగిన తొలి సెమీ ఫైనల్ మ్యాచ్ ఎంతో ఆసక్తిగా సాగింది. యావత్ క్రికెట్ ప్రపంచం ఫలితం కోసం ఉత్కంఠ ఎదురుచూసింది. టీమిండియా అద్భుతంగా ఆడి కివీస్ ను ఓడించి ఫైనల్ కు దూసుకెళ్లింది. దీంతో సంబరాలు అంబరాన్నింటాయి.ఈ మ్యాచ్ జరుగుతున్నంతసేపు క్రికెట్ ఫ్యాన్స్ టీవీలకు అతుక్కుపోయారు. ఎంతో ఆసక్తిగా మ్యాచ్ ను తిలకించారు.
మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల కూడా భారత్- కివీస్ మ్యాచ్ ను చూశారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తెలిపారు. సియాటెల్‌లో మైక్రోసాఫ్ట్ డెవలపర్ కాన్ఫెరెన్స్‌లో పాల్గొన్న తర్వాత పూర్తిగా మ్యాచ్‌లో మునిగిపోయానని మ్యాచ్ అనుభవాలను పంచుకున్నారు. రాత్రంతా మేల్కొని ఉన్నానని వివరించారు. ఇగ్నైట్ పేరిట నిర్వహించిన కాన్ఫెరెన్స్‌ను షెడ్యూల్ చేసినప్పుడు మ్యాచ్ విషయంపై అవగాహన లేదని చెప్పారు. టీమిండియా సెమీస్ లో గెలిచి ఫైనల్ కు చేరుకోవడంపై సంతోషం వ్యక్తం చేశారు.
వన్డే ప్రపంచకప్ లో తొలి సెమీస్ ముంబై వేదికగా బుధవారం జరిగింది. ఈ మ్యాచ్ లో 70 పరుగుల తేడాతో కివీస్ పై భారత్ గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్ సెంచరీలు బాదడంతో 4 వికెట్లకు 397 పరుగుల భారీ స్కోర్ సాధించింది. శుభ్‌మన్ గిల్, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ మెరపులు మెరిపించారు. మహమ్మద్ షమీ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఏడు పడగొట్టి కివీస్ రెక్కలు విసిరాడు. దీంతో మిచెల్, విలియమ్సన్ పోరాడినా కివీస్ 48.5 ఓవర్లలో 327 పరుగులకే ఆలౌటైంది.